ఓలా, ఒకినావా తర్వాత మంటల్లో కాలిపోతున్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్..!
చెన్నై: ప్రపంచ వ్యాప్తంగా చమరు ధరలు పెరుగుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఎలక్ట్రిక్ వాహన రంగంపై ఇటీవల జరిగిన సంఘటనల వల్ల నీలి నీడలు అలుముకున్నాయి.
గత కొద్ది రోజుల క్రితం ఓలా ఎలక్ట్రిక్, ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగిన సంగతి మనకు తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదం వల్ల ఇద్దరు చనిపోయారు. అయితే, ఈ సంఘటనలు మరిచిపోకముందే చెన్నైలో ప్యూర్ ఈవీ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగాయి.
చెన్నైలో మంటలు చెలరేగుతున్న ప్యూర్ ఈవీ స్కూటర్ వీడియోను ది ఎకనామిక్ టైమ్స్'కు చెందిన సుమంత్ బెనర్జీ ట్వీట్ చేశారు. కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాల భద్రత గురించి ఈ సంఘటన తర్వాత మరింత ఆందోళన చెందుతున్నారు. సుమంత్ బెనర్జీ ట్వీట్ చేసిన వీడియోలో రద్దీగా ఉండే రహదారి పక్కన పార్క్ చేసిన ఎరుపు ప్యూరీ ఈవీ ద్విచక్ర వాహనంలో నుంచి దట్టమైన పొగలు రావడాన్ని మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ సంఘటన వల్ల ఆ ప్రాంతంలో కొద్ది సేపు ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు 4 రోజుల్లో 4 జరిగాయి అని సుమంత్ బెనర్జీ పేర్కొన్నారు.
ఇది ఇలా ఉంటే, కొద్ది రోజుల క్రితం ఓలా, ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగిన రెండు సంఘటనలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వాహన దారులను ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేసే విధంగా వాటిపై భారీ రాయితీలు కూడా అందిస్తుంది. ఇలాంటి, కీలక సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలలో మంటలు చెలరేగడంతో ప్రజలలో ఉన్న భయాందోళనలను తగ్గించడానికి కేంద్రం ఈ రెండు సంఘటనలపై దర్యాప్తు చేయడానికి స్వతంత్ర నిపుణుల బృందాన్ని నియమించింది. పూణేలో జరిగిన సంఘటనలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు అంటుకోగా, తమిళనాడులోని వెల్లూరులో ఒకినావా ద్విచక్రవాహనానికి మంటలు అంటుకున్నాయి.
0 Comments:
Post a Comment