AP Cabinet Reshuffle: ఉండేదెవరు.. కొత్తగా వచ్చేదెవరు?
మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణపై జోరుగా చర్చ
ఈనాడు, అమరావతి: మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అంశం ఒక్కసారిగా మళ్లీ తెరమీదకు వచ్చింది.
కొందరికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని, జిల్లాల్లో పార్టీని వారే నడిపించాలని చెప్పడంద్వారా ఎన్నికలకు ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెడుతున్నట్లు కనిపిస్తోంది. కొందరిని కొనసాగించే అవకాశం ఉందని స్వయంగా ముఖ్యమంత్రే అనడంతో ఎవరెవరు కొనసాగుతారో.. కొత్తగా వచ్చేదెవరోనన్న చర్చ వైకాపా వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఉగాది తర్వాత కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయి. ఆ తర్వాతే మంత్రిమండలిలో మార్పుచేర్పులుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాల వారీగా, సామాజికవర్గాల వారీగా సమీకరణలు చూసుకుని ఈ మార్పులు చేయొచ్చని అంటున్నారు. కొన్ని జిల్లాల్లో పోటీ ఎక్కువ ఉండగా.. మరికొన్ని జిల్లాల్లో అసలు పోటీ లేదు. కొత్త విశాఖ జిల్లాలో వైకాపా నుంచి ఇద్దరే ఎమ్మెల్యేలుండగా, వారిలో అవంతి శ్రీనివాస్ మంత్రి. పక్కనే ఉన్న అనకాపల్లి జిల్లాలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, గొల్ల బాబూరావు, ముత్యాల నాయుడు, కరణం ధర్మశ్రీ మధ్య గట్టి పోటీ ఉంది. చిత్తూరు (కొత్త) జిల్లాలోనే ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గాలున్నాయి. వీరిలో ఒకరిని మార్చాల్సి వస్తే తొలగించిన మంత్రి సామాజిక వర్గానికి ఇదే జిల్లాలో అవకాశం ఇవ్వకపోవచ్చు. ఇలా సర్దుబాటు చేసేటప్పుడు కొందరికి అనూహ్యంగా పదవులు రావొచ్చనీ వైకాపా సీనియర్ నేత ఒకరు తెలిపారు.
కొనసాగే అవకాశం ఉండేవారు..
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స సత్యనారాయణలను రాజకీయ సమీకరణలతో కొనసాగించే అవకాశం ఉందంటున్నారు. సామాజికవర్గ సమీకరణలో భాగంగా గుమ్మనూరు జయరాంను కొనసాగించే అవకాశం ఉందంటున్నారు. (ఈయన సామాజికవర్గంలో ఈయనొక్కరే ఎమ్మెల్యే. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ సామాజికవర్గం ప్రభావవంతమైనది.) కృష్ణా జిల్లాలో కొడాలి నానిని కొనసాగిస్తారన్న ప్రచారం ఉంది. ఇదే జిల్లా పరిధిలో జోగి రమేష్ (పెడన), పార్థసారథి (పెనమలూరు) బీసీ కోటాలో పోటీలో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కన్నబాబును కొనసాగించే అవకాశం ఉందన్న ప్రచారముంది. ఇదే జిల్లా పరిధిలో ఉన్న తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు, జక్కంపూడి రాజాకూ (రాజానగరం) ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్న చర్చ ఉంది.
* ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థికశాఖను సమర్థంగా నిర్వహించేందుకు అవగాహన ఉన్న వ్యక్తి అవసరం. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఆర్థిక పరిస్థితి, తీసుకుంటున్న అప్పులు, కేంద్రం నుంచి నిధులు తెచ్చే అవకాశాలపై అవగాహన ఉన్నందువల్ల ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డినే కొనసాగించవచ్చన్న చర్చ ఉంది.
కొత్తగా అవకాశం ఉండేవారిలో...
కాపు సామాజికవర్గం నుంచి ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం అయిదుగురు మంత్రులు ఈ వర్గం నుంచి ఉన్నారు. కొత్తగా ఆశిస్తున్న వారిలో సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట), జక్కంపూడి రాజా (రాజానగరం), దాడిశెట్టి రాజా (తుని), గుడివాడ అమర్నాథ్ (అనకాపల్లి), గ్రంధి శ్రీనివాస్ (భీమవరం), అంబటి రాంబాబు (సత్తెనపల్లి), దూలం నాగేశ్వరరావు (కైకలూరు) ప్రధానంగా పోటీలో ఉన్నారు. వీరిలో జక్కంపూడి, దాడిశెట్టితో పాటు అమర్నాథ్, గ్రంధి శ్రీనివాస్లకూ గతంలోనే సీఎం హామీ ఇచ్చారన్న ప్రచారం ఉండటంతో పోటీ గట్టిగానే ఉంది.
