మళ్లీ సర్దేశారు! : రూ. 11,413 కోట్లపై కాగ్ తాజా అభ్యంతరం...
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి : రాష్ట్ర ఆర్థిక స్థితిపై శాసనభలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక ప్రకంపనలు కొనసాగుతుండగానే మరో అంశం వెలుగులోకి వచ్చింది.
తాజాగా రూ. 11,413 కోట్ల రూపాయల మొత్తానికి సంబంధించి చేసిన సర్దుబాట్లపై కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇష్టానుసారంగా నగదును పలు బిల్లుల్లో సర్దుబాట్లు చేస్తున్నారని ఆక్షేపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో మూడు రోజుల్లో ముగియనుండగా ఫిబ్రవరి నెల వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలపై కాగ్ పరిశీలనలు ప్రభుత్వానికి సోమవారం చేరాయి. వీటిలో 11 నెలల ఆర్ధిక గగణాంకాలను అధ్యయనం చేసిన ఎజి కార్యాలయం పలు అంశాలపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. వీటికి సంబంధించి పదేపదే తాము అభ్యంతరాలను లేవనెత్తుతున్నా ఫలితం ఉండటం లేదని, నవంబర్ నెలకు చేసిన అభ్యంతరాలపైనా ఇంతవరకు తమకు సమాధానం అందలేదని పేర్కొంది. గత ఏప్రిల్ నుంచి గత నెల ఫిబ్రవరి వరకు ఏకంగా 2,11,916 బిల్లుల్లో 11,413 కోట్ల రూపాయల వరకు సర్దుబాట్లు కనిపిరచాయని ఎత్తిచూపింది. ఒక్క ఫిబ్రవరి నెల్లోనే 17,319 బిల్లుల ద్వారా 526 కోట్లు సర్దుబాటు జరిగినట్లు గుర్తించింది. ఇలా సర్దుబాట్లు చేయడం నిబంధనలను అతిక్రమించడమేనని పేర్కొంది. నిబంధనల మేరకు చూపించాల్సిన లబ్దిదారుల వివరాలు, చెల్లింపుల విధానం వంటివి చూపించలేదని వ్యాఖ్యానించింది. అలాగే 2019 ఫిబ్రవరిలో కూడా 350 రూపాయలను సర్దుబాటులో చూపించారని, అయితే వీటికి సంబంధించిన వివరాలు మాత్రం సాధారణ లెడ్జర్లలో చూపించలేదని ఎజి కార్యాలయం వ్యాఖ్యానించింది.
కొన్ని మేజర్ పద్దుల నిర్వహణలో కూడా సరైన విధానాలు పాటించడం లేదని, గతంలో చెప్పినా మళ్లీ అవే జరుగుతున్నాయని వ్యాఖ్యానించింది. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పారిశుధ్యానికి సంబంధించిన వ్యయాన్ని ఉప పద్దు లేకుండానే నిర్వహించడంపైనా ప్రస్తావించింది.
0 Comments:
Post a Comment