🔳అదరం.. బెదరం..
- అసంబద్ధ పిఆర్సి రద్దయ్యే వరకు ఉద్యమిస్తాం
- రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆందోళనలు
- రెండో రోజూ కొనసాగిన రిలే నిరాహార దీక్షలు
ప్రజాశక్తి-యంత్రాంగం :ప్రభుత్వ హెచ్చరికలకు బెదిరేదిలేదని, ఎన్ని సమస్యలు ఎదురైనా ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన చీకటి పిఆర్సి జిఒలను రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కూడా నిరనసలు కొనసాగాయి. పిఆర్సి సాధన సమితి ఇచ్చిన ఉద్యమ కార్యాచరణ పిలుపులో భాగంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్సన్దారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరాయి. అశుతోష్ మిశ్రా నివేదికకు బహిర్గతం చేసి ఉద్యోగులతో చర్చలు జరపాలని, జనవరికి పాత జీతాన్నే ఇవ్వాలని ఉద్యోగులు నినదించారు.
గుంటూరు కలెక్టరేట్ ఎదుట దీక్షల్లో ఎపి జెఎసి అమరావతి చైర్మన్ బప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్లనే ఉద్యోగ సంఘాలు పోరు బాట పట్టాయని, ఇది నాయకులు చేస్తున్న ఉద్యమం కాదని, కింది స్థాయి నుంచి వచ్చిన ఉద్యమమని పేర్కొన్నారు. అనంతరం దీక్షా శిబిరం వద్ద తెలుగు తల్లి వేషధారిణికి నాయకులు వినతి పత్రం ఇచ్చారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద రెండో రోజు దీక్షలను ఎపి జెఎసి చైర్మన్ బండి శ్రీనివాసరావు ప్రారంభించి మాట్లాడారు. పిఆర్సి జిఒలను రద్దు చేయాలని, ఈ నెలకు 5 డిఎలతో కూడిన పాత వేతనం ఇవ్వాలని కోరారు. అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా విజయవాడ ధర్నా చౌక్, మచిలీపట్నంలోని కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద దీక్షలు కొనసాగాయి. విజయవాడ ధర్నా చౌక్ వద్ద దీక్షలకు బెఫి (బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్), సిఐటియు మద్దతు ప్రకటించాయి. దీక్షల్లో ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.సూర్యనారాయణ, పంచాయతీరాజ్ ఇంజినీర్స్ జెఎసి రాష్ట్ర అధ్యక్షులు వి.వి.మురళీకృష్ణ, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి పి.అజరుకుమార్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహ్మద్ పాల్గన్నారు. మచిలీపట్నంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గని దీక్షకు సంఘీభావం తెలిపారు. యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు, ప్యాప్టో సెక్రటరీ జనరల్ కె రాజేంద్రప్రసాద్, పిఆర్సి సాధన సమితి నాయకులు పాల్గన్నారు.
విశాఖ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద రెండో రోజు దీక్షలకు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఉద్యోగులపై ప్రభుత్వం బెదిరింపులు ఆపి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో వెంటనే చర్చలు జరపాలని, పిఆర్సి సమస్య పరిష్కరించి, సమ్మెను నివారించాలని కోరారు. జివిఎంసి ప్రధాన కార్యాలయం, భీమునిపట్నం జోన్-1 కార్యాలయం వద్ద దీక్షలు కొనసాగాయి. యుటిఎఫ్ ఆధ్వర్యాన అచ్యుతాపురం, ఆనందపురం, అనకాపల్లిలో ఎంఇఒలకు వినతిపత్రాలు అందజేశారు. శ్రీకాకుళంలోని ఎపి ఎన్‌జిఒ కార్యాలయ ఆవరణలో రిలే దీక్షలకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పి.రఘువర్మ సంఘీభావం తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా పిఆర్సి ఉండాలని సూచించారు. దీక్షల్లో ఎపి ఎన్‌జిఒ అసోసియేషన్ రాష్ట్ర సహాధ్యక్షులు చౌదరి పురుషోత్తం నాయుడు, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర తదితరులు పాల్గన్నారు. విజయనగరంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన దీక్షలు రెండో రోజుకు చేరాయి.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ధర్నా చౌక్ వద్ద దీక్షలకు సిఐటియు, ఎఐటియుసి నాయకులు మద్దతు తెలిపారు. రెండో రోజు దీక్షలను ఎపి ఎన్‌జిఒ రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసు, సెక్రటరీ మూర్తిబాబు ప్రారంభించి మాట్లాడారు. నూతన పిఆర్సిని రద్దు చేసి, మెరుగైన పిఆర్సి ఇవ్వాలని కోరారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద దీక్షల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గన్నారు. చింతలపూడిలో ఎఐటియుసి ఆధ్వర్యంలో అధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు.
కడప కలెక్టరేట్ ఎదుట దీక్షల్లో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజ, ఎస్టియు రాష్ట్ర నాయకులు బాలగంగిరెడ్డి, ఎపి ఎన్‌జిఒ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్ యాదవ్, ఎపి ఎన్‌జిఒ రాష్ట్ర మహిళా విభాగం అసోసియేటెడ్ అధ్యక్షులు నిర్మలజ్యోతి, పిఆర్సి సాధన సమితి నాయకులు పాల్గన్నారు. చిత్తూరులోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద, సోమలలో జెడ్పి కార్యాలయం ఎదుట దీక్షలు కొనసాగాయి. ఏర్పేడులో ఉద్యోగ సంఘాల నేతలు ఎంపిడిఒ విష్ణు చిరంజీవికి, రేణిగుంట మండలం కరకంబాడీ జెడ్పి ఉన్నత పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది పాఠశాల ప్రధానోపాధ్యాయునికి వినతిపత్రాలు అందజేశారు. ఈ నెలకు పాత జీతాన్నే ఇవ్వాలని కోరారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని సప్తగిరి సర్కిల్ ప్రభుత్వ బాలికల కళాశాల వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన దీక్షను కొనసాగించారు. వీరికి పలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ఎన్‌జిఒలు మద్దతు తెలిపారు. కర్నూలు ధర్నాచౌక్‌లో దీక్షలకు సిఐటియు, ఐఎన్టియుసి కార్మిక సంఘాల నాయకులు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట దీక్షల్లో 1500 మంది మహిళా ఉద్యోగ, ఉపాధ్యాయునిలు పాల్గన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విశాఖ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద రెండో రోజు దీక్షలు
విశాఖ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద రెండో రోజు దీక్షలు
ఒంగోలు కలెక్టరేట్ వద్ద రెండో రోజు దీక్షలు
ఒంగోలు కలెక్టరేట్ వద్ద రెండో రోజు దీక్షలు
0 Comments:
Post a Comment