🔳ఐఆర్ మాఫీ వట్టి మాటే!
ఆ 9 నెలల భృతి రికవరీ తప్పదు!
ఉద్యోగులకు జగన్ సర్కారు షాక్...మినిట్స్‌లో ఉన్నా జీవోలో మాయం
ఫిట్‌మెంట్‌పై ఉత్తర్వులివ్వని వైనంఒక్కో ఉద్యోగికి 80,000 నుంచి రూ.2,00,000 వరకు నష్టంసీసీఏపైనా మాట తప్పారు21 నెలలు తీసుకున్న మొత్తం..డీఏ బకాయిల నుంచి కోతహెచ్ఆర్ఏ, సీసీఏ, ఏక్యూపీపై మూడు సవరణ జీవోలు జారీహామీల అమలేదీ.. సంఘాల నేతలపై ఉద్యోగుల ఆగ్రహం
ప్రభుత్వం మళ్లీ మాట తప్పింది. ఉద్యోగులకు మరోసారి ఝలక్ ఇచ్చింది. ఉద్యోగుల ‘చలో విజయవాడ’ దెబ్బతో చర్చల్లో కాస్త దిగొచ్చినట్లు కనిపించిన సర్కారు.. ఆనాడు మినిట్స్‌లో రాసిన హామీలనూ తుంగలో తొక్కే రీతిలో ఆదివారం జీవోలిచ్చింది.
అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): మధ్యంతర భృతి (ఐఆర్) రికవరీపై ప్రభుత్వం మరోసారి ఉద్యోగులను మోసం చేసింది. ఆదివారం వరుసబెట్టి సీసీఏ, హెచ్ఆర్ఏ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ (ఏక్యూపీ)పై జీవోలు జారీచేసింది. ఫిట్మెంట్ జీవో మాత్రం ఇవ్వలేదు. దీంతో కొత్త పీఆర్సీ అమలు తేదీకి ముందు 9 నెలల పాటు ఇచ్చిన ఐఆర్‌ను రికవరీ చేయడం ఖాయమని తేలిపోయింది. ఉద్యోగులు అడిగితే ఫిట్మెంట్ 23 శాతంలో మార్పేమీ లేదు కదా.. కొత్తగా జీవో అవసరం లేదు.. జనవరి 17వ తేదీన ఇచ్చిన జీవో నంబర్ 1 సరిపోతుందన్న సమాధానం వచ్చింది. దీనిపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త పీఆర్సీ అమలు తేదీని జగన్ ప్రభుత్వం 2020 ఏప్రిల్ 1గా నిర్ణయించడం.. జనవరి 17వ తేదీన ఫిట్‌మెంట్‌కు సంబంధించి ఇచ్చిన జీవో 1లో.. 2019 జూలై 1 నుంచి 2020 మార్చి 31 వరకు అంటే 9 నెలల పాటు అందుకున్న 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్), సీసీఏ, హెచ్ఆర్ఏను.. 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 డిసెంబరు 31 వరకు అంటే 21 నెలల పాటు అందుకున్న 4 శాతం ఐఆర్‌ను, హెచ్ఆర్ఏ, సీసీఏ మొత్తాలను డీఏ బకాయిల నుంచి రికవరీ చేస్తున్నట్లు ప్రకటన చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులంతా భగ్గుమని ఉద్యమబాట పట్టిన సంగతి తెలిసిందే. ఐఆర్, సీసీఏ, హెచ్ఆర్ఏ రికవరీ చేపట్టవద్దన్న డిమాండ్‌తో ఈ నెల 3వ తేదీన వారు చేపట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతం కావడంతో బిత్తరపోయిన జగన్ సర్కారు.. ఉద్యోగ సంఘ నాయకులతో సమావేశమై.. 9 నెలల పాటు అందుకున్న 27 శాతం ఐఆర్‌ను డీఏ బకాయిల నుంచి మినహాయించబోమని.. ఆ డీఏ బకాయిలను ఉద్యోగులకు వారి రిటైర్మెంట్ సమయంలో అందిస్తామని హామీ ఇచ్చిన విషయం విదితమే. ఆ మీటింగ్ మినిట్స్‌లో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది కూడా. కానీ ఇప్పుడు ఫిట్మెంట్ జీవో కొత్తగా ఇచ్చే అవసరంలేదని తప్పించుకుంది. ఉద్యోగులు 9 నెలల పాటు తీసుకున్న 27శాతం ఐఆర్ కనీసం రూ.80,000 నుంచి గరిష్ఠంగా రూ.2,00,000 వరకు ఉంది. ఫిట్మెంట్ జీవో ఇవ్వకపోవడంతో ఈ మేరకు నష్టపోవలసి ఉంటుంది.
