✍ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు జీతాలు తగ్గించొచ్చు
♦ఉద్యోగులనుద్దేశించి హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
♦తగ్గించకూడదని ఎక్కడా లేదు.. అది యజమాని ఇష్టం
♦ఆదాయం, వ్యయాలు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది
♦జీతాలు తక్కువ ఇచ్చినా, ఎక్కువ ఇచ్చినా వాటి సర్దుబాటు పరిపాటి
♦ఎక్కువ జీతాలు ఇచ్చిన చోట రికవరీ చేస్తామంటే మీరెలా అభ్యంతరం చెబుతారు?
♦శాతాల ఆధారంగా కాదు.. వాస్తవ రూపంలో ఎంత పొందుతున్నారో లెక్క వేయాలి
♦సర్వీసు వివాదం కాబట్టి రోస్టర్ ప్రకారం తాము విచారించలేమన్న ధర్మాసనం
🌻సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు ఉద్యోగుల జీతభత్యాలు తగ్గించవచ్చని హైకోర్టు తెలిపింది. జీతాలు తగ్గించకూడదని ఎక్కడా లేదని, అది యజమాని (రాష్ట్ర ప్రభుత్వం) సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం ఆదాయాలు, బడ్జెట్ కేటాయింపులు తదితరాలను కూడా చూసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. జీతాలు తక్కువ ఇచ్చినా, ఎక్కువ ఇచ్చినా వాటి సర్దుబాటు పరిపాటి అని, ఎక్కువ జీతాలు ఇచ్చిన చోట రికవరీ చేస్తామని అంటే మీరెలా అభ్యంతరం చెబుతారని ఉద్యోగులను ప్రశ్నించింది.
♦శాతాల ఆధారంగా కాకుండా వాస్తవ రూపంలో (నగదు) ఎంత పొందుతున్నారో లెక్కలు వేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇది సర్వీసు వివాదమైనందున, రోస్టర్ ప్రకారం తాము విచారణ జరపడం సమంజసం కాదని చెప్పింది. సీజేను సంప్రదించి ఈ వ్యాజ్యాన్ని తగిన బెంచ్ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బి.శ్రీభానుమతి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త వేతన సవరణతో జారీ చేసిన జీవో 1పై ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణ్ణయ్య దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది.
♦కోర్టుకు కావాల్సింది వాస్తవ చెల్లింపులే..
పిటిషనర్ తరఫు న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపిస్తూ, అశుతోష్ మిశ్రా కమిషన్ (పీఆర్సీ) నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయలేదన్నారు. ఎక్కువ జీతాలు చెల్లించి ఉంటే రికవరీ చేస్తామని ప్రభుత్వం చెబుతోందన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే జీతాలు తగ్గించవచ్చునని చెప్పింది. కొత్త వేతన సవరణ వల్ల జీతం ఏ రకంగా తగ్గిందో చెప్పాలని కోరింది. మీరు శాతాల్లో తగ్గిందంటున్నారు. శాతం తగ్గినంత మాత్రాన మీ వాస్తవ చెల్లింపులు పెరిగి ఉంటే, తగ్గిందని ఎలా అంటారు? కోర్టుకు కావాల్సింది వాస్తవ చెల్లింపులు మాత్రమే.’ అని తేల్చి చెప్పింది.
సమ్మె పేరుతో బెదిరిస్తున్నారు
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఏమీ తక్కువ చేయలేదు. పీఆర్సీ నివేదికను కార్యదర్శుల కమిటీ అందరికీ అందుబాటులో ఉంచింది. ఉద్యోగ సంఘాలతో 9 సార్లు చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి సమక్షంలో ఓసారి జరిగాయి. సిఫారసులు ఎలా ఉండబోతున్నాయో ప్రతి ఉద్యోగ సంఘం నేతకూ తెలుసు. ప్రభుత్వం తన ఉద్యోగుల నుంచే సమ్మె బెదిరింపును ఎదుర్కొంటోంది. ప్రజలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేస్తామంటున్నారు. కోర్టు జోక్యాన్ని కోరారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంతో చర్చలు జరపలేరా? ప్రభుత్వం కూడా చర్చలకు ఆహ్వానించింది. చర్చలకు రావాలని స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే కోరారు. వారు చర్చలకు రాకుండా 3 గంటలకు సమ్మె నోటీసు ఇచ్చేందుకు వస్తామని చెబుతున్నారు’ అని వివరించారు.
