విద్యాశాఖపై ఏపీ సీఎం జగన్ గురువారం సమీక్ష సమావేశం నిర్వంచారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే విద్యాసంవత్సరం (జూన్) నాటికి నూతన విద్యావిధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలని సీఎం జగన్ అన్నారు.
విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలని, సబ్జెక్టుల వారీగా టీచర్లు కూడా ఉండాలని సీఎం జగన్ అన్నారు. నూతన విద్యావిధానంలో ఏర్పాటవుతున్న స్కూల్స్ కారణంగా సుమారు 22 వేలమందికి పైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వస్తాయని తెలిపారు. వీరందరికీ ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని, వీరి సామర్థ్యాలను మెరుగుపరిచేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.
ప్రతి మండలానికి 2 స్కూళ్లను 2 జూనియర్ కాలేజీలుగా మార్చాలని సీఎం జగన్ ఆదేశించారు. ఒకటి కో ఎడ్యుకేషన్ కోసం, ఒకటి బాలికల కోసం జూనియర్ కళాశాలగా మార్చాలని సీఎం సూచించారు. ఎస్ఈఆర్టీ ఇచ్చిన సిఫార్సులు అన్నీ కూడా అమల్లోకి రావాలన్నారు. మండల రీసోర్స్ సెంటర్ పేరును మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంగా మార్చేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇకపై విద్యాసంబంధిత కార్యకలాపాలు ఎంఈవోకే అప్పగిస్తూ ఎస్ఈఆర్టీ సిఫార్సుకు సీఎం ఆమోదం తెలిపారు. ఎంఈఓ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అటెండెన్స్‌ను ఫిజికల్‌గా కాకుండా ఆన్లైన్ పద్ధతుల్లో తీసుకోవాలన్న సిఫార్సునూ సీఎం అమలు చేయాలన్నారు. విద్యార్ధుల మార్కులను కూడా ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని, పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు నాన్ అకడమిక్ పనులకు వినియోగించవద్దని, హెడ్మాస్టర్లను పలు రకాల మీటింగులు కాకుండా సమన్వయం కోసం నెలకు ఒకే సమావేశం ఏర్పాటు చేయాలని ఎస్ఈఆర్టీ సూచించిన వాటికి సీఎం ఆమోదం తెలిపారు.
0 Comments:
Post a Comment