🔳14 కల్లా జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు పూర్తి
- భూముల లభ్యతపై ఆరా!
- మౌలిక వసతులపై దృష్టి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా కొత్త జిల్లాలకు సంబంధించిన భవనాలు, మౌలిక వసతుల కల్పన, ఫర్నీచర్ సర్దుబాటు, ఉద్యోగుల విభజన లాంటి పలు కీలక అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఉద్యోగుల విభజన ప్రక్రియను ఈ నెల 14 కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ఈ నెల 14న సిఎస్ సమీర్‌శర్మ అధ్యక్షతన జరగనున్న జిల్లాల పునర్విభజన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సబ్ కమిటీల సమీక్షా సమావేశంలో ఉద్యోగుల విభజన, ఏయే కేటగిరిల్లో ఎంత మేర సర్దుబాటు అయ్యారు? ఏయే పోస్టుల్లో తాత్కాలిక ఉద్యోగులను తీసుకోవాల్సి ఉంటుందనే అంశాలపై తుది రూపం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రధాన కార్యాలయాలు ఎక్కెడెక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. గుర్తించిన ప్రభుత్వ కార్యాలయాల్లో కావాల్సిన మౌలిక వసతులు, ప్రస్తుతమున్న ఫర్నీచర్, సాంకేతిక పరిజ్ఞానం, భవనాలకు తుది మెరుగులు దిద్దడం, సివిల్, విద్యుత్తుకు సంబంధించిన పనులు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. పలు జిల్లాల్లో గుర్తించిన కార్యాలయ భవనాలను ఆయా జిల్లా కలెక్టర్లతోపాటు అధికార యంత్రాంగం పరిశీలిస్తోంది. ప్రస్తుతం గుర్తించిన భవనాల కోసం లభ్యతగా ఉన్న వనరులతో పాటు ఏయే అంశాలకు సంబంధించి కొత్తగా కొనుగోలు చేయాలనే అంశాన్ని ఈ నెల 18 కల్లా జిల్లా అధికారులకు క్షేత్రస్థాయి అధికారులు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో నూరు శాతం పాలన ప్రారంభమయ్యేలా పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ నెల 20న డిస్ట్రిక్ట్ రీ ఆర్గనైజేషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మౌలిక వసతులకు సంబంధించి ఏయే వస్తువులు కొనుగోలు చేయాలనే అంశం ఆయా జిల్లా కలెక్టర్ల నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఐటి విభాగం తాత్కాలికంగా బడ్జెట్‌ను రిలీజ్ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. నూతనంగా ఏర్పడబోయే కార్యాలయాల భవనాల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.39 కోట్లు కేటాయించగా, ఇందులో సివిల్, విద్యుత్తు పనులకు జిల్లాకు కోటి రూపాయలు, జిల్లా, డివిజన్‌స్థాయి కార్యాలయాల్లో ఫర్నీచర్ కొనుగోలు కోసం ఒక్కో జిల్లాకు రూ.2 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
కొత్త జిల్లాలకు సంబంధించి శాశ్వత భవనాల నిర్మాణాల కోసమంటూ ప్రభుత్వం లభ్యత ఉన్న భూములను గుర్తించాలని సిఎస్ అధ్యక్షతన ఈ నెల 4న జరిగిన సబ్ కమిటీలో అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఎంత విస్తీర్ణంలో అందుబాటులో ఉన్నాయనే అంశంపై నివేదిక సమర్పించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పరిశీలనలోకి తెలంగాణ అనుభవాలు
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అనుభవాలను పరిశీలనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాల ఏర్పాటు నేషథ్యంలో ఎటువంటి న్యాయ వివాదాలూ లేకుండా చూడాలని ఇప్పటికే పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధిశాఖలను ప్రభుత్వం ఆదేశించింది.
0 Comments:
Post a Comment