✍చర్చలకు రాకుండా ఏంచేస్తారు?
♦ఉద్యోగనేతల తీరు అనాలోచితం, అపరిపక్వం: సజ్జల
🌻అమరావతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): అనాలోచితంగానూ, అపరిపక్వంగానూ ఉద్యోగ సంఘాలు ఆలోచిస్తున్నట్లు అనిపిస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. పీఆర్సీ సాధన సమితి సభ్యులే కాకుండా ఉద్యోగ సంఘాల నుంచి ఎవరు వచ్చినా వాళ్లతో చర్చలు జరపడానికి మంత్రుల కమిటీ సిద్ధంగా ఉన్నదన్నారు. గురువారం చర్చలకు రావాలన్న ఆహ్వానాన్ని ఉద్యోగ సంఘాలు తిరస్కరించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నాలుగు మెట్లు దిగైనా పీఆర్సీపై ఏవైనా అపోహలు ఉంటే తొలగించాలనే ఉద్దేశంతోనే చర్చలకు ఆహ్వానించాం. నేతలు వస్తే కలుసుకోవడానికి మంత్రుల కమిటీ సచివాలయంలో రోజంతా అందుబాటులో ఉంది. ఎక్కడో కూర్చొని మాట్లాడితే సమస్యకు పరిష్కారం దొరకదనేది ఉద్యోగ నేతలు గ్రహించుకోవాలి. ప్రభుత్వంతో చర్చలు మినహా మరో ప్రత్యామ్నాయం ఏముంది? పరిస్థితి చేజారకముందే వచ్చి.. వారి అభ్యంతరాలను కమిటీ ముందు తెలపాలి. శుక్రవారం కూడా సచివాలయంలో 12 గంటల నుంచి అందుబాటులో ఉంటాం. చర్చలకు సిద్ధపడకుండా షరతులు పెట్టడం సమంజసం కాదు. ఉద్యోగులు మా ప్రత్యర్థులో శత్రువులో కాదు. వారు ప్రభుత్వంలో భాగం. సీఎం జగన్ పాజిటివ్‌గా ఉండే వ్యక్తి. ఈ విషయం గమనించి ఉద్యోగులే పూనుకొని తమ నేతలను చర్చలకు ఒప్పించాలి’’ అని సజ్జల కోరారు. సుప్రీం కోర్టు నిర్దేశాల ప్రకారం సమ్మె నిషిద్ధమని, కొన్నిచోట్ల ట్రెజరీ ఉద్యోగులు ఫైనాన్సియల్ బిల్లులు పాస్ కాకుండా ఆపడం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుందని అన్నారు. పరిస్థితి సమ్మె వరకు వెళ్లకుండా జాగ్రతలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగ సంఘాలు ముందడుగు వేసేటట్టయితే మంత్రుల కమిటీతో చర్చలకు రావొచ్చు కదా అని మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని వ్యాఖ్యానించారు. పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు వచ్చి ఆర్థికశాఖ అధికారులు చెప్పింది తప్పని నిరూపిస్తే సీఎంకు చెప్పి తాము ఒప్పించే ప్రయత్నం చేస్తామని మంత్రి పేర్ని నాని అన్నారు.
0 Comments:
Post a Comment