✍ఐఆర్.. వడ్డీ లేని అప్పు
♦సర్దుబాటు చేయాల్సిందే
♦సమ్మెతో సాధించేదేమీ లేదు
♦చర్చలతోనే పరిష్కారం: సీఎస్ సమీర్‌శర్మ
🌻ఈనాడు, అమరావతి:‘ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే మధ్యంతర భృతి (ఐఆర్) వడ్డీ లేని అప్పు లాంటిది. దాన్ని తర్వాత సర్దుబాటు చేస్తాం. ఇది ఏ పీఆర్సీలోనైనా జరుగుతుంది. గతంలో ఎప్పుడూ ఇలా 30 నెలలపాటు 27% ఐఆర్ ఇవ్వలేదు. ఐఆర్ ఉద్యోగుల హక్కు కాదు. తెలంగాణలో ఇవ్వలేదు. ఇక్కడ కూడా ఐఆర్ ఇవ్వకుండా డీఏలే ఇచ్చి ఉంటే ప్రభుత్వానికి రూ.10 వేల కోట్లు ఆదా అయ్యేది’ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ అన్నారు. ‘ఏమైనా అభ్యంతరాలుంటే ఉద్యోగ సంఘాలు వచ్చి మంత్రుల కమిటీ ముందు పెడితే పరిష్కారం కావచ్చు. సంప్రదింపుల్లో పరస్పర ఆమోదయోగ్య ఫార్ములా రావచ్చు. అంతేకానీ సమ్మెకు వెళ్తే ఏమైనా జరగొచ్చు. బయటి శక్తులు వచ్చి ఏం చేస్తాయో చెప్పలేం’ అన్నారు. ఉద్యోగ సంఘాలను ఆయన మరోసారి చర్చలకు ఆహ్వానించారు. సచివాలయంలో గురువారం సాయంత్రం ఆయన ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఎస్.ఎస్.రావత్, శశిభూషణ్ కుమార్, సమాచారశాఖ డైరక్టర్ విజయకుమార్రెడ్డిలతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ‘ఐఆర్ విషయంలో సంఘాలు ఇలా వ్యవహరిస్తే భవిష్యత్తులో మధ్యంతర భృతి ప్రకటించాలంటేనే భయపడే పరిస్థితి వస్తుంది’ అని చెప్పారు.
♦ఐఆర్ కలపకూడదు: శశిభూషణ్
కొత్త పీఆర్సీ కన్నా పాత పీఆర్సీలోనే జీతాలు ఎక్కువని చెబుతున్నారు. 2015 పీఆర్సీ లెక్క వేసినప్పుడు ఐఆర్‌ను లెక్కలోకి తీసుకోకూడదు. పాత పీఆర్సీకన్నా కొత్త పీఆర్సీలో జీతాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం 30 నెలలపాటు 27% ఐఆర్ కింద ఉద్యోగులకు రూ.17,918 కోట్లు ఇచ్చింది.
🔹విలేకర్లు: ఉద్యోగులు మూడు డిమాండ్లు పెట్టారు. వాటిని గుర్తించడంలో మీరు ఎందుకు విఫలమవుతున్నారు?
⭕సీఎస్: అభ్యంతరాలుంటే వచ్చి మాట్లాడాలి కదా. మాట్లాడటానికి ముందే షరతులు పెడితే ఎలా?
🔹విలేకర్లు: సమ్మెకు సమయం దగ్గరపడుతోంది. ఈలోపు ఉద్యోగులు సంతృప్తిపడేలా సవరణ ప్రకటనలుంటాయా?
⭕సీఎస్: వచ్చి మాట్లాడితే అప్పుడు చెప్పొచ్చు.
🔹విలేకర్లు: ఐఆర్ ఎప్పుడూ సర్దుబాటు చేయలేదు. మొదటిసారి సర్దుబాటు చేస్తున్నారు కదా..
⭕రావత్: ఐఆర్ సర్దుబాటు చేస్తామన్న విషయం జీవోలోనే ఉంది.
🔹విలేకర్లు: మీరు రికవరీ లేదంటున్నారు. ఐఆర్, డీఏ బకాయిలు సర్దుబాటు చేసిన తర్వాత ఉద్యోగుల నుంచి రికవరీ అవుతుందని ప్రభుత్వ జీవోలే చెబుతున్నాయి.
⭕సీఎస్: ఈ విషయంపైనా అభ్యంతరాలుంటే ఉద్యోగ సంఘాలు వచ్చి మాట్లాడవచ్చు కదా.
🔹విలేకర్లు: ఐఆర్ సర్దుబాటు పీఆర్సీ అమల్లో భాగమే అంటున్నారు. కొత్త పీఆర్సీలో ఎంత సర్దుబాటు చేశారు?
⭕శశిభూషణ్: ఇంతవరకు ఏమీ సర్దుబాటు కాలేదు. అన్ని లెక్కల తర్వాత... ఉద్యోగి రూ.110 తీసుకోవాల్సి ఉండి, రూ.100 తీసుకుంటే ఎరియర్సు రూ.10 ఉద్యోగికి ఇస్తాం. ఉద్యోగి రూ.10 ఎక్కువ తీసుకుంటే దాన్ని నెగెటివ్ ఎరియర్స్ అంటాం. సామాన్యుడి భాషలో రికవరీ అనొచ్చు. ప్రభుత్వం రికవరీ చేయదు. సర్దుబాటు చేస్తుంది.
🔹విలేకర్లు: 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ ప్రయోజనం ఇస్తున్నందున ఐఆర్‌ను ఫిట్మెంట్ రూపంలో సర్దుబాటు చేశారనుకోవచ్చు. అంతకుముందు 9 నెలలు ఎందుకు సర్దుబాటు చేస్తున్నారు?
⭕సీఎస్: నాకు తెలిసినంతవరకు ఏ పీఆర్సీలోనైనా సర్దుబాటు ఉంటుంది. ఈ విషయం కూడా వారు చర్చించవచ్చు కదా.
🔹విలేకర్లు: ఇంతకుముందే వారు మాట్లాడారు కదా. అప్పుడు ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పారు?
⭕సీఎస్: అప్పుడూ చర్చించాం. మంత్రిమండలిలో ఆమోదించాం. జీవోలు ఇచ్చాం.
🔹విలేకర్లు: చర్చలు పూర్తవకుండానే జీవోలు ఇచ్చేశారని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. సీసీఏ, హెచ్ఆర్ఏ కూడా రికవరీ చేస్తున్నారా?
⭕సీఎస్: ఇలాంటి అన్ని విషయాలు వారు వచ్చి చర్చించవచ్చు.
🔹విలేకర్లు: చర్చలకు వచ్చినా వారి అభ్యంతరాలను మీరు పరిగణనలోకి తీసుకోనందుకే కదా సమ్మె దాకా వెళ్లామంటున్నారుగా?
⭕సీఎస్: మానవవనరుల అంశాలకు సంబంధించి ఒక కచ్చితమైన డాక్యుమెంటు ఉండదు. అందుకే అనామలిస్ కమిటీ ఉంది.
0 Comments:
Post a Comment