75 మంది ఎమ్మెల్యేల్ని గెలిపించే శక్తి ఉంది.
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్‌దారుల వేదిక డిమాండ్
ముఖ్యమంత్రి జగన్‌కు బహిరంగ లేఖ
ఈనాడు, అమరావతి: పీఆర్సీ ఉత్తర్వులతోపాటు అశుతోష్ మిశ్ర కమిషన్ నివేదిక ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఎందుకు మాట నిలుపుకోలేదని, పీఆర్సీలో రూ.5,400 కోట్ల రికవరీల నిలిపివేత, ఐదేళ్లకే పీఆర్సీపై ఉత్తర్వుల్ని ఇంతవరకు ఎందుకు విడుదల చేయలేదని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఛైర్మన్ సుధీర్‌బాబు ప్రశ్నించారు. విజయవాడలో సోమవారం పీఆర్సీపై ఏర్పాటైన కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్‌దారుల వేదిక తరఫున సీఎం జగన్‌కు బహిరంగ లేఖ విడుదల చేశారు.
అనంతరం సుధీర్‌బాబు మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో 75 మంది ఎమ్మెల్యేల్ని గెలిపించే శక్తి మాకుంది. మా సమస్యల్ని పరిష్కరించకపోతే తగిన గుణపాఠం చెబుతాం. పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ఉన్న అసంతృప్తి గురించి సీఎం జగన్‌కు చెప్పేందుకు సమయం ఇవ్వలేదు. నాలుగైదుసార్లు ఆయనను కలిసేందుకు ప్రయత్నించగా సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో బహిరంగ లేఖను విడుదల చేస్తున్నాం. మా సమస్యల్ని పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం. పీఆర్సీపై నిర్వహించిన అభిప్రాయ బ్యాలెట్లో.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దారుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే సీఎం కార్యాలయానికి 2 లక్షల విజ్ఞాపనలను పంపాం. అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ ప్రకటించారు. ఆ హామీని నెరవేర్చాలి. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పి.. చేయలేదు. పీఎఫ్, ఇతరత్రా అడ్వాన్సుల కోసం ఉద్యోగులు దరఖాస్తు చేసుకొని 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇవ్వలేదు. మేం దాచుకున్న డబ్బులేమయ్యాయి? సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీలు, కలిసొచ్చే సంఘాలతో కలిపి విజయవాడలో రిలే నిరాహార దీక్ష చేస్తాం. పీఆర్సీపై పునఃసమీక్ష నిర్వహించాలని మార్చి 2 నుంచి 5 వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు వినతిపత్రాలిస్తాం' అని వెల్లడించారు.
నమ్మించి మోసం చేశారు
ఉద్యోగ, ఉపాధ్యాయులను ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య(యూటీఎఫ్) ప్రధాన కార్యదర్శి ప్రసాద్ వాపోయారు. 'ఉద్యోగులకు మంచి పీఆర్సీ ఇస్తామని చెప్పి మాట తప్పారు. సీపీఎస్ రద్దు చేస్తామని... ఇప్పుడేమో రోడ్‌మ్యాప్ అంటూ ఉద్యోగులను మోసగించారు. ఉపాధ్యాయ సంఘాల వెనుక ఎలాంటి రాజకీయ జెండాలు లేవు. మాపై రాజకీయ ముద్ర వేయడం మాని, అసంతృప్తిని గుర్తించాలి. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల క్రమబద్ధీకరణను నిబంధనల ప్రకారం చేయడం లేదు. అదనపు క్వాంటం పింఛన్లో 80 ఏళ్ల తర్వాత ఇచ్చే మొత్తాన్ని తగ్గించారు. గ్రాట్యుటీని జనవరి నుంచి అమలు చేయడం వల్ల 30 వేల మంది ఉద్యోగులు ప్రయోజనం కోల్పోయారు' అని తెలిపారు.
దుష్ప్రచారం చేస్తున్నారు
ఉపాధ్యాయ సంఘాలపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు హృదయరాజు అన్నారు. 'ప్రజలు, ఉద్యోగుల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారు. మంత్రుల కమిటీ చర్చల్లో జరిగిన నష్టంపై ఉపాధ్యాయ సంఘాలు ధ్వజమెత్తాయి. నిరసనలు నిర్వహించాయి. ఉపాధ్యాయులతో ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. ఉపాధ్యాయులను పోలీస్స్టేషన్లకు పిలిపిస్తున్నారు. నల్లబ్యాడ్జీలు ధరించడంపై ఆంక్షలు విధించారు. సీఎం జగన్ కలిసేందుకు సమయం ఇవ్వలేదు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించేది ఏంటని అంటున్నారు. వైద్య బిల్లుల చెల్లింపు విధానాన్ని పొడిగిస్తామని చెప్పి.. ఇంతవరకు ఉత్తర్వులివ్వలేదు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలి' అని పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment