🔳ఇకపై నాలుగేళ్ల డిగ్రీ.. ఎనిమిది సెమిస్టర్లతో కొత్త విధానం
కొత్త పద్ధతికి పచ్చజెండా ఊపిన యూజీసీ
పీహెచ్డీ ప్రవేశాల అంశంలో పలు సవరణలు
న్యూఢిల్లీ, మార్చి 16: జాతీయ విద్యా విధానంలో ప్రతిపాదించిన నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రామ్(ఎఫ్‌వైయూపీ)కి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఆమోదం తెలిపింది. ఈ మేరకు విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో మార్చి 10న నిర్వహించిన సమావేశంలో నాలుగేళ్ల కోర్సు అమలు విధానాన్ని నిర్ణయించింది. కొత్త విధానం ప్రకారం నాలుగేళ్ల ప్రొగ్రామ్‌లో ఒక్కొక్కటి 90 రోజుల చొప్పున మొత్తం ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. మొదటి మూడు సెమిస్టర్లలో విద్యార్థులు మానవీయ శాస్త్రాలు, సామాజిక శాస్త్రం, గణితం, వృత్తి విద్యకు సంబంధించిన సబ్జెక్టులు చదువుతారు. మూడో సెమిస్టర్ ముగిసిన తర్వాత ప్రతీ విద్యార్థి డిగ్రీలో తన మేజర్, మైనర్ సబ్జెక్టులు ఎంపిక చేసుకోవాలి. విద్యార్థి ఆసక్తి, అప్పటిదాకా పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా సబ్జెక్టుల కేటాయింపు ఉంటుంది. ఏడు, ఎనిమిది సెమిస్టర్లలో విద్యార్థులు తాము ఎంచుకున్న సబ్జెక్టులోని ఏదైనా అంశంపై పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. కాగా, మొదటి సంవత్సరం తర్వాత కోర్సు నుంచి తప్పుకున్న వారికి కూడా సర్టిఫికెట్ ఇస్తారు. రెండేళ్ల కోర్సు పూర్తి చేసిన వారికి డిప్లమో , మూడేళ్లు పూర్తి చేసిన విద్యార్థులకు బ్యాచులర్స్ డిగ్రీ, మొత్తం నాలుగేళ్ల కోర్సు పూర్తి చేసిన వారికి బ్యాచులర్స్ డిగ్రీతోపాటు హానర్స్ కూడా అందజేస్తారు. కాగా, ఈ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో ఆర్ట్స్, సైన్స్ గ్రూపులకు, వొకేషనల్, అకడమిక్ విభాగాలకు పెద్దగా వ్యత్యాసం ఉండదు. క్రీడలతోపాటు అన్నిరకాల సబ్జెక్టులు కలిసే విధంగా విద్యా విధానాన్ని మార్చారు. ఈ నాలుగేళ్ల కోర్సును విద్యార్థులు 160 క్రెడిట్ అవర్స్(గంటలు)లో పూర్తి చేయాల్సి ఉంటుంది. కాగా, ఎఫ్వైయూపీలోని కోర్సులకు సబ్జెక్టుల స్థాయి ఆధారంగా ప్రత్యేక కోడ్లు కూడా కేటాయించారు. 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఢిల్లీ విశ్వవిద్యాలయం ఈ కొత్త విద్యా విధానాన్ని అమలు చేయనుంది. ఇతర విశ్వవిద్యాలయాలు కూడా వీలైనంత త్వరగా కొత్త విధానాన్ని అమలు చేయాలని కేంద్ర విద్యాశాఖ కోరుతుంది.
పీహెచ్‌డీకి కొత్త పరీక్ష..
పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించి యూజీసీ కీలక మార్సు చేసింది. ఇప్పటికే ఉన్న నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కి అదనంగా మరో ప్రవేశ పరీక్ష పెట్టింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఎన్ఈటీ లేదా జేఆర్ఎఫ్ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇన్నాళ్లు వర్సిటీలు పీహెచ్డీ ప్రవేశాలు కల్పించేవి. కానీ ఇకపై ఎన్ఈటీ/జేఆర్ఎఫ్ ద్వారా 60 శాతం సీట్లనే భర్తీ చేస్తారు. మిగిలిన 40 శాతం సీట్లను విశ్వవిద్యాలయాలు ప్రత్యేక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా భర్తీ చేస్తాయి. ఇందుకు సంబంధించిన విధి విధానాలతో రూపొందించిన ముసాయిదాకు మార్చి 10న జరిగిన యూజీసీ కమిషన్ సమావేశంలో ఆమోదం లభించింది. వివరాలను యూజీసీ వెబ్సైట్లో పెట్టనున్నారు. ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కొత్త విధానంపై తుది నిర్ణయం తీసుకుని కేంద్ర విద్యా శాఖ ఆమోదానికి పంపిస్తారు. ఎన్ఈటీ/జేఆర్ఎఫ్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇంటర్వ్యూ, వైవా పరీక్షల తర్వాత పీహెచ్‌డీకి ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు 70, ఇంటర్వ్యూకు 30 శాతం మార్కులు ఉంటాయి. కొత్తగా ప్రతిపాదించిన ప్రవేశ పరీక్షను వర్సిటీలు వేటికి అవే నిర్వహించుకుంటాయి. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. రిజర్వేషన్ ఉన్న విద్యార్థులకు 5 శాతం మినహాయింపు ఇస్తారు. ఇంటర్వ్యూ, వైవాకు మిగిలిన 50 శాతం మార్కులు ఉంటాయి. కాగా, పీహెచ్డీ అభ్యర్థికి సూపర్వైజర్గా వ్యవహరించే అధ్యాపకుని బాధ్యతల విషయంలోనూ యూజీసీ పలు సవరణలు చేసింది.
0 Comments:
Post a Comment