రెవెన్యూ రూ.60 వేల కోట్లకే పరిమితం
‘ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 62కు పెంచాం. గ్రాట్యుటీ రూ.16 లక్షలకు పెంచాం. ప్లాట్ల కేటాయింపులో ఉద్యోగులకు 20 శాతం రిబేటు ఇచ్చాం. వీటన్నింటినీ ఓ ప్యాకేజీ కింద ఇచ్చాం. కొత్త పీఆర్సీ వల్ల ప్రభుత్వంపై రూ.10,825 కోట్ల భారం పడుతుంది. అయినా వారి కోసం భరిస్తున్నాం. అదీ కోవిడ్ పరిస్థితుల్లో. కోవిడ్ వల్ల ప్రభుత్వ ఆదాయం బాగా పడిపోయింది. 2018–19 సంవత్సరంలో రూ.62,473 కోట్లుగా ఉన్న ప్రభుత్వ రెవెన్యూ 2019–20కి రూ.60,933 కోట్లకు, 2020–21కి రూ.60,688 కోట్లకు పడిపోయింది. సాధారణ పరిస్థితుల్లో 15 శాతం వృద్ధితో రెవెన్యూ రూ.75 వేల కోట్లకు చేరాలి.
అందుకు భిన్నంగా రూ.60 వేల కోట్లకు పడిపోయింది. 2018–19లో జీతాల చెల్లింపులు రూ.52 వేల కోట్లుగా ఉంటే, 2021–22 నాటికి రూ.67 వేల కోట్లకు చేరింది. ఇవన్నీ ఉద్యోగులకు తెలుసు’ అని శ్రీరామ్ వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. 3 గంటలకు అంటున్నారు కాబట్టి, మధ్యాహ్నం 2.15కు మా ముందుకు రావాలని ఆ ప్రతినిధి బృందానికి చెప్పాలని అంది. ఆ బృందంలో కొందరు సీఎస్ వద్దకు వెళ్లొచ్చని, కొందరు వర్చువల్ విధానంలో మా ముందుకు రావాలని తెలిపింది. 12 మంది వచ్చినా కూడా అభ్యంతరం లేదంది. ఈ వ్యవహారాన్ని వివాదంగా చూడొద్దంది. ఇరుపక్షాల మధ్య ఇగో అవసరం లేదని ధర్మాసనం తెలిపింది.
సమయం వృథా చేసినందుకు క్షమించండి
భోజన విరామం తరువాత ధర్మాసనం స్పందిస్తూ, ‘మేం బెంచ్ దిగిపోయిన తరువాత మాకో సందేహం వచ్చింది. ఇది పిల్ కాదు. పునర్విభజన చట్ట వివాదం కూడా కాదు. సర్వీస్ వివాదం అవుతుంది. సర్వీసు వివాదంపై మా బెంచ్ ఎలా విచారిస్తుంది అన్న సందేహం వచ్చింది. దీనిపై రిజిస్ట్రీ నుంచి కూడా స్పష్టత కోరాం. ఈ వ్యాజ్యంపై రోస్టర్ ప్రకారం మేం విచారించడం సబబు కాదు. ఈ విషయం తెలియక సమయం వృథా చేశాం. ఇందుకు అందరూ క్షమించాలి’ అని కోరింది
ఈనాడు వార్త....
✍ పీఆర్సీ వ్యాజ్యం సీజే ముందుంచండి
♦హైకోర్టు రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశం
♦ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే జీతాలు తగ్గించొచ్చని వ్యాఖ్య
🌻ఈనాడు, అమరావతి: పీఆర్సీ అమలు ఉత్తర్వులను సవాలు చేస్తూ వేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టులో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యాజ్యంపై కాసేపు విచారణ జరిపిన ధర్మాసనం.. రోస్టర్ ప్రకారం అది తమ వద్దకు విచారణకు రాకూడదని, తగిన బెంచ్ వద్దకు వెళ్లాల్సిందని పేర్కొంది. ‘పిటిషన్లో అభ్యర్థన చూస్తుంటే ఓవైపు ఉద్యోగి సర్వీసు సంబంధ వ్యవహారంగా, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులందరి ప్రజాప్రయోజనంగా కనిపిస్తోంది. ఏపీ విభజన చట్టంతో ముడిపడి ఉందని భావించిన హైకోర్టు రిజిస్ట్రీ ఈ వ్యాజ్యాన్ని మా వద్దకు పంపి ఉంటారు. వాస్తవానికి విభజన చట్టం కారణంగా ప్రస్తుత సమస్య తలెత్తలేదు. రోస్టర్ ప్రకారం తగిన బెంచ్ ముందుకు వ్యాజ్యం విచారణకు వెళ్లేందుకు ఫైల్‌ను ప్రధాన న్యాయమూర్తి వద్ద ఉంచాల’ని రిజిస్ట్రీని ఆదేశించింది. జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బీఎస్ భానుమతితో కూడిన ధర్మాసనం సోమవారం ఈ ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 17న ఇచ్చిన పీఆర్సీ అమలు ఉత్తర్వులను సవాలుచేస్తూ ఏపీ గెజిటెడ్ అధికారుల ఐకాస ఛైర్మన్ కేవీ కృష్ణయ్య హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపించారు. ‘పీఆర్సీ ఉత్తర్వులతో ఉద్యోగుల జీతాల్లో కోతపడుతోంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి అశుతోష్ మిశ్ర కమిషన్ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయలేదు. ఆ నివేదికను పరిశీలించేందుకు కార్యదర్శులతో కమిటీ వేసింది. ఏ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని పీఆర్సీ నిర్ణయించారో తెలీదు. ఏపీ విభజన చట్టం సెక్షన్ 78(1) ప్రకారం హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చిన ఉద్యోగుల ప్రయోజనాలకు రక్షణ ఉంది. కొత్తగా ప్రకటించిన పీఆర్సీని 2018 జూన్ 1 నుంచి వర్తింపజేస్తున్నారు. డీఏను సర్దుబాటు చేస్తున్నామని చెబుతున్నారు. ఉద్యోగులకు అదనంగా జీతాలు చెల్లించి ఉంటే, వాటిని రాబట్టుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని జీవోలో స్పష్టంచేశారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు’ అన్నారు.
