ఉద్యోగుల కేటాయింపు ఎలా..?
ప్రభుత్వం నుంచి రాని స్పష్టత అధికారులు, సిబ్బందిలో ఉత్కంఠ
విశాఖపట్నం, న్యూస్‌టుడే
జిల్లాల పునర్విభజన ప్రక్రియ జోరుగా సాగుతోంది.
అనకాపల్లి, పాడేరు కేంద్రాలుగా రానున్న కొత్త జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారుల కార్యాలయాలు, నివాస భవనాల ఎంపిక పూర్తయింది. ఆయా చోట్ల మౌలిక వసతుల కల్పన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అయితే కీలకమైన ఉద్యోగులు, అధికారుల కేటాయింపు ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు.
* మండలాలు, ఆర్డీఓ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు ఎక్కడివారు అక్కడే ఉండే అవకాశం ఉంది. జిల్లా స్థాయిలో పనిచేసే ఉద్యోగులు, అధికారుల సర్దుబాటు చేయాల్సి ఉంది. అది ఎలా ఉండబోతుందో తెలియక అధికారులు, ఉద్యోగులు తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. ఇప్పటికే శాఖల వారీ ఉద్యోగులు, సీనియార్టీ, స్వస్థలాల వివరాలను ఆయా శాఖ రాష్ట్ర కార్యాలయాలకు పంపారు. ప్రస్తుతం రాష్ట్ర శాఖాధిపతుల ఆధ్వర్యంలో ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది.
* సీనియర్లను ప్రస్తుతం జిల్లాల్లో కొనసాగించి, జూనియర్లకు కొత్త జిల్లాలు కేటాయించనున్నారు. ఈ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదాహరణకు విశాఖ కలెక్టరేట్‌ను తీసుకుంటే ప్రస్తుతం 8 విభాగాలు, మరో మూడు స్పెషల్ యూనిట్లు పనిచేస్తున్నాయి. ఆయా విభాగాలకు తహసీల్దార్ క్యాడర్ అధికారి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. వీరిలో కలెక్టరేట్లో ఎంత మందిని ఉంచుతారు? కొత్తగా రానున్న అనకాపల్లి, పాడేరు జిల్లాలకు ఎంతమంది పంపుతారు? అనే విషయమై ఇంకా స్పష్టతరాలేదు.
* జిల్లాల విభజన తర్వాత కలెక్టరేట్‌పై ఒత్తిడి తగ్గుతుంది. విశాఖ జిల్లా పరిధిలోకి కేవలం పది మండలాలు, రెండు ఆర్డీఓ కార్యాలయాలు రానున్నాయి. దీంతో కలెక్టరేట్లో విభాగాల సంఖ్య కుదించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదు.
ఎవరు ఎక్కడ ఉంటారో..?
మరో వారం రోజుల వ్యవధిలో కొత్త జిల్లాలు ఆవిర్భవించనున్నాయి. ఎవరు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా రోజురోజుకు ఉద్యోగ వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ప్రస్తుత జిల్లా అధికారుల్లో గిరిజన ప్రాంతానికి ఎంత మంది వెళతారు? అనకాపల్లికి ఎంత మంది వెళతారనే విషయమై స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వ శాఖల్లో జోరుగా చర్చ నడుస్తోంది. కీలకమైన కలెక్టర్, సంయుక్త కలెక్టర్లు, ఎస్పీ, జిల్లా రెవెన్యూ అధికారి స్థాయి పోస్టులో ఎవరెవరు రాబోతున్నారు.. ముఖ్యంగా జిల్లా కలెక్టర్‌గా ప్రస్తుతం ఉన్న మల్లికార్జున కొనసాగుతారా? లేకా కొత్తగా మరో అధికారి వస్తారా అనే విషయమై చర్చ సాగుతోంది. దీనిపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.
0 Comments:
Post a Comment