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు నలుగురున్నారు. వీరిలో పెద్దిరెడ్డి, బుగ్గన కొనసాగితే మరో ఇద్దరికి అవకాశం రావచ్చంటున్నారు. అయితే ఈ సామాజిక వర్గం నుంచి కాకాణి గోవర్దన్‌రెడ్డి (సర్వేపల్లి), గడికోట శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), అనంత వెంకటరామిరెడ్డి (అనంతపురం), ఆళ్ల రామకృష్ణారెడ్డి (మంగళగిరి), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), మేడా మల్లికార్జునరెడ్డి (రాజంపేట), వై.బాలనాగిరెడ్డి (మంత్రాలయం)/ వై.సాయిప్రసాదరెడ్డి (ఆదోని), భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్కే రోజా ప్రధానంగా పోటీలో ఉన్నారు.
* వీరిలో కాకాణికి దాదాపు బెర్తు ఖాయమని ప్రచారం ఉంది. ఆళ్ల, మేడాకు గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారనేది తెలిసిందే. బాలనాగిరెడ్డి సోదరులు మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వారి కుటుంబంలో ఎవరో ఒకరికి మంత్రి పదవి కోరుతున్నారు. సీఎంకు భూమన సన్నిహితుడిగా గుర్తింపు ఉంది. చెవిరెడ్డి సీఎంకు అత్యంత సన్నిహిత అనుచరుడిగా ఉన్నారు. చిత్తూరు జిల్లా విభజనతో ఆయన రేసులోకొచ్చారు. రోజాకు ఈసారి మహిళా కోటాలో అవకాశం దక్కుతుందున్న ఆశాభావంతో ఆమె వర్గీయులున్నారు. అయితే పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాలో ఉండటంతో ఆమెకు అవకాశం దక్కుతుందా లేదా అనేది చూడాలి.
బీసీల్లో..: ప్రస్తుతం మంత్రుల్లో బీసీలు అయిదుగురున్నారు. బీసీ కోటాలో పోటీ పడుతున్న వారిలో రెడ్డి శాంతి (పాతపట్నం), కరణం ధర్మశ్రీ (చోడవరం) కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం), ముత్యాల నాయుడు (మాడుగుల), ఉషశ్రీ చరణ్ (కళ్యాణదుర్గం), కె.పార్థసారథి (పెనమలూరు), జోగి రమేష్ (పెడన) ఉన్నారు.
ముస్లింలలో: హఫీజ్‌ఖాన్ (కర్నూలు), ముస్తఫా (గుంటూరు తూర్పు) మధ్య తీవ్ర పోటీ ఉంది.
ఎస్టీల్లో: పీడిక రాజన్నదొరకు (సాలూరు) అవకాశం రావచ్చని వైకాపా వర్గాలు చెబుతున్నా.. కళావతి (పాలకొండ) పోటీలో ఉన్నారు. భాగ్యలక్ష్మి (పాడేరు), ధనలక్ష్మి (రంపచోడవరం), ఫల్గుణ (అరకు) మధ్య పోటీ ఉంది.
* బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి తొలివిడతలో ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. కోన రఘుపతి (బాపట్ల), మల్లాది విష్ణు (విజయవాడ సెంట్రల్) ఇద్దరిలో ఒకరికి పదవి రావచ్చన్న చర్చ ఉంది.
ఇన్ని సమీకరణల మధ్య కొత్త మంత్రివర్గ కూర్పు, రాబోయే ఎన్నికలపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్న అంశాలపై వైకాపాలో అంతర్గత చర్చ జోరుగా సాగుతోంది.
ఆ ఇద్దరికీ అవకాశముంటుందా?
ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం), ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి) ఇద్దరూ మంత్రులుగా చేసినవారే. కొత్త మంత్రిమండలిలో వీరికి చోటు దక్కుతుందా అనే చర్చ జరుగుతోంది. ధర్మాన సోదరుడు కృష్ణదాస్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనంకు ఆర్థిక మంత్రిగా అనుభవం ఉంది.
0 Comments:
Post a Comment