🔳‘జెన్కో’ను ప్రైవేటీకరిస్తే మెరుపు సమ్మె
సర్కారుకు విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ నోటీసు
అమరావతి, విజయవాడ, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): కృష్ణపట్నం థర్మల్ విద్యుత్కేంద్రాన్ని 25 ఏళ్ల పాటు లీజుకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, కాదని ముందడుగు వేస్తే .. శనివారం నుంచి దశలవారీ ఆందోళన చేస్తామని.. ప్రభుత్వాన్ని రాష్ట్ర విద్యుత్తు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి హెచ్చరించింది. అప్పటికీ ఆగకుండా మొండి వైఖరిని ప్రదర్శిస్తే మెరుపు సమ్మెలోకి వెళతామని స్పష్టం చేసింది. మార్చి రెండో తేదీ నుంచి విద్యుత్తు యాజమాన్యం కేటాయించిన సెల్‌ఫోన్ సిమ్‌కార్డును వాపస్ చేస్తామంటూ తీవ్ర హెచ్చరిక చేసింది. కృష్ణపట్నం ప్లాంటును ప్రైవేటుపరం చేయొద్దంటూ విద్యుత్ సౌఽధలో ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (హెచ్.ఆర్) పృథ్వీతేజ్ను శుక్రవారం కలిసి విద్యుత్తు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్, సెక్రటరీ జనరల్ పి.ప్రతాపరెడ్డి, కన్వీనర్ సాయికృష్ణ నోటీసు అందజేశారు. అన్ని ఉత్పాదక కేంద్రాలు, డివిజన్, సర్కిల్, జోనల్ కార్యాలయాలు, ఏపీ జెన్కో, ట్రాన్స్‌కో, ఏపీ డిస్కమ్‌ల కార్పొరేట్ ఆఫీసులలో ఆందోళనలు నిర్వహిస్తామని ఈ నోటీసులో హెచ్చరించారు. ‘‘శనివారం నుంచి విద్యుత్తు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారు. అదేరోజు సామాజిక మాధ్యమాలు, పోస్టు కార్డుల ద్వారా ముఖ్యమంత్రికి అభ్యర్థనలు పంపుతాం. వచ్చే నెల మూడో తేదీ నుంచి ఐదో తేదీ వరకూ స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పిస్తాం. ఏడో తేదీ నుంచి 28వ తేదీ వరకూ వర్క్ టు రూల్.. రిలే నిరాహార దీక్షలు చేస్తాం. అప్పటికీ ప్రభుత్వంలో మార్పు రాకపోతే.. మార్చి రెండో తేదీన యాజమాన్యాలు కేటాయించిన సిమ్ కార్డులను వాపసు చేస్తాం. అదేరోజు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తూ మెరుపు సమ్మెకు దిగుతాం.’’ అని నోటీసులో జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
0 Comments:
Post a Comment