✍ఏం విన్నారు.. ఎక్కడ ఉన్నారు?
♦ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
♦పీఆర్సీతో జీతం పెరిగిందని ఏ ఉద్యోగైనా అనుకుంటున్నారా?
♦చలో విజయవాడ సభలో పీఆర్సీ సాధన సమితి నేతలు
*🌻ఈనాడు, అమరావతి:* ఎన్నికల ముందు ముద్దులు పెట్టారు.. ఇప్పుడు కోతలు విధిస్తున్నారంటూ ప్రభుత్వంపై పీఆర్సీ సాధన సమితి నేతలు విమర్శలు కురిపించారు. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అని చెప్పి ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. అవసరమైతే వీధిపోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వం కూలిపోతుందని, ఉద్యోగులు తమ డిమాండ్లను తొడగొట్టి చెప్పాలని సూచించారు.
ఇప్పటికైనా మనసు మార్చుకోండి
♦‘సీఎం జగన్ నేను విన్నాను.. ఉన్నాను అని చెప్పారు. ఎక్కడ ఉన్నారు.. ఏం విన్నారు? ఈ సభను చూసైనా మనసు మార్చుకోండి. ప్రభుత్వానికి జబ్బు చేసింది. దీనికి మనమే వైద్యం చేయాలి. విజయకేతనం ఎగరేసిన సోదర, సోదరీమణులకు ధన్యవాదాలు. ఉద్యమం విజయవంతమైంది. ఆరో తేదీ నుంచి సమ్మె చేసేందుకు జీతం డబ్బులు ఉపయోగపడతాయి. హడావుడిగా జీతాలిచ్చిన ప్రభుత్వానికి జీఎల్ఎస్ఐ, పీఎఫ్, ఇతర ప్రయోజనాల సొమ్ము రూ.2,100 కోట్లు ఇచ్చేందుకు చేతులు రావడం లేదా? ఉద్యోగుల ఉద్యమాన్ని గుర్తించకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
*♦చర్చలకు రావాలంటే ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులు తొలగించాలి.’*
- బండి శ్రీనివాసరావు, ఛైర్మన్, ఏపీ ఐకాస
*♦మట్టి ఖర్చులూ మిగుల్చుకున్నారు*
‘ఉద్యోగులు చనిపోతే ఇచ్చే మట్టి ఖర్చులనూ మిగుల్చుకున్న ఘనత ఈ ప్రభుత్వానిది. ఫిట్మెంట్, అలవెన్సులు, రాయితీల రద్దులోనూ రికార్డు సృష్టించింది. 13 లక్షల మంది ఉద్యోగులే మా శక్తి. ఏ ప్రభుత్వమైనా దిగిరావాల్సిందే. మూడేళ్లుగా ప్రభుత్వం వెంట తిరిగి, మా బాధలు చెప్పాం. పట్టించుకోకపోగా అవమానించారు. 60వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు పాత జీతాలు వేశారు. ఇది దుర్మార్గం. ఇది బలప్రదర్శన కాదు.. దీన్ని ఆవేదనగా చూడండి. కేసులు పెట్టి, అరెస్టు చేసినవారిని వదిలిపెట్టండి.’
*- బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఐకాస అమరావతి ఛైర్మన్*
*♦జీతాలు పెరిగాయో.. లేదో తెలియనంత అమాయకులమా?*
‘ఉద్యోగులందరితో కలిసి ఏడో తేదీ నుంచి రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారు. జీతాలు పెరిగాయో, లేదో తెలుసుకోలేనంత అమాయకులమా? ఇప్పటికైనా ఉద్యోగులకు ఎక్కడ నష్టం జరిగిందో గుర్తించాలి. వేతన స్కేల్స్, భత్యాలను పక్కకు పెట్టి, ఇష్టం వచ్చినట్లు పీఆర్సీ అమలుచేయడంతోనే ఇంత ఆందోళన వచ్చింది. స్పందించకపోతే ప్రభుత్వం దిగివచ్చే వరకూ ఉద్యమం కొనసాగిస్తాం.’
*- వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు*
*♦ప్రభుత్వ పెద్దలారా.. ఆకలి పొలికేక వినిపిస్తోందా?*
‘అయ్యా ప్రభుత్వ పెద్దలారా.. మా ఆకలి పొలికేక వినిపిస్తోందా? పీఆర్సీపై అన్యాయం చేశారు. అదనపు పింఛను తీసేశారు. పాదయాత్రలో సీఎం జగన్ పెట్టిన ముద్దులను సీపీఎస్ సోదరులు ఇంకా మరిచిపోలేదు. ఇప్పుడు కోతలు వినిపిస్తున్నాయా? 2019లో ఓటు వేశాం.. 2024లో వేద్దామా? ఆర్టీసీ విలీనంతో మరో ముద్దు.. పింఛను, వైద్యం ఉష్కాకితో మరో కోత. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను శ్రమదోపిడీ చేస్తున్నారు. ఎవర్నీ వదిలి పెట్టకుండా మనందరికీ గుండుగొరిగి రోడ్డుమీదకు వచ్చే పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చింది.’
*💥- సూర్యనారాయణ, అధ్యక్షుడు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం*
0 Comments:
Post a Comment