పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించే వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని మరింత మంది రైతులకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
2020-21 రబీలో రూ.లక్ష లోపు రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు వచ్చే నెలలో వడ్డీ రాయితీని జమ చేయనుంది. ఇప్పటికే ఈ సీజన్లో 7.20 లక్షల మంది అర్హులున్నట్టుగా గుర్తించారు. వడ్డీతో సహా రుణాలు చెల్లించేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువున్నందున మరింత మందికి పథకం కింద లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 31 లోగా రుణాలు చెల్లించేందుకు ఆర్బీకేల ద్వారా రైతుల్లో అవగాహన కల్పిస్తోంది.
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం తీసుకున్న పంట రుణాలపై బ్యాంకులు 7 శాతం వడ్డీని వసూలు చేస్తాయి. ఇందులో 3 శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తుంది. మిగతా 4 శాతం వడ్డీని అర్హులైన రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. లక్ష లోపు రుణాలు తీసుకుని ఇప్పటికే తిరిగి చెల్లించిన వారు 7.20 లక్షల మంది ఉన్నారు. మిగతా వారు కూడా రుణాలు చెల్లించి, ఈ పథకానికి అర్హత పొందేలా ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తోంది.
పథకానికి అర్హత పొందాలంటే..
- ఏ పంటపై రుణం తీసుకున్నారో ఆ పంటే సాగు చేయాలి.
- పంట వివరాలను తప్పనిసరిగా ఈ క్రాప్‌లో నమోదు చేయించాలి.
- రుణాన్ని వడ్డీతో సహా ఏడాదిలోగా (మార్చి 31వ తేదీ) చెల్లించాలి.
- అర్హులైన రైతుల వివరాలను బ్యాంకుల ద్వారా వైఎస్సార్ ఎస్వీపీఆర్ పోర్టల్‌లో ఏప్రిల్ 7వ తేదీలోగా అప్లోడ్ చేస్తారు.
ఈ పథకం కింద రైతులకు 4 శాతం వడ్డీ రాయితీ లభిస్తుందని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. రూ.లక్ష లోపు పంట రుణాలు తీసుకొని, మార్చి 31 లోపు వడ్డీతో సహా రుణం మొత్తాన్ని చెల్లించిన వారు బ్యాంక్‌ను సంప్రదించి పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలని సూచించారు.
0 Comments:
Post a Comment