Confusion over school merger orders
✍అంతా అయోమయం!
పాఠశాలల విలీన ఉత్తర్వులపై గందరగోళం
🌻(అమరావతి-ఆంధ్రజ్యోతి*)హైస్కూల్లో 3, 4, 5తరగతుల విలీనంపై విమర్శలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అవసరమైన తరగతి గదులు లేకపోయినా, ఉపాధ్యాయుల కొరత ఉన్నా ఆగడం లేదు. హైస్కూళ్లకు 250 మీటర్ల దూరంలోని ప్రాథమిక పాఠశాలల విలీన ప్రక్రియలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రభుత్వం అంతటితో ఆగకుండా 3 కిలోమీటర్ల దూరంలోని ప్రాథమిక పాఠశాలల్ని కూడా విలీనం చేసేందుకు ముందుకెళ్లింది. పాఠశాలలు, తరగతుల విలీనంపై కేవలం కాగితంపై ప్రణాళిక వేశారు. ఆ మేరకు మ్యాపింగ్ చేయాలని నిర్దేశించింది. అంతేకానీ విలీన ప్రక్రియ పూర్తిచేయలేదు. అయితే.. ఆయా పాఠశాలల తరగతులకు సంబంధించిన రికార్డులన్నీ సంబంధిత హైస్కూళ్లలో స్వాధీనం చేసేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. సోమవారం పాఠశాల విద్య డైరక్టరేట్ ఇచ్చిన ఈ ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో కలకలం రేపుతున్నాయి. విలీనం పూర్తయిన 250 మీటర్ల లోపల ఉన్న పాఠశాలలకు సంబంధించిన రికార్డులు ఇవ్వాలని ఆదేశాలిస్తే సరిపోయేదని..
విలీనం కాకముందే 3 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలల రికార్డులెలా ఇస్తారన్న ప్రశ్నలు తలెత్తాయి. కాగితం మీద చేసిన మ్యాపింగ్ ఇంకా అమల్లోకి రాకముందే... కళ్లు మూసుకుని సంతకాలు చేసేసి ఉత్తర్వులిచ్చారా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ విద్యా విధానం అమలు పేరుతో రాష్ట్రంలోని అనేక ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 3, 4, 5 తరగతులను సమీపంలోని హైస్కూళ్లలో విలీనం చేయనున్నారు. మూడు కిలోమీటర్ల దూరంలోని వేల పాఠశాలల్ని విలీనం చేస్తే వచ్చే సమస్యల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉపాధ్యాయులు, తరగతి గదుల కొరతను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. కాగితాలపై మ్యాపింగ్లో ఉన్న ప్రాథమిక పాఠశాలల రికార్డులను ఎలా ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులు అయోమయానికి గురయ్యారు. సరిపడా ఉపాధ్యాయులు, తరగతి గదులు ఉన్నాయా? లేవా? అన్నది కూడా చూడలేదంటున్నారు. అనుకున్నదే తడవుగా ఉత్తర్వులు ఇవ్వడం వల్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
0 Comments:
Post a Comment