🔳ఒంటిపూట బడులెప్పుడో?
చుర్రుమంటున్న ఎండలు
పాఠశాలల్లో విద్యార్థుల అవస్థలు..
ఏటా మార్చి 15 నుంచే అమలు ఏప్రిల్ వస్తున్నా పట్టని ప్రభుత్వం
అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ఎండలు చుర్రుమంటున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. ఇంత ఎండల్లోనూ చిన్న పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ బడుల్లోనే అవస్థలు పడుతున్నారు. మార్చి నెల పూర్తవుతున్నా ఒంటిపూట బడులపై పాఠశాల విద్యాశాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏటా మార్చి 15 నుంచే ఒంటిపూట బడులు పెట్టడం ఆనవాయితీ. ఆ సమయానికి ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్న అంచనాతో దశాబ్దాల తరబడి ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. అయితే ఈసారి రాష్ట్రంలో ఆ విధానం అమలు కాలేదు. ఒంటిపూట బడుల సమయం దాటిపోయి 15రోజులవుతున్నా, ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నా విద్యాశాఖ ఆ ఊసే ఎత్తడం లేదు. తీవ్రమైన ఎండలకు చాలామంది విద్యార్థులకు ముక్కులు, కళ్లల్లో మంట తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటేయగా, కోస్తాలో కూడా 35 డిగ్రీల పైనే ఉంటోంది. కర్నూలులో ఏకంగా 43.5 డిగ్రీల వరకూ నమోదవుతోంది. ఇప్పటికైనా ఒంటిపూట బడులు పెట్టకుంటే పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ కారణంగా ఈ విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఒంటిపూట బడుల విషయంలో విద్యాశాఖ జాప్యం చేస్తోందని సమాచారం. అయితే అంతకుముందు ఏడాది ఈ మాత్రం తరగతులు కూడా జరగలేదని పలువురు గుర్తుచేస్తున్నారు. దానితో పోలిస్తే ఈసారి పరిస్థితి చాలావరకూ మెరుగుపడిందని చెబుతున్నారు. విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనంత మాత్రాన ఒంటిపూట బడులను మరీ ఇంత ఆలస్యంగా పెట్టాల్సిన అవసరం లేదంటున్నారు. మార్చి 15కు బదులుగా కనీసం 25 నుంచైనా ఈ విధానం ప్రారంభించి ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఏప్రిల్ వస్తున్నా విద్యాశాఖ ఆ ఊసే ఎత్తడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బడులు కొనసాగిస్తే పిల్లలకు ఎండదెబ్బ తగిలే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా విద్యాశాఖ స్పందించి పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒంటిపూట బడులను ప్రకటించాలని పలువురు కోరుతున్నారు. వేసవి తీవ్రత విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోందని, వెంటనే ఒంటిపూట బడులను నిర్వహించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సాయి శ్రీనివాస్, తిమ్మన్న, ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు.
0 Comments:
Post a Comment