✍హాజరుకు అడ్డంకులెన్నో..
♦కమిషనర్ పరిశీలనలోనే మొరాయించిన యంత్రం
🌻ఈనాడు - అమరావతి, న్యూస్టుడే - యడ్లపాడు*
పాఠశాలల్లో ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. బయో హాజరు వేసుకోవటానికి ఉపాధ్యాయులు సిద్ధంగానే ఉన్నా యంత్రాలే పనిచేయటం లేదు. వేలిముద్రలు, నేత్రాల సహాయంతో హాజరు వేసుకోవటానికి పాఠశాలకు రెండుచొప్పున గతంలోనే వాటిని సరఫరా చేశారు. వాటిల్లో సాఫ్ట్వేర్, డేటా వంటివి లేక మెజార్టీ పాఠశాలల్లో అవి మూలనపడ్డాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 15 వేల మంది ఉపాధ్యాయులకు సంబంధించిన ఈ సమస్యల పరిష్కారంలో ఉన్నతాధికారులు తగు శ్రద్ద కనబరచటం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. అవి పనిచేయటం లేదని సాక్షాత్తు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పరిశీలనలో తేలినా ఇప్పటి వరకు వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టలేదు. మూడు రోజుల క్రితం కమిషనర్ సురేష్కుమార్ కాకుమాను జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. స్వయంగా ఆయనే బయోయంత్రాన్ని తీసుకుని పనితీరు ఎలా ఉందని పరిశీలించారు. అది పనిచేయటం లేదని అక్కడి ఉపాధ్యాయులు చెప్పారు. పక్కనే ఉన్న విద్యాశాఖ అధికారులను ఈ యంత్రాలు ఎందుకు పనిచేయటం లేదో చూడాలని ఆదేశించారు. అసలు ఆ యంత్రాలు పనిచేస్తున్నాయా? లేదా ఒకవేళ పనిచేస్తుంటే ఎన్ని వినియోగంలో ఉన్నాయో వంటి సమగ్ర వివరాలు తెప్పించుకున్నాక ఆదేశాలిస్తే బాగుండేదని ఉపాధ్యాయులు అంటున్నారు.
*♦25 శాతమే వినియోగంలో..:* జిల్లాలో 25 శాతానికి మించి వినియోగంలో లేవు. గతంలోనే ప్రతి పాఠశాలకు ఒక ఐరిష్, మరో ఫింగర్ ప్రింట్ యంత్రమిచ్చారు. ఐరిష్ యంత్రం పనిచేయాలంటే దానికి కేంద్రప్రభుత్వం నుంచి నిర్దేశిత రుసుములు చెల్లించి ‘ఆర్డీ సర్వీసెస్’ అప్డేట్ చేసుకోవాలి. ఈ సాప్ట్వేర్ అప్డేట్ కాకపోవటం వల్లే కనురెప్పల చిత్రీకరణ సాధ్యం కావటం లేదు. దీని నిర్వహణ ఏజెన్సీలకు గత ప్రభుత్వం పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించకపోవటం, ప్రస్తుత ప్రభుత్వంలోనూ చెల్లింపులు జరగకపోవటంతో ఏజెన్సీ నిర్వాహకులు సాప్ట్వేర్ అప్డేట్ చేయించలేదని తెలుస్తోంది. ఇది టీచర్ల స్థాయిలో పరిష్కరించే సమస్య కాదనేది స్పష్టమవుతోంది. వేలిముద్రల యంత్రాల. నిర్వహణ చూసే కార్వే సంస్థకు బకాయిలు పేరుకుపోయాయి. ఆ సంస్థ తరపున జిల్లాలో సాంకేతిక సమస్యలను పరిష్కరించే సిబ్బందికి సుమారు రెండేళ్ల పాటు జీతాలు చెల్లించలేదు. దీంతో వారంతా ప్రత్యామ్నాయం చూసుకుని వెళ్లిపోవటంతో వేలిముద్రల యంత్రాల ఆలనా, పాలనా చూసే నాథులు లేకుండా పోయారు. కొన్ని చోట్ల యంత్రాల్లో బ్యాటరీలు పనిచేయక, వైర్లు తెగిపోయి నిరుపయోగంగా పడి ఉన్నాయి.
బయో హాజరుకు తాము వ్యతిరేకం కాదని, హడావుడి ఉత్తర్వులు ఇవ్వడంతోనే ఇబ్బందని యూటీఎఫ్ నాయకుడు ఎం.కళాధర్ అన్నారు. యంత్రాల్లో డేటా సామర్థ్యం పెంచటం, అధునాతన పరికరాలు సమకూర్చటం వంటి చర్యలకు శ్రీకారం చుట్టాలని ఏపీటీఎఫ్ నాయకుడు బసవలింగారావు విజ్ఞప్తి చేశారు.
0 Comments:
Post a Comment