సరిహద్దు పాఠశాలల వివాదం
బ్రహ్మపురి ప్రాథమిక పాఠశాలలో బల్లలపై కూర్చుని చదువుకుంటున్న విద్యార్థులు
పామర్రు: కె.గంగవరం మండలం బ్రహ్మపురి, మూలపొలంలో నాలుగేళ్ల కిందట ప్రాథమిక పాఠశాలలుండేవి.
అప్పట్లో 20లోపు విద్యార్థులున్న పాఠశాలల్ని మూసేసి.. అక్కడ చదివేవారిని సమీప బడులకు పంపాలని ప్రభుత్వం ఆదేశించడంతో కె.మల్లవరం, కొత్తకొంపలు, వట్రుపూడి, మూలపొలంలోని పాఠశాలలను మూసేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ నాలుగింటిని 15 రోజుల కిందట తెరిచారు. బ్రహ్మపురి పాఠశాలలోని 52మంది పిల్లల్లో సగం మందిని మూలపొలం పాఠశాలకు పంపించేశారు. ఇక్కడే వివాదం మొదలైంది. బ్రహ్మపురి పాఠశాలలో కావాలనే తమ పిల్లల్ని ఉంచేసి మిగిలినవారందరినీ మూలపొలం పంపేశారని, వివక్షత చూపుతున్నారని, అక్కడ సరైన వసతులు లేవని.. దానిని మూసేసి బ్రహ్మపురి బడినే కొనసాగించాలని కొందరు స్థానికులు జిల్లా కలెక్టరుకు అర్జీ పెట్టుకున్నారు. ఇది సరికాదని మూలపొలానికి చెందిన వారు వాదనకు దిగారు. వారం నుంచి ఈ వ్యవహారం నలుగుతోంది. మూలపొలానికి చెందిన వారు మంగళవారం బ్రహ్మపురి పాఠశాల వద్దకు చేరుకొని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఎంఈవో నాగరాజు అక్కడికి వెళ్లి వారికి నచ్చచెప్పినా ఫలితం లేకపోవడంతో డీఈవో అబ్రహం రెండు పాఠశాలలను సందర్శించి, దస్త్రాలను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఇరువర్గాల వారికి వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి వారి నుంచి అంగీకార పత్రాలు తీసుకుని నచ్చిన పాఠశాలకు పిల్లలను పంపించే ఏర్పాటుచేయాలని ఎంఈవోను ఆదేశించారు.
0 Comments:
Post a Comment