ఒటిఎస్ 'పట్టా'కు రుణమివ్వలేం..!
తేల్చిచెబుతున్న బ్యాంకర్లు
ప్రభుత్వం మాటలు బూటకమేనా..!
ఇప్పటి వరకూ 25 వేలకు పైగా పట్టాలు అందజేత
జిల్లాలో లక్ష మందికిపైగా రూ.16 కోట్ల ఒటిఎస్ చెల్లింపులు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
ఒటిఎస్ పట్టాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందొచ్చనని, ఎలాంటి లింకు డ్యాకుమెంట్లు అక్కర్లేదని ప్రభుత్వం చెప్పిన మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి సంబంధం లేకుండా పోయింది.
ప్రభుత్వం ఇచ్చే ఒటిఎస్ పట్టాలకు రుణాలివ్వలేమని 30 ఏళ్లకు సంబంధించిన లింక్ డ్యాంకుమెంట్ తప్పనిసరి అని బ్యాంకర్లు చెబుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో పట్టాలు అందుకుని రుణాలకోసం బ్యాంకులకు వెళ్లిన లబ్ధిదారులంతా లబోదిబోమంటున్నారు. 1983 నుంచి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకు ఒటిఎస్ (వన్‌టైం సెటిలమెంట్) ద్వారా డబ్బులు వసూలు చేసి ప్రభుత్వం పట్టాలు ఇస్తోంది. ఈ పట్టాలను బ్యాంకుల్లో పెట్టుకుని రూ.నాలుగు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకూ రుణాలు పొందొచ్చని ప్రభుత్వం చెప్పింది. అందుకు తగిన విధంగా నిబంధనలు మార్పు చేసినట్లు తెలిపింది. కానీ బ్యాంకర్లు మాత్రం ఆ పట్టాలతో రుణాలు ఇవ్వలేమని చెబుతుండటంతో లబ్ధిదారులకు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ప్రభుత్వం నుంచి ఇళ్లు పొందిన లబ్దిదారులు 2,25,283 మంది వరకూ ఉన్నట్లు గుర్తించారు. గ్రామాల్లో అయితే రూ.పది వేలు, మున్సిపాలిటీల్లో అయితే రూ.15 వేలు, కార్పొరేషన్లో రూ.20 వేలు చొప్పున ఒటిఎస్ వసూలుకు ప్రభుత్వం దిగింది. ఒటిఎస్ వసూలుపై తీవ్రమైన విమర్శలు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రమూ వెనక్కి తగ్గలేదు. జిల్లాలోనే ముఖ్యమంత్రి సభ నిర్వహించి ఒటిఎస్కు శ్రీకారం చుట్టారు. ఒటిఎస్ చెల్లించి పట్టాలు అందుకుంటే అన్నివిధాలుగా ఉపయోగం ఉంటుందని సభలో సైతం చెప్పారు.
జిల్లాలో రూ.16 కోట్లు వసూలు
జిల్లాలో ఇప్పటి వరకూ లక్షా 11 వేల 327 మంది లబ్దిదారుల నుంచి ఒటిఎస్ కింద రూ.16 కోట్లకుపైగా వసూలు చేశారు. 80,035 పట్టాల వరకూ తహశీల్దార్ల వద్ద రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రక్రియ పూర్తయిన పట్టాలు 30,413 వరకూ ఉన్నాయి. ఇప్పటి వరకూ లబ్ధిదారులు చేతికందిన ఒటిఎస్ పట్టాలు 25 వేలకు పైగా ఉన్నట్లు లెక్కల చెబుతున్నాయి. ఇంకా పట్టాలు ఇవ్వకపోవడంపైనా తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. పట్టాలు తీసుకున్న లబ్ధిదారులు చాలామంది రుణాల కోసం బ్యాంకులకు వెళ్తున్నారు. బ్యాంకర్లు మాత్రం రుణాలు ఇవ్వడం కుదరదని తిరస్కరిస్తున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. లింకు డాక్యుమెంట్ తప్పనిసరి అంటూ బ్యాంకర్లు నిబంధనలు పెడుతున్నారు. దీంతో లబ్ధిదారులకు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. అప్పులు తెచ్చిమరీ ఒటిఎస్ సొమ్ములు కట్టామని, ఇప్పుడు ఆ పట్టాలు ఉపయోగం లేనప్పుడు ప్రయోజనం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. పట్టాలు అందుకున్న లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు అందేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. ఈ పట్టాలతో బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదని తెలియడంతో చాలా మంది కట్టేందుకు సైతం వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒటిఎస్ గడువును మార్చి వరకూ ప్రభుత్వం పొడిగించింది. లబ్ధిదారులు మాత్రం ముందుకు రావడం లేదు. పట్టాలు అందజేతతో పాటు, అవి ఉపయోగపడేవిధంగా చేయకపోతే జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
0 Comments:
Post a Comment