🔳కోతపెడితే చప్పట్లా?
ప్రభుత్వంతో రాజీపడ్డారా? అమ్ముడుబోయారా?
ఐఆర్ కన్నా తక్కువ ఫిట్మెంట్ చరిత్రలో లేదు
ప్రయోజనాలు సాధించడంలో విఫలమయ్యారు
13 లక్షల మంది ఉద్యోగులకు ప్రతినిధులా..
మోసం చేసేందుకు వచ్చిన ప్రభుత్వ ఏజెంట్లా?
‘కంట్రోల్లో ఉన్నాం సార్’ అన్నప్పుడే మీపై డౌట్
ఉద్యోగ సంఘాల నేతలపై ఉద్యోగుల ఆగ్రహం
ఇది పే రివిజన్ కాదు.. పే రివర్స్
చంద్రబాబు హయాంలో 43% ఫిట్మెంట్
నేడు ఆదాయం పెరిగినా 20్% కోత
జగన్ సర్కారు తీరుపై ఉద్యోగులు గుర్రు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేయడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఐఆర్ కన్నా తక్కువ ఫిట్మెంట్ చరిత్రలో ఎక్కడా ఇవ్వలేదని, ఇది సరికాదని చెప్పాల్సిన నేతలు ప్రభుత్వానికి జీహుజూర్ అనడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగులకు ప్రతినిధులా? లేక ప్రభుత్వం చెప్పింది విని ఊ కొట్టడానికి ప్రభుత్వం ప్రతినిధులా అని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నేతల తీరుపై ఉద్యోగులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉద్యోగులకు పీఆర్సీ ప్రయోజనాలు సాధించడంలో నేతలు దారుణంగా విఫలమయ్యారని మండిపడ్డారు. సీఎంను కలవడం కోసం తహతహలాడిన నాయకులు ఉద్యోగులకు ప్రయోజనాలు సాధించడంలో ఆ తపన కనబరచలేదని ధ్వజమెత్తారు. ఉద్యోగుల సమస్యలను అడ్డం పెట్టుకుని సీఎంను కలిసే ముచ్చట తీర్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ మధ్య బాగా పాపులర్ అయిన ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్నారని, వారిని మచ్చిక చేసుకుని, గుప్పిట్లో ఉంచుకుని వారి ద్వారా 13 లక్షల మంది ఉద్యోగులను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం వేసిన ట్రాప్లో ఆ నేతలు పడ్డారని ఉద్యోగులు విశ్లేషించారు. అందుకే రిటైర్మెంట్ వయసు పెంచుతున్నట్టు సీఎం చెప్పగానే ఆ నాయకులంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారని విమర్శించారు.
ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ, సీసీఏ, పెన్షనర్ల సమస్యను గాలికొదిలేసి బయటకు వచ్చి మీడియా ముందు సంతృప్తి వ్యక్తం చేయడం చూస్తుంటే ఇన్నాళ్లు తాము నమ్మిన నాయకులు ప్రభుత్వంతో రాజీపడ్డారా? లేక అమ్ముడుబోయారా? అని సందేహాలు కలుగుతున్నాయన్నారు. ‘కంట్రోల్లో ఉన్నాం సార్’ అంటూ ఈ నాయకులు అన్నప్పటి నుంచి వీరి తీరుపై అనుమానాలు మొదలయ్యాయన్నారు. ఈ నాయకులైతేనే తమ కంట్రోల్లో ఉండి, మిగిలిన ఉద్యోగులను కంట్రోల్ చేస్తారని భావించిన ప్రభుత్వం.. ఎన్నికల ముందు తీసుకోవాల్సిన రిటైర్మెంట్ వయసు పెంపు నిర్ణయాన్ని ఇప్పుడే తీసుకుందని ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు 22 శాతం ఐఆర్ ఇస్తే మన ప్రభుత్వం వచ్చాక 27 శాతం ఇచ్చారని సంఘాల నాయకులు అప్పుడు డప్పు కొట్టారని, అప్పుడు 27 శాతం ఇచ్చింది ఇప్పుడు 23 శాతానికి తగ్గించడానికా? దీనివల్ల ఉద్యోగులకు ఏం ప్రయోజనం కలిగిందని ప్రశ్నించారు. వేతనాల్లో కోతపై ఏమని సమాధానం చెప్తారని మండిపడ్డారు. ప్రభుత్వం వేతనాలు తగ్గిస్తే లేచి చప్పట్లు కొడతారా? 13 లక్షల మంది ఉద్యోగులకు ప్రతినిధులా మీరు? ఉద్యోగులను మోసం చేయడానికి వచ్చిన ప్రభుత్వఏజెంట్లా అంటూ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.
