Andhra News: ఉద్యోగుల జిల్లాల విభజనపై మార్చి 10లోగా కసరత్తు పూర్తి చేస్తాం: ఏపీ ప్రణాళిక విభాగం సీఈవో...
Andhra News: ఉద్యోగుల విభజనపై మార్చి 10లోగా కసరత్తు పూర్తి చేస్తాం: ఏపీ ప్రణాళిక విభాగం సీఈవో
అమరావతి: జిల్లాల విభజన, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని ఏపీ ప్రణాళిక విభాగం సీఈవో విజయ్‌కుమార్ వెల్లడించారు.
అన్నింటిని పరిగణనలోకి తీసుకొని వీలైనన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన అంశంపై ఏపీ ప్రణాళిక విభాగం కార్యాలయంలో ప్రాథమిక స్థాయిలో అభ్యంతరాల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయకుమార్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశానికి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సర్వే సెటిల్మెంట్ కమిషనర్ సిద్ధార్థ జైన్ సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. జిల్లాల పునర్విభజన అంశాలపై జిల్లా కలెక్టర్ల నుంచి సూచనలు, సలహాలతో పాటు ఇప్పటివరకు ప్రాథమిక స్థాయిలో వచ్చిన అభ్యంతరాలను సమావేశంలో చర్చించారు.
ఉద్యోగుల విభజన, నూతన జిల్లాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై మార్చి 10లోగా కసరత్తు పూర్తి చేస్తామని విజయ్‌కుమార్ తెలిపారు. సమంజసమైన అభ్యంతరాలు, డిమాండ్లు ఉంటే పరిష్కరిస్తామన్నారు. సీఎం జగన్ నిర్ణయం మేరకు ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పని మొదలవుతుందని విజయ్‌కుమార్ చెప్పారు. మరోవైపు దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ సైతం దృశ్య మాధ్యమం ద్వారా నాలుగు జిల్లాల కలెక్టర్లు, ప్రణాళిక విభాగం ఉన్నతాధికారులతో మాట్లాడారు. వనరులు, ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించిన అంశాలు, కొత్త జిల్లాల్లో భవనాలకు సంబంధించిన అంశాలపై సీఎస్ సమీక్షించినట్టు తెలుస్తోంది.
0 Comments:
Post a Comment