అసెంబ్లీకి చెప్పకుండా జగన్ సర్కార్ లక్ష కోట్ల ఖర్చు-కాగ్ నివేదిక సంచలనం-103 రోజుల ఓవర్ డ్రాఫ్ట్
బడ్జెట్ ఆమోదం లేకుండానే ఈ అప్పులు తెచ్చి ఖర్చు పెడుతున్నారన్న విమర్శలూ తప్పడం లేదు. ఈ నేపథ్యంలో 2020-21 ఆర్ధిక సంవత్సరంలో లక్ష కోట్ల రూపాయలకు పైగా అసెంబ్లీకి చెప్పకుండా ఖర్చు చేసినట్లు కాగ్ తన నివేదికలో సంచలన వివరాలు బయటపెట్టింది.
కాగ్ సంచలన నివేదిక
ఏపీలో ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు, చేస్తున్న ఖర్చులపై కాగ్ తాజాగా బయటపెట్టిన నివేదిక సంచలనం రేపుతోంది. ఇందులో ప్రస్తావించిన పలు అంశాలు ఇన్నాళ్లూ విపక్షాలు చేస్తున్న విమర్శలను బలపరిచేలా ఉన్నాయి. ముఖ్యంగా భారీ ఎత్తున తీసుకుంటున్న అప్పుల వివరాలు అసెంబ్లీకి చెప్పకపోవడం, బడ్డెట్ ఆమోదం తీసుకోకపోవడం వివాదాస్పదమవుతోంది. అదే సమయంలో భారీ ఎత్తున చేస్తున్న ఖర్చును సైతం అసెంబ్లీకి తెలియజేయకపోవడాన్ని కాగ్ తప్పుబట్టింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది.
అసెంబ్లీకి తెలియకుండా లక్ష కోట్ల ఖర్చు
2020-21 ఆర్ధిక సంవత్సరంలో వైసీపీ సర్కార్ అసెంబ్లీకి తెలియకుండా రూ.1.1 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ నివేదిక తెలిపింది. చట్ట సభల ఆమోదం లేకుండా ఇలా భారీ ఎత్తున ఖర్చు పెట్టడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కాగ్ పేర్కొంది. ఈ వివరాల్ని ఇప్పటికీ అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చి ఆమోదం తీసుకోలేదని కాగ్ ఆక్షేపించింది. దీంతో పాటు కాగ్ నివేదికలో పేర్కొన్న పలు అంశాలు సంచలనం రేపేలా ఉన్నాయి. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అసెంబ్లీ ముందు ఉంచింది.
103 రోజుల ఓవర్ డ్రాఫ్ట్ లేకపోతే
రాష్ట్ర ప్రభుత్వం గతేడాదిలో ఏకంగా 103 రోజుల పాటు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుందని కాగ్ తన నివేదికలో తెలిపింది. ఇలా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోకపోతే రోజు గడవని పరిస్ధితుల్లో రష్ట్రం ఉందని కాగ్ నివేదికలో పేర్కొంది. రాష్ట్ర ఖజానాలో ఏ ఆసరా లేకుండా కనీస నిల్వ నిధులున్నది కేవలం 34 రోజులు మాత్రమేనని వెల్లడించింది. ఆర్బీఐతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో రోజుకు రూ.1.94 కోట్ల నిల్వ ఉంచాలని, అలా ఉంచలేకపోతే వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్, ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయాల ద్వారా వడ్డీతో అప్పు తీసుకోవచ్చని తెలిపింది. ఈ పరిమితి దాటితే మాత్రం రాష్ట్ర క్రెడిట్ రేటింగ్ తగ్గిపోయే ప్రమాదం ఉంది.
ట్రెజరీ కోడ్ గాలికి
రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నిబంధనలు కూడా పాటించడం లేదని తాజా కాగ్ నివేదికలో ప్రస్తావించింది. దీని ప్రకారం 2020-21 ఆర్ధిక సంవత్సరంలో రూ.48 వేల కోట్ల మేర ట్రెజరీ కోడ్, విధానాలు పాటించకుండా సీఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లింపులు చేసినట్లు ఆక్షేపించింది. ట్రెజరీ కోడ్ ద్వారా అధికారికంగా చెల్లించాల్సిన ఈ మొత్తాన్ని సీఎఫ్ఎంస్ లో ప్రత్యేక బిల్లుల ద్వారా చెల్లించారు. కన్సాలిడేటెడ్ ఫండ్, పబ్లిక్ ఖాతాల మధ్య సర్దుబాటు ద్వారా ఈ చెల్లింపులు చేసినట్లు కాగ్ ఆక్షేపించింది.
జగన్ సర్కార్ ఉల్లంఘనలివే..
రాష్ట్ర ప్రభుత్వ బడ్డెట్ విడుదల ఉత్తర్వులు లేకుండానే కన్సాలిడేటెడ్ ఫండ్ ద్వారా రూ.8891 కోట్లు చెల్లించినట్లు కాగ్ నివేదిక తెలిపింది. అలాగే వివిధ పథకాలు, స్ధానిక సంస్ధలకు రూ.26839 కోట్లు చెల్లించారని కాగ్ తెలిపింది. ఇలా ట్రెజరీ కోడ్ పాటించకుండా చెల్లింపులు చేయడానికి సరైన కారణాలు కూడా చెప్పలేదని ఆక్షేపించింది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో ట్రెజరీ కోడ్ పాటించకుండా సీఎఫ్ఎంఎస్ ద్వారా చేసిన చెల్లింపులు ట్రెజరీ కోడ్ కు విరుద్ధమని తెలిపింది. వీటిపై కాగ్ అకౌంటింగ్ అధికారులు వేసిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం కూడా సంతృప్తి కరంగా లేదని కాగ్ ఆక్షేపించింది. ఇలా చేయడం ద్వారా అక్రమాలకు ఆస్కారం ఇచ్చినట్లవుతుందని కాగ్ తెలిపింది.
0 Comments:
Post a Comment