🔳తదుపరి ఏం చేస్తారో చూద్దాం
ఉద్యోగుల వాదనలూ వినాల్సి ఉంది
పెన్‌డౌన్‌ను సమ్మెగా పరిగణించలేం: హైకోర్టు
అమరావతి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిల్ శుక్రవారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. అందుకు ధర్మాసనం తిరస్కరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసిం ది. పెన్‌డౌన్ చేయడాన్ని సమ్మెగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఉద్యోగులు తదుపరి ఏమి చేయబోతున్నారో వేచిచూద్దామని, వారి వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సమ్మెకు దిగాలనుకుంటున్న ఉద్యోగులు కొవిడ్ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలని వ్యాఖ్యానించింది. వైరస్ వారిపైనే కాకుండా ఇతరులపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉందని పేర్కొంది. విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్‌కుమార్, జస్టిస్ మన్మథరావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఉద్యోగ సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసును సవాల్ చేస్తూ విశాఖకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ ఎన్.సాంబశివరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సమ్మె నోటీసును రాజ్యాంగ, చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని అభ్యర్థించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ అభ్యర్థన మేరకు హైకోర్టు ఈ వ్యాజ్యాన్ని లంచ్‌మోషన్‌గా అత్యవసరంగా విచారణ జరిపింది. ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి ఉద్యోగ సంఘాలు సమ్మె చేయబోతున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తున్నా, ఉద్యోగ సంఘాలు మొండి వైఖరి అవలంభిస్తున్నాయన్నారు. సమ్మె చేస్తే సంక్షేమ పథకాల అమలుపై ప్రభావం పడుతుందన్నారు. కొవిడ్ పరిస్థితుల్లో చలో విజయవాడ పేరుతో ఉద్యోగులు అందరూ ఒకచోటకు చేరారన్నారు. ధర్మాసనం స్పందిస్తూ... ఉద్యోగులు ఇంకా సమ్మె చేయడం లేదు కదా? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. పెన్‌డౌన్ చేశారని చెప్పారు. దానిని సమ్మెగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అడ్వకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ... పాలన నిలిచిపోయిందన్న పిటిషనర్ వాదనలో నిజం లేదన్నారు. చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతివ్వలేదన్నారు. 5 వేల మంది చేరేందుకు స్థలం ఉన్న దగ్గర 35 నుంచి 40 వేలమంది వరకు వచ్చారన్నారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తున్నా ఉద్యోగులు స్పందించడం లేదన్నారు. సమ్మె చేయడం సర్వీసు నిబంధనలకు విరుద్ధమని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో సమ్మె చేసే ఉద్యోగులపై చర్యలు తీసుకొనే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ధర్మాసనం కలగజేసుకుంటూ... చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రభుత్వం నియంత్రిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొంది.
0 Comments:
Post a Comment