మేఘాల్లో తేలిపోవాలనుకుంటున్నారా?: ఛలో విశాఖ ఏజెన్సీ: కట్టిపడేస్తోన్న ప్రకృతి సోయగాలు
చలికాలం.. ప్రకృతి సోయగాలకు నిలయం. మరే కాలంలోనూ కనిపించని ప్రకృతి అందాలు ఒక్క శీతాకాలంలోనే కనువిందు చేస్తుంటాయి. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను అందిస్తుంటాయి.
దట్టంగా అలముకునే పొగమంచు, మన చుట్టూ, చేతికి అందేంత ఎత్తులో తేలియాడే మేఘాలు.. చలికాలంలో మాత్రమే సాధ్యం. ప్రకృతి మధ్యలో నిల్చుంటే- దాని మజానే వేరు. వెన్నులో వణుకుపుట్టించేంతటి చలిని తట్టుకోవడానికి అవసరమైన దుస్తులను ధరించగలిగితేనే అందాలను ఆస్వాదించగలుగుతాం.
స్వర్గంలా మారిన ఏజెన్సీ..
సూర్యుడి లేలేత కిరాణాల వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ- మేఘాల మధ్య తిరుగాడటానికి ఏ పశ్చిమ కనుమలకో.. లేదా ఊటికో వెళ్లనక్కర్లేదు. మన విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతం చాలు. మన రాష్ట్రంలో విస్తరించిన తూర్పు కనుమలు సరికొత్త అందాలను పుణికిపుచ్చుకున్నాయి. ఏజెన్సీ స్వర్గధామంలా మారింది. ఇదివరకెప్పుడూ లేనంతగా కనిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రత రికార్డవుతోంది. ఫలితంగా- దట్టమైన మేఘాలు విశాఖ ఏజెన్సీ పర్వత పంక్తులను ఆవరించుకున్నాయి.
అరకు, లంబసింగికి తోడుగా..
ఇదివరకు విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం మొదట గుర్తుకొచ్చేది అరకులోయ. అరకును సందర్శించడానికి పర్యాటలకు పోటెత్తే వారు. క్రమంగా అక్కడి అందాలు కనుమరుగవుతున్నాయి. పట్టణీకరణ పెరిగింది. ఫలితంగా- ఇదివరకటి రోజులతో పోల్చుకుంటే.. అరకు కొంత సహజ స్వరూపాన్ని కోల్పోయినట్టే కనిపిస్తోంది. అదే సమయంలో లంబసింగి వెలుగులోకి వచ్చింది. ఏపీలో అత్యంత కనిష్ఠ స్థాయి ఉష్ణోగ్రత నమోదయ్యేది ఇక్కడే. అయిదారేళ్లుగా చలికాలంలో లంబసింగిలో పర్యటకుల తాకిడి పెరిగింది.
వంజంగి హిల్ స్టేషన్..
ఇప్పుడు మరో కొత్త హిల్ స్టేషన్ పేరు మారుమోగుతోంది. అదే- వంజంగి. లంబసింగి-అరకులోయ మధ్యలో ఉంటుందీ కొత్త పర్యాటక ప్రాంతం. పాడేరుకు సమీపంలో ఉంటుంది. మండల కేంద్రం పాడేరు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం. విశాఖపట్నం నుంచి వంజంగి సరిగ్గా వంద కిలోమీటర్ల దూరంలోఉంది. కార్లు, బైక్స్ ద్వారా రాకపోకలు సాగించడానికి రోడ్డు అనువుగా ఉంటుంది. విశాఖ నుంచి మూడు గంటల్లో వంజంగికి చేరుకోవచ్చు. పాడేరుకు సమీపించిన తరువాత పొగమంచు వల్ల రోడ్డు సరిగ్గా కనిపించదు.
3,400 మీటర్ల ఎత్తులో..
సముద్రమట్టం నుంచి 3,400 మీటర్ల ఎత్తులో ఉంటుందీ వంజంగి హిల్ స్టేషన్. సాధారణంగా హిల్ స్టేషన్స్లల్లో ఒకటి లేదా రెండు వ్యూ పాయింట్లు ఉంటుంటాయి. వంజంగిలో మాత్రం అయిదు పైగా వ్యూపాయింట్స్ ఉన్నాయి. వంజంగి వ్యూ పాయింట్, వంజంగి క్లౌడ్ హిల్ టాప్, వంజంగి సన్ వ్యూ, కొత్త వలస వ్యూపాయింట్, ట్రెక్కర్స్ వ్యూ పాయింట్స్ ద్వారా- అక్కడి అందాలను చూడొచ్చు. క్లౌడ్స్ ఆఫ్ ఓషన్గా పిలుస్తుంటారు పర్యాటకులు.
అరకు-లంబసింగి-వంజంగి టూరిస్ట్ సర్క్యూట్
అరకులోయ నుంచి లంబసింగి మధ్య దూరం సుమారు 90 కిలోమీటర్లు. పాడేరు మీదుగా ఈ రోడ్డు సాగుతుంది. అదే పాడేరుకు ఆర కిలోమీటర్ల దూరంలో ఉండే వంజంగిని కలుపుకొని టూరిస్ట్ సర్కుట్గా రూపొందించడానికి ఏపీ పర్యాటక మంత్రిత్వ శాఖ సన్నాహాలు పూర్తి చేసింది. లంబసింగి నుంచి 47, అరకు నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ వంజింగి. అందుకే ఈ మూడు ఒకే మార్గంలో ఉండటం వల్ల దీన్ని టూరిస్ట్ సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తోంది
0 Comments:
Post a Comment