ఉద్యోగుల అభిప్రాయాలు
ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.
జీతాల్లో కోసేసి, డీఏలతో భర్తీ చేస్తారా? డీఏలను పీఆర్సీగా ఇవ్వడం వైసీపీ సర్కారు మొదలుపెట్టిన దుష్ట సంప్రదాయం.
రిటైర్మెంట్ వయసు తెలంగాణలో 61. దాన్ని 62కి పెంచి ఉద్యోగులపై ప్రేమ ఉందనడం సరికాదు. తెలంగాణలో ఫిట్మెంట్ 30 శాతం. ఇక్కడ 31 శాతం ఫిట్మెంట్ ఇస్తే నిజంగానే ప్రేమ ఉన్నట్టు.
రిటైర్మెంట్ పీఆర్సీలో భాగమే కాదు. పీఆర్సీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించింది. రిటైర్మెంట్ వయసు సర్వీ్స విషయం. రెండింటినీ కలిపేసి ఆ ముసుగులో వేతనాలు తగ్గించేశారు.
చంద్రబాబు సర్కారులో ఇలా..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. రూ.16 వేల కోట్ల రెవెన్యూ లోటుతో నవ్యాంధ్రప్రదేశ్లో పాలన ప్రారంభించిన చంద్రబాబు.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. ప్రభుత్వ ఉద్యోగులకు సంతృప్తి కలిగించేలా 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సెక్రటేరియట్ ఉద్యోగులకు మరెన్నో సౌకర్యాలు కల్పించారు. అప్పుడే ఆయన 43 శాతం ఫిట్మెంట్ ఇస్తే.. ప్రసుత్తం పెరిగిన ధరలతో 55ు ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగులు కోరారు. చర్చల సందర్భంగా ప్రభుత్వం తగ్గి కనీసం 45 శాతానికైనా అంగీకరిస్తుందని భావించారు. ఇందుకోసం ఆందోళనలకు కూడా దిగారు. ఇవేవీ పట్టించుకోని జగన్ సర్కారు 20 శాతం కోత పెట్టింది. ‘ఇది పే రివిజన్ కాదు.. పే రివర్స్’ అని ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో 30 శాతం ఫిట్మెంట్
తెలంగాణ ప్రభుత్వం 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. నిజానికి అక్కడి వేతన సవరణ కమిషన్ ఏడు శాతమే సిఫారసు చేసింది. ఉద్యోగుల ఆందోళనలతో ఆ సర్కారు 30 శాతం ఇచ్చింది. మన రాష్ట్రంలో అసలు అశుతోష్ కమిషన్ ఎంత ఫిట్మెంట్ సిఫారసు చేసిందో అసలా నివేదికే బయటపెట్టలేదు. సీఎస్ కమిటీ నివేదికపైనే ఉద్యోగ సంఘాలతో చర్చోపచర్చలు, పీఆర్సీ ప్రకటన జరిగిపోయాయు. చంద్రబాబు ఇచ్చిన సంఖ్యకు తిరగేసి అయినా (34 శాతం) ఇస్తారని.. లేదంటే తెలంగాణ ఇచ్చినట్లు 30 శాతమైనా ఫిట్మెంట్ ఇస్తారని ఆశగా ఎదురు చూసిన ఉద్యోగులకు జగన్ ఝలక్ ఇచ్చారు. ప్రతిదీ చంద్రబాబు కన్నా మిన్నగా చేస్తున్నామని చెప్పే జగన్.. పీఆర్సీలో ఆయనతో పోటీపడలేక.. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య(23)తో పోటీపడి ఫిట్మెంట్ ప్రకటించారని కొందరు సోషల్ మీడియాలో ఎద్దేవాచేస్తున్నారు.
0 Comments:
Post a Comment