ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) కొత్త కేబినెట్ (AP Cabinet Updates) ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్నవారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారు. ఇద్దరు లేదా ముగ్గుర్ని తప్ప మిగిలిన వారందరినీ మార్చేస్తామని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు. మంత్రి పదవుల నుంచి తప్పించిన వారికి పార్టీ బాధ్యతలను అప్పగిస్తామని కూడా జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో మంత్రివర్గంలో ఎవరికి అవకాశం కల్పిస్తారు..? జాక్ పాట్ కొట్టే ఎమ్మెల్యేలు ఎవరు..? అనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఐతే ఈసారి మహిళలు ప్రాధాన్యత పెంచనున్నట్లు సమాచారం. ఆ లక్కీ ఛాన్స్ దక్కించుకునే మహిళా ఎమ్మెల్యేలు ఎవరు..? ఉన్నవారిలో ఎవరికి ఎక్కువ అవకాశాలున్నాయి.. సీఎం జగన్ ఎవరిని అందలమెక్కిస్తారనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం మంత్రివర్గంలో ముగ్గురు మహిళా మంత్రులున్నారు. వారిలో మేకతోటి సుచరిత హోం మంత్రిగా ఉండగా, పుష్ప శ్రీవాణి డిప్యూటీ సీఎంగా గిరిజన సంక్షేమ శాఖ చూస్తున్నారు. ఇక తానేటి వనిత స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఈ ముగ్గురికీ ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. ఈ సారి ఈ సంఖ్యను ఐదుకు పెంచాలని సీఎం జగన్ భావిస్తున్నారట.
ఈ ఐదు స్థానాలను ప్రాంతీయ, సామాజిక, రాజకీయ సమీకరణాల ఆధారంగా భర్తీ చేయనున్నరట. ఐదుగురు మహిళా మంత్రుల్లో ఒకటి ఓసీ, రెండు బీసీ, మరో రెండు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు ఇచ్చే అవకాశముంది. వీరిలో ఓసీ కేటగిరీలో నగరి ఎమ్మెల్యే రోజా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 2019లోనే ఆమె మంత్రి పదవిని ఆశించగా చిత్తూరు జిల్లా రాజకీయ, సామాజిక సమీకరణాల వల్ల పెద్దిరెడ్డి, నారాయణ స్వామిలకు మంత్రి పదవులు దక్కాయి. పెద్దిరెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఆమెకు మంత్రి పదవి రావడం ఖాయం.
ఇక బీసీ వర్గానికి వస్తే గుంటూరు జిల్లా నుంచి విడదల రజినీ, అనంతపురం జిల్లా నుంచి ఉషశ్రీ చరణ్ రేసులో ఉన్నారు. ఎమ్మెల్సీల్లో పోతుల సునీత, వరుదు కల్యాణీ ఉన్నారు. వీరిలో విడదల రజినీ, ఉషశ్రీ చరణ్ పేర్లు ప్రముఖుంగా వినిపిస్తున్నాయి. ఎస్సీ కోటాలో గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవీ, అనంతపురం జిల్లా నుంచి జొన్నలగడ్డ శ్రీదేవి పేర్లు వినిపిస్తున్నాయి.
ఎస్టీ కోటా విషయానికి వస్తే ప్రస్తుత డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అదే కోటాలో మంత్రి అయ్యారు. ఆమెను తప్పిస్తే.. ఆ స్థానంలో శ్రీకాకుళం జిల్లా నుంచి విశ్వాసరాయి కళావతి, విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి రేసులో ఉంటారు. వీరిలో కళావతి, భాగ్యలక్ష్మి మధ్యే పోటీ ఉండే అవకాశముంది. మరి అనూహ్య నిర్ణయాలకు పెట్టింది పేరైన సీఎం జగన్ వీరిలో ఎవరికి అవకాశం కల్పిస్తారో వేచి చూడాలి.
0 Comments:
Post a Comment