🔳ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే క్షమించం
చర్యకు ప్రతిచర్య ఉంటుంది: మంత్రి బొత్స హెచ్చరిక
సంఘాల నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారుజీతాల్లో కోత అన్నది అవాస్తవం: పేర్ని పీఆర్సీకి అంగీకరించి, ఆందోళనలా: ఆదిమూలపుఏ రాష్ట్రంలోనైనా 27 శాతం ఐఆర్ ఇచ్చారా?: గడికోట
అమరావతి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించాకే ప్రభుత్వం పీఆర్సీపై నిర్ణయం తీసుకుందని మంత్రులు పేర్కొన్నారు. ఉద్యోగులు బాధ్యతారహితంగా మాట్లాడడం సరికాదన్నారు. పీఆర్సీపై ఉద్యోగులు పోరుబాట పట్టిన నేపథ్యంలో మంత్రులు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే క్షమించేది లేదని, మంచి వాతావరణాన్ని పాడు చేసుకోవద్దని కోరుతున్నానని మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో అన్నారు. ఆందోళన చేస్తున్న కొంతమంది ఉద్యోగుల మాటలు బాధాకరంగా ఉన్నాయని, సంయమనం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాష అదుపులో ఉండాలని హెచ్చరించారు. ఉద్యోగులకు కావాల్సింది ఘర్షణా? లేక సమస్య పరిష్కారమా? అని ప్రశ్నించారు. బాధ్యతారహితంగా మాట్లాడుతున్న ఉద్యోగులను సంఘాల నేతలు కట్టడి చేయాలని సూచించారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని గ్రహించాలని, ఇలా మాట్లాడి పర్యవసానాలు చూడాల్సిన పరిస్థితి వద్దని హెచ్చరించారు. ముఖ్యమంత్రి తపన పడుతున్నారని, ఆర్థిక పరిస్థితి వల్ల చేయలేకపోతున్నారని సంఘాల నేతలే చెప్పారని పేర్కొన్నారు. అధికారులు చెప్పిన లెక్కల్లో తేడాలున్నాయంటూ, అభ్యంతరాలుంటే చెప్పాలని సూచించారు. ఉద్యోగులు ఎవరి కోసమో ప్రొవొకేషన్లోనికి వెళ్లవద్దని, సానుకూలంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ప్రతిపక్షాలు రాజకీయం చేసి లబ్ధిపొందాలని అనుకుంటున్నాయని బొత్స విమర్శించారు.
జీతంలో ఐఆర్ భాగమా?: పేర్ని ఉద్యోగులను యూనియన్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 23 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నామని, ఉద్యోగులపై ప్రేమతోనే ఇవన్నీ చేస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ 27 శాతం ఐఆర్ ఇవ్వలేదని, ఐఆర్‌ను జీతంలో భాగంగా ఎలా భావిస్తారని ప్రశ్నించారు. హెచ్ఆర్ఏ అనేది జీతభత్యాల్లో భాగం కాదా అని అన్నారు. పీఆర్సీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కొత్త పీఆర్సీతో జీతాల్లో కోత పడుతుందనేది అవాస్తవమన్నారు. మొత్తానికి జీతాలు పెరిగాయా లేదా అనేది చూడాలన్నారు. ఉద్యోగులు ఆశించిన మేరకు చేయలేకపోయినందుకు బాధగా ఉందన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. ఉద్యోగులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని, ఎవరో చెప్పిన మాటలు నమ్మి సమ్మెకు వెళ్లొద్దని సూచించారు.
అన్నిటికీ అంగీకరించి ఆందోళనలా: ఆదిమూలపుముఖ్యమంత్రితో సమావేశంలో పీఆర్సీకి అంగీకరించి, ఇప్పుడు ఆందోళనలు చేస్తామనడం ఉద్యోగులకు సరికాదని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగులు ఆందోళనలు చేయడమేంటని ప్రశ్నించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పీఆర్సీతో ఏమైనా ఇబ్బందులుంటే ప్రభుత్వంతో మాట్లాడవచ్చని సూచించారు.
పీఆర్సీతో జీతాలు పెరుగుతాయి: గడికోట ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కోరారు. ప్రతిపక్ష నేతల ఉచ్చులో పడి సమ్మెకు వెళ్లవద్దన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రకటించిన పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు పెరుగుతాయన్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచాలన్న కొంతమంది ట్రాప్‌లో పడొద్దని హెచ్చరించారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో సామాన్యుల పట్ల స్నేహపూర్వకంగా ఉన్న ప్రభుత్వం.. ఉద్యోగుల పట్ల వివక్షతో ఎందుకుంటుందన్నారు. ఖజానాపై రూ.10 వేల కోట్ల భారం పడుతున్నా పీఆర్సీకి ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. కరోనా పరిస్థితుల్లో ఏ రాష్ట్రంలోనైనా 27 శాతం ఐఆర్ ఇచ్చారా? పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందా? అని ప్రశ్నించారు.
0 Comments:
Post a Comment