''ఉద్యోగులకు పోలీసులు సహకరించారా..?''.. డీజీపీని ప్రశ్నించిన సిఎం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ ఉద్యోగులు నిర్వహించిన ' ఛలో విజయవాడ ' విజయవంతమైన నేపథ్యంలో సీఎంతో డీజీపీ సమావేశమయ్యారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన డీజీపీ.. సీఎంను ప్రత్యేకంగా కలిశారు. సుమారు అరగంటపాటు జరిగిన భేటీలో గురువారం విజయవాడలో ఉద్యోగులు నిర్వహించిన సభపైనే చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఉద్యోగులకు పోలీసులు సహకరించారన్న విషయంపై డీజీపీని జగన్ ప్రశ్నించినట్లు సమాచారం. ఉద్యోగుల రాకను అంచనా వేయడంలో ఇంటిలిజెన్స్ వ్యవస్థ విఫలమైనట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో వాటి పనితీరుపైనా చర్చించినట్లు తెలుస్తోంది.
ఉద్యోగులు మారువేషాల్లో రావడం , ముందే విజయవాడ చేరుకుని బస చేయడం లాంటివి జరిగాయని డీజీపీ తెలిపినట్లు సమాచారం. భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలనే విషయంపై డీజీపీకి సిఎం సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సభపై గురువారం పార్టీ ముఖ్యనేతలతో సీఎం సమావేశమై చర్చించినా ఆ భేటిలో డీజీపీ లేరు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా సీఎంను డీజీపీ శుక్రవారం కలిసినట్లు సమాచారం. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు భారీ ఎత్తున 'ఛలో విజయవాడ' కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈనెల 6వ తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఇప్పటికే పీఆర్సీ సాదన సమితి నేతలు ప్రకటించారు.
0 Comments:
Post a Comment