Andhra News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడింది: కేంద్ర ఆర్థిక శాఖ
దిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆర్థిక నిబంధనలు, పద్ధతులను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించినట్లు వెల్లడించింది.
ఈ విషయాన్ని కాగ్ నిర్ధారించిందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. బడ్జెట్ మొదటి విడత సమావేశాల్లో 377 నిబంధన కింద తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్నాయుడు లేవనెత్తిన అంశాలకు కేంద్ర ఆర్థిక శాఖ రాతపూర్వకంగా తెలియజేసింది.
''ఏపీ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని కాగ్ నిర్ధారించింది. 'వైఎస్ గృహవసతి' ఖర్చును మూలధన వ్యయం కింద తప్పుగా చూపించారు. రాష్ట్ర విపత్తు నిధికి కేంద్ర వాటా కింద రూ.324.15 కోట్లు ఇచ్చాం. జాతీయ విపత్తు నిధి కింద రాష్ట్ర ప్రభుత్వానికి రూ.570.91 కోట్లు ఇచ్చాం. 2020 మార్చితో ముగిసిన ఏడాదికి సంబంధించి నివేదికలో కాగ్ స్పష్టంగా వెల్లడించింది. రూ.1,100 కోట్ల విపత్తు నిధులను ఏపీ సర్కార్ మళ్లించింది. రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్ ఖాతాకు మళ్లించారు. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు దాన్ని మళ్లించారు. పంట నష్టపోయిన రైతులకు మాత్రం ఆ నిధులు అందించలేదు. విపత్తు సాయానికి ఖర్చు చూపించి ద్రవ్య వినిమయ చట్టం ఉల్లంఘనకు పాల్పడింది. ఏపీ సర్కార్ పూర్తిగా ఆర్థిక నిబంధనలు ఉల్లంఘించింది'' అని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది.
0 Comments:
Post a Comment