ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి
జిల్లాలో వందలాది ప్రాథమిక పాఠశాలలు కొద్ది రోజుల్లో కనుమరుగుకానున్నాయి. ప్రస్తుతం దాదాపు ప్రతి ఊర్లోనూ పిల్లలకు అందుబాటులో ప్రాథమిక పాఠశాలలున్నాయి
నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా భవిష్యత్తులో మూడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని ప్రాథమిక పాఠశాలలను మూసేసి, పిల్లలను సమీప పాఠశాలలకు పంపించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విలీన ప్రక్రియతో పేద పిల్లలు ప్రాథమిక విద్య దూరంకానున్నారు. విలీన పాఠశాల ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు సర్దుబాటుచేయడం ద్వారా భవిష్యత్తులో ఉపాధ్యాయ నియామకాలుండవు. విద్యకు పెట్టే ఖర్చును తగ్గించుకునేందుకు ప్రాథమిక పాఠశాలలను కుదించేందుకు, మూసేందుకు అత్యంత రహస్యంగా ప్రభుత్వం ఒక్కొక్క అడుగు ముందుకేస్తోంది. ప్రస్తుతం 250 మీటర్లలోపు 141 ప్రాథమిక పాఠశాలలోని మూడు, నాలుగు, ఐదు తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. విలీనం చేసినట్లు తెలీకుండా విలీన తరగతుల విద్యార్థులను వసతి కొరత వల్ల ఉన్నత పాఠశాలలకు పంపించకుండా, యథావిధిగా ప్రాథమిక పాఠశాలల్లోనే తరగతులు నడిపిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లోని మూడు, నాలుగు, ఐదు తరగతులకు ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటైన సబ్జెక్టు ఉపాధ్యాయులను పంపిస్తున్నారు. మూడు, నాలుగు, ఐదు తరగతుల విలీనంపై తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పిన పాఠశాలల జోలికి వెళ్లనట్లు విద్యాశాఖాధికారులు చెబుతున్నప్పటికీ, విలీన ప్రక్రియ నుంచి అటువంటి పాఠశాలలను తప్పించలేదు. 250 మీటర్లలోపు ప్రాథమిక పాఠశాలలోని మూడు నుంచి ఐదు తరగతుల విలీనం పూర్తయితే, మూడు కిలోమీటర్లలోపు ప్రాథమిక పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. తరువాత ఐదు కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలలను మూసివేయనున్నారు. మూడు, ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రాథమిక పాఠశాలలను మ్యాపింగ్ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారులకు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది.
ఐదు కిలోమీటర్లలోపు ప్రాథమిక పాఠశాలలు 300కు పైగా ఉన్నాయి. ఇవన్నీ మూతపడితే అందులో చదువుతున్న పేద పిల్లలు దూరపు పాఠశాలలకు వెళ్లలేక మధ్యలో బడి మానేసే పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఐదు కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలలను మూసేస్తే వచ్చే వ్యతిరేకత ప్రభుత్వంపై ప్రభావం చూపుతుందని, దశల వారీగా మూయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత 250 మీటర్లలోపు, కొద్ది రోజుల వ్యవధిలో మూడు కిలోమీటర్లలోపు, ఆ తరువాత ఐదు కిలోమీటర్లలోపు ప్రాథమిక పాఠశాలలను ఎత్తివేయాలని ప్రయత్నిస్తోంది. పాఠశాలల విలీన వ్యవహారం బయటకు రాకుండా పాఠశాలల మ్యాపింగ్ చేయిస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారులతో మంగళవారం గుంటూరులో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నిర్వహించే సమావేశంలో విలీన పాఠశాలల వ్యవహారంపై తుదిరూపం రానుంది. పాఠశాలల విలీనంపై జిఒ విడుదలచేసే ముందు విద్యాశాఖాధికారుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. అమలుకు ఉన్న ఆటంకాలు, సమస్యలపై కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలిసింది. మూడు కిలోమీటర్లలోపు, మూడు కిలోమీటర్లపైడి, ఐదు కిలోమీటర్లలోపు ప్రాథమిక పాఠశాలల సమాచారం కూడా డైరెక్టరేట్ నుంచి అడిగినట్లు తెలిసింది. డైరెక్టర్ నిర్వహించిన సమావేశానికి ఈ తరహా సమాచారంతో వెళ్తున్నట్లు తెలిసింది.
0 Comments:
Post a Comment