🔳వంచనా శిల్పం
ఇంటెరిమ్ రిలీఫ్ కన్నా నాలుగు శాతం తక్కువగా ఫిట్మెంట్ ప్రకటించి, ఉన్న సిసిఎను తొలగించి, ఇంటి అద్దె అలవెన్సును సుమారు సగానికి కోసేసిన తరువాత కూడా కొత్త పిఆర్సి వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు పెరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పడం సర్కారు వంచనకు పరాకాష్ట. ఐ.ఆర్ కంటె తక్కువ ఫిట్మెంట్ ప్రకటించి సహజ న్యాయాన్నీ సర్కారు ఉల్లంఘించింది. హెచ్ఆర్ఎ 30 శాతం ఉన్నదల్లా ఒకేసారి 16 శాతానికి తగ్గించారు. మిగిలిన శ్లాబుల్లోనూ 4 నుండి 8 శాతం తగ్గించారు. సుమారు రెండేళ్లుగా ఐదు డి.ఎ వాయిదాలను బిగబట్టి అన్నీ ఒకసారి ఇచ్చి ఇప్పుడు చూడండి అంటున్నారు. అసలు 2018 జూలై నుండి అమలు కావలసిన పిఆర్సిని 2022 జనవరి నుండి అమలు చేస్తామనడం దగా. దాదాపు నాలుగేళ్లపాటు వాయిదా వేసిన సర్కారు ఇకపై పదేళ్లకే పిఆర్సి అని ప్రకటించడం మరో వంచన. అది కూడా కేంద్ర ప్రభుత్వ పిఆర్సితో ముడిపెట్టడం దుర్మార్గం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఊసే లేదు. దశాబ్దాల తరబడి సర్వీసు చేస్తున్నా, వారిని కనీస టైమ్ స్కేలు తోటే సరిపెట్టుకోమంటున్నది. అది కూడా వారిలో మూడో వంతుకైనా అమలు కావడం లేదు. ఇక రెండున్నర లక్షల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులనైతే పూర్తిగా విస్మరించారు. లక్షకు పైగా ఉన్న వార్డు, గ్రామ సచివాలయాల ఉద్యోగులను గాలికొదిలేశారు. పదవీ విరమణ వయస్సు మాత్రం రెండేళ్ళు పెంచారు. ప్రమోషన్ల కోసం ఎదురుచూసేవారి ఆశల మీద నీళ్ళు చల్లారు. నిరుద్యోగులను మరో మారు దగా చేశారు. అధికారానికి వచ్చాక సిపిఎస్ రద్దు చేస్తామన్న ఎన్నికల వాగ్దానం అవగాహనా లేమితో చేసినట్లు ఇప్పుడు లీకులిస్తున్న దుస్థితి.
ప్రభుత్వ ఆర్థిక దుస్థితికి, ఉద్యోగుల జీతాలకు పోటీ పెట్టి ప్రభుత్వం చర్చ రేపడం అన్యాయం. దేశం, యావత్ ప్రపంచమే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి వుంది. కరోనా దానిని మరింత తీవ్రం చేసింది. ఈ స్థితిలో అనేక దేశాల్లో ప్రభుత్వాలు ఉద్దీపన చర్యలు చేపట్టాయి. నగదు బదిలీ, పన్నుల రాయితీ, ఇంటద్దెలను ప్రభుత్వాలే భరించడం వంటి చర్యలను చేపట్టాయి. కాని మన రాష్ట్రంలో ఆ విధమైన సహాయం ఏదీ ఉద్యోగులకు అందలేదు సరికదా ఈ కాలంలోనే చెత్త పన్ను విధింపు, ఇంటి పన్ను, విద్యుత్ చార్జీల పెంపు వంటి చర్యలకు పాల్పడ్డారు. రాష్ట్రానికి రావలసిన వాటా కోసం కేంద్రంతో పోరాడవలసింది పోయి ఉద్యోగులను లక్ష్యం చేసుకోవడం అన్యాయం.
పిఆర్సి గురించి ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు, సంప్రదింపులు అంటూనే ప్రభుత్వం అర్ధరాత్రి జీవోలు జారీ చేయడం 'తాంబూలాలిచ్చేశా తన్నుకు చావండి..' అన్న చందంగా ఉంది. పదకొండవ వేతన సవరణ సంఘం సిఫార్సులేమిటో ఇప్పటికీ వెల్లడించకపోవడం లోకాన్ని చీకటిలో ఉంచడమే. చిన్న ఫ్యాక్టరీలోనో మరో సంస్థలోనో పని చేసే కార్మికులు, ఉద్యోగులు తమకు చట్టబద్ధంగా సంక్రమించిన ఉమ్మడి బేరసారాలాడే హక్కుతో ద్వైపాక్షిక చర్చల ద్వారా యాజమాన్యంతో వేతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. లక్షలాది మందిగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు మాత్రం ఆ హక్కు లేదు. ప్రభుత్వం ఏకపక్షంగా జారీ చేసిన జీవోలే ప్రాతిపదిక! బుద్ధిజీవులు ఇప్పుడైనా తమ హక్కుల గురించీ ఆలోచించాలి. అశుతోష్ మిశ్రా సీనియర్ ఐఎఎస్, సమీర్ శర్మ ఎంతో అనుభవం గడించినవారే, ఇక సిఎంఓ అధికారులూ తక్కువేం కాదు. అలాంటిది ఈ మూడు రకాల అధికార బృందాలు వేర్వేరు విధాలుగా సిఫార్సులు చేశారు. ఎవరిని తప్పుదోవ పట్టించడానికి ఈ పొంతన లేని నివేదికలు? యజమానిగా తన స్వంత ఉద్యోగుల సంక్షేమాన్ని చూడడంలో విఫలమైతే ఇక రాష్ట్రం మొత్తం బాగోగులు ఏవిధంగా చూడగలరన్న విమర్శకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పుకోవలసి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పిఆర్సి సిఫార్సులు వెల్లడించి, వాటి ప్రాతిపదికగా ఉద్యోగ, ఉపాధ్యాయుల జీతభత్యాలపై చర్చలు జరిపి ఉభయులకూ ఆమోదయోగ్యంగా ఉండే ఒప్పందం చేసుకోవడం విజ్ఞత అనిపించుకుంటుంది.
0 Comments:
Post a Comment