సీసీఏ అమలు తేదీ ఎప్పుడు?కొత్త పీఆర్సీ అమలు తేదీని ప్రభుత్వం 2020 ఏప్రిల్ 1గా నిర్ణయించింది. మొదట సీఎస్ కమిటీ ఇచ్చిన నివేదికలో సీసీఏను పూర్తిగా ఎత్తేశారు. ఉద్యోగుల ఉద్యమం తర్వాత సంఘాల నేతలతో జరిపిన చర్చల్లో భాగంగా సీసీఏను పునరుద్ధరిస్తామని చెప్పారు. మినిట్స్‌లో మాత్రం సీసీఏ అమలు తేదీ రాయలేదు. దీంతో ఉద్యోగులంతా సీసీఏకి రికవరీ ఉండదని భావించారు. కానీ ఆదివారం ఇచ్చిన జీవోలో.. సీసీఏ పునరుద్ధరణ 2022 జనవరి 1వ తేదీ నుంచే వర్తిస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 డిసెంబరు 31 వరకు (21 నెలలు) తీసుకున్న సీసీఏను.. డీఏ బకాయిల నుంచి కోతపెడతారన్న మాట. హెచ్ఆర్ఏకు సంబంధించి చేసిన సవరణ 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని మినిట్స్‌లో రాసిందే జీవోలోనూ పేర్కొన్నారు.
హెచ్ఆర్ఏపై ప్రయోజనం సున్నా..30 శాతం హెచ్ఆర్ఏ అందుకుంటున్న సెక్రటేరియట్, హెచ్‌వోడీల ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం గిమ్మిక్కులు చేసింది. మొదట వారి హెచ్ఆర్ఏను 16 శాతానికి తగ్గించింది. ఆ తర్వాత 24 శాతానికి పెంచి.. 8 శాతం పెంచామని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటోం ది. కానీ లెక్కలు పరిశీలిస్తే.. 2022 జనవరి 1 నుంచి 2024 జూన్ వరకు దాదాపు ఈ రెండున్నరేళ్ల పాటు సెక్రటేరియట్, హెచ్‌వోడీ ఉద్యోగులు 8 శాతం హెచ్ఆర్ఏ రూపంలో అందుకునే మొత్తం కంటే ఆ 9 నెలల పాటు 27 శాతం ఐఆర్ రికవరీ రూపంలో డీఏ బకాయిల నుంచి కోల్పోతున్న మొత్తమే ఎక్కువ. ఉదాహరణకు సచివాలయంలో రూ.37,100బేసిక్ ఉన్న ఉద్యోగి రెండున్నరేళ్ల పాటు 8శాతం హెచ్ఆర్ఏ రూపంలో అందుకునేది దాదాపు రూ.1,20,000 కాగా.. ఆ 9 నెలల పాటు 27శాతం ఐఆర్ రికవరీ వల్ల కోల్పోతున్న డీఏ బకాయి రూ.1,50,000. అంటే ఉద్యోగికి రూ.30,000 వర కు నష్టం. హెచ్ఆర్ను 16 శాతం నుంచి 24 శాతానికి పెంచేలా చేసి తాము మేలే చేశామని సంఘాల నేతలు చెప్పుకొంటున్నది అసత్యమేనని.. దీనివల్ల తమకు నష్టమే తప్ప ప్రయోజనం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.
బకాయిల ఎగవేతకే..!మినిట్స్‌లో పేర్కొన్న ప్రకారం ఐఆర్ రికవరీ మాఫీ తాలూకు డీఏ బకాయిలను రిటైర్మెంట్ సమయంలో ఇవ్వాలి. ఒక్కో ఉద్యోగికి ఎంత మొత్తం వస్తుందో అంత మొత్తం వేసి, జీపీఎఫ్ ఖాతా మాదిరిగా 8 శాతం వడ్డీ అమలు చేసి ఇస్తామంటూ.. ఉద్యోగులకు ఒక్కొక్కరికి ఒక్కో లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఫిట్మెంట్ సవరణ జీవో ఎగ్గొట్టడంతో ఇవేవీ లేకుండా పోయాయి. డీఏ బకాయిలు ఎగవేసే ఉద్దేశంతోనే కొత్త జీవో ఇవ్వలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మినిట్స్ రూపంలో ఇచ్చిన హామీని ఉత్తర్వుల రూపంలో తీసుకురావడంలో విఫలమయ్యారని ఉద్యోగ సంఘాల నాయకులపై విరుచుకుపడుతున్నారు.
నష్టం ఇలా..సచివాలయంలో సెక్షన్ అధికారి కేడర్‌ను పరిగణనలోకి తీసుకుంటే వారి బేసిక్ వేతనం రూ.37,100. దీని ప్రకారం 9 నెలల పాటు ఆ ఉద్యోగి 27 శాతం ఐఆర్ కింద రూ.90,000 డ్రా చేశారు. వాటిని ప్రభుత్వం ఇప్పుడు డీఏ బకాయి నుంచి రికవరీ చేస్తుంది. ఫలితంగా ఆ ఉద్యోగి తనకు రావలసిన డీఏ ఎరియర్లలో రూ.90,000 నష్టపోతాడన్న మాట. అలాగే.. సచివాలయంలో అన్ని రకాల కేడర్లను పరిగణనలోకి తీసుకుంటే కనీసం రూ.80,000 నుంచి గరిష్ఠంగా రూ.2,00,000 మొత్తాన్ని ఉద్యోగులు నష్టపోనున్నారు.
0 Comments:
Post a Comment