♦ఆ అధికారం ప్రభుత్వానికి ఉంది
ధర్మాసనం స్పందిస్తూ.. పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు తగ్గాయా? పెరిగాయా? చెప్పాలంది. ‘పీఆర్సీ కమిషన్ సిఫారసు మాత్రమే చేస్తుంది. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే. సర్దుబాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అదనంగా చెల్లించి ఉంటే రాబట్టుకోవచ్చు. తక్కువగా చెల్లించి ఉంటే ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. జీతం తగ్గితే ఉద్యోగి అభ్యంతరం చెప్పొచ్చు. మొత్తంగా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టలేరు’ అని పేర్కొంది. ‘ఆదాయ, వ్యయాలను చూసుకోవాల్సింది ప్రభుత్వమే. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే యజమానిగా జీతాలను తగ్గించొచ్చు’ అని వ్యాఖ్యానించింది.
♦సమ్మెకు వెళ్తామని బెదిరిస్తున్నారు: ఏజీ
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ‘ఉద్యోగల సంఘాల నేతలతో 9సార్లు చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రితో ఓసారి భేటీ అయ్యారు. యూనిట్ ఆధారంగా ఉద్యోగి జీతాల్లో రూ.28 వేలు పెరిగింది. 2018-19లో రాష్ట్ర ఆదాయం రూ.62వేల కోట్లు ఉంది. కొవిడ్ కారణంగా మూడేళ్లుగా ఆదాయం తగ్గింది. 2021కి ఆదాయం రూ.75వేల కోట్లకు చేరాల్సింది, రూ.60 వేల కోట్లకే పరిమితమైంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలే రూ.67వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర నిధుల్లోంచి లేదా అప్పులు చేసి అమలు చేయాల్సి వస్తోంది. ప్రస్తుత పీఆర్సీతో రూ.10,865 కోట్ల భారం పడుతుంది. ఈనెల పే స్లిప్పులు సిద్ధం చేస్తేనే కదా.. పీఆర్సీ అనుకూలంగా ఉందో, లేదో తెలిసేది. ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళ్తామని బెదిరిస్తున్నాయి. 12 మంది ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించింది. వారేమో మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీసు ఇస్తామంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చట్టవిరుద్ధమని సుప్రీం చెప్పింది’ అని వాదించారు.
♦ధర్మాసనం స్పందిస్తూ.. మధ్యాహ్నం 2.15కు జరిగే వీడియో కాన్ఫరెన్స్ విచారణకు 12 మంది ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పాటు, పిటిషనర్ హాజరయ్యేలా చూడాలని సూచించింది. భోజన విరామం తర్వాత 2.15కు ప్రారంభమైన విచారణలో ఉద్యోగ సంఘాల నేతలపై ప్రశ్నించగా, వారు రాలేదని తెలపడంతో ‘తక్కువ సమయంలో హాజరుకాలేకపోయి ఉంటార’ని వ్యాఖ్యానించింది. ఈ వ్యాజ్యం తమ వద్దకు రావడంపై హైకోర్టు రిజిస్ట్రీని స్పష్టత కోరామని తెలిపింది. రోస్టర్ ప్రకారం తాము విచారించడం సరికాదని పేర్కొంటూ ఫైల్‌ను సీజే ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
0 Comments:
Post a Comment