🔳ఉద్యోగుల, వనరుల విభజనపై అధ్యయనఓ
- 10న ప్రభుత్వానికి తుది నివేదిక
- 4 జిల్లాల కలెక్టర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. ఆయా జిల్లాల నుంచి ఇప్పటి వరకు వచ్చిన సలహాలు, సూచనలు అభ్యంతరాలపై బుధవారం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లతో విజయవాడలోని ప్లానింగ్ కమిషన్ కార్యాలయంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభంలో సిఎస్ సమీర్‌శర్మ నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, డివిజన్ల తొలగింపు, కొత్త జిల్లా కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులపై ఆన్లైన్లో సమీక్ష నిర్వహించారు. అనంతరం సమీక్షలో చర్చించిన అంశాలపై ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి విజరుకుమార్ మీడియాకు వివరించారు. ఉద్యోగులను ఇప్పటికిప్పుడు విభజన చేయడం లేదని, కొత్త జిల్లాలకు తాత్కాలిక కేటాయింపులు మాత్రమే జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్రపతి ఆమోదం పొందిన తరువాత ఉద్యోగుల, జోనల్ విభజన ఉంటుందన్నారు. జిల్లాల వారీ వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నామని, అనంతరం కలెక్టర్లు నివేదిక ఇస్తారని పేర్కొన్నారు. మార్చి 3 వరకు వచ్చిన దరఖాస్తులపై మార్చి 10లోపు ప్రభుత్వానికి అంశాల వారీ నివేదిక అందజేస్తామన్నారు. ప్రభుత్వం పరిశీలించిన అనంతరం మార్చి నెలాఖరులోగా తుది నోటిఫికేషన్ ఇస్తామన్నారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటులో నెల్లూరు జిల్లా నుంచి కొంత ప్రాంతాన్ని శ్రీ బాలాజీ జిల్లాలో కలపడంతో కొన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు. ప్రకాశం జిల్లాలో మార్కాపురం కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని 95 దరఖాస్తులు అందాయని, కందుకూరు రెవెన్యూ డివిజన్‌ను ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలంటూ 30 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయన్నారు. ద్వారకా తిరుమలను ఏలూరులోనే కొనసాగించాలని, నరసాపురం డివిజన్‌ను యథావిధిగా కొనసాగించాలనే ప్రధానంగా డిమాండ్లు వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1500 అభ్యంతరాలు వచ్చాయని, వీటిలో అధికంగా అనంతపురం నుంచి వచ్చాయన్నారు. 51 రెవెన్యూ డివిజన్లను 62కు పెంచుతున్నామని, అవసరమైతే డివిజన్ల పెంపు ఉంటుందన్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టిఆర్, వంగవీటి రంగా పేర్లు పెట్టాలంటూ వినతులు వస్తున్నాయన్నారు. ఎక్కడా అసెంబ్లీ నియోజకవర్గాలను విభజించడం లేదన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ల్యాండ్ సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనరు సిద్ధార్ధ్‌జైన్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment