Tea adulteration: ఆగని కల్తీ టీ పౌడర్ మాఫియా ఆరాచకాలు.. పోలీసుల దాడుల్లో సంచలన విషయాలు..
Tea adulteration: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రోజు రోజుకూ కల్తీ రాయుళ్ల ఆగడాలకు అదుపులేకుండా పోతోంది.
తాజాగా తూర్పు గోదావరి జిల్లా (East Godavari District)లో నకిలీ టీ పొడి అడ్డూ అదుపులేకుండా విస్తరిస్తోంది. ఒకప్పుడు అనపర్తి కేంద్రంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముఠాలు దొంగ టీ పొడి తయారీతో కోట్లు సంపాదించాయి. ఆ తర్వాత పట్టుబడ్డంతో తయారీ నిలిచిపోయింది. మళ్లీ ఈ లోపు అవే ముఠాలు స్థావరం మార్చి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి. దీనికి నిదర్శనమే బిక్కవోలు కేంద్రంగా బుధవారం వెలుగులోకి వచ్చిన భారీ నకిలీ టీ పొడి తయారీ ముఠా వ్యవహారం.
తమిళనాడు (Tamilnadu) నుంచి వచ్చిన ఓ ముఠా బిక్కవోలు మండలం ఎస్ఆర్ పేటలోని ఓ రైసుమిల్లును లీజుకు తీసుకుని రెండేళ్లుగా పెద్ద ఎత్తున నకిలీ టీ పొడి తయారు చేస్తోంది. ఎర్రమట్టి, జీడిపిక్కల తొక్కలు వివిధ ప్రాంతాల నుంచి తమ మనుషుల ద్వారా సేకరించి ఇక్కడకు తరలిస్తున్నారు. ఈ మిశ్రమానికి నిర్మా వాషింగ్ పౌడర్ (Nirma Washing Powder) కలిపి టీపొడి సిద్ధం చేస్తున్నారు. ఇందుకు అవసరమయ్యే యంత్రాలు సైతం ఇక్కడ మిల్లులో బిగించారు. ఇలా తయారుచేసిన టీ పొడికి రంగు, వాసన వచ్చేలా రసాయనాలు కలిపి తమ మనుషుల ద్వారా ప్యాకింగ్‌లు చేయిస్తున్నారు.
అలా ప్యాక్ చేసిన వాటిని కిలో రూ.250 చొప్పున డీలర్ల ద్వారా ఏజెన్సీ సహా జిల్లా నలుమూలలకు తరలిస్తున్నారు. తీరా ఈ డీలర్లు మండల కేంద్రాల్లోని స్థానిక వ్యాపారులకు కమీషన్‌పై విక్రయిస్తున్నారు. అక్కడి నుంచి వీళ్లు పట్టణాలు, గ్రామాలకు మోపెడ్, సైకిళ్లు, ఇతర వాహనాలపై వెళ్లి టీ బడ్డీలు, చిన్న హోటళ్లు, బస్టాండ్లు, సినిమాహాళ్లు, రైల్వేస్టేషన్ పరిసరాలు, ఆలయాలు, ఇతర రద్దీ ప్రదేశాల్లోని దుకాణాలకు సరఫరా చేస్తున్నారు.
వాస్తవానికి ప్రముఖ కంపెనీలకు చెందిన టీ పొడి కొని టీ అమ్మితే దుకాణదారులకు లాభం రాదు. ఉదాహరణకు కిలో త్రీ రోజెస్ టీ పొడి మార్కెట్లో 630, రెడ్‌లేబుల్ 570 వరకు పలుకుతోంది. చిన్న దుకాణాలు ఇవి కొనలేవు. దీంతో సగం ధరకే వచ్చే నకిలీ టీపొడిని కొనుగోలు చేస్తున్నారు. వాస్తవానికి ఇటువంటి నకిలీ టీపొడితో తయారైన టీ తాగితే దీర్ఘకాలంలో కిడ్నీవ్యాధులు, పేగు క్యాన్సర్, జీర్ణ వ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వాస్తవానికి మార్కెట్లో ఏదైనా వస్తువు విక్రయిస్తే ఎక్కడ తయారైంది? ఎప్పుడు తయారుచేశారు? అందులో ఏం కలిపారు? ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ధర ఎంత? అనుమతులు ఉన్నాయా? సమస్యలు, ఫిర్యాదులు ఉంటే ఫోన్ చేయాల్సిన నెంబర్? తదితర వివరాలను ప్యాకెట్‌పై ముద్రించాలి. కానీ ఈ నకిలీ టీ పొడిపై అదేం ఉండదు. అయినా అధికారులు పట్టించుకోరనే ధీమాతో బిక్కవోలులో పాగా వేసిన ముఠాలు రెండేళ్ల నుంచీ దొంగ పొడి విక్రయాలతో కోట్లు సంపాదించాయి.
ఎలాగూ లాభం వస్తుండడంతో సదరు వ్యాపారులు లైన్‌కు వీటిని తీసుకువెళ్లి పరిచయాల ద్వారా విక్రయిస్తున్నారు. ఇలా జిల్లాతోపాటు రాష్ట్రం, ఇతర రాష్ట్రాలకూ ఈ నకిలీ టీపొడి గడచిన కొన్నేళుగా గుట్టుచప్పుడు కాకుండా తరలిపోతోం ది. పట్టుబడ్డ ముఠాలను అధికారులు విచారిస్తే విశాఖ, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, ఒడిషా, తమిళనాడు, బీహార్ వరకు ఈ టీపొడి విక్రయిస్తున్నట్టు తేలింది.
అటు టీ కొట్లు సైతం అయిదు రూపాయలకు విక్రయించే టీకి ప్రముఖ బ్రాండ్ల పొడి అయితే ఏం మిగలదనే ఉద్దేశం తో 200 నుంచి 220కి వచ్చే నకిలీ పొడి కొంటున్నారు. ప్రమాదకరమని తెలిసినా కొందరు, రంగు, వాసనతో అనుమానం రాకపోవడంతో ఈ నకిలీ పొడితో టీ విక్రయిస్తూ జనం ప్రాణాలతో ఆటాడుకుంటున్నారు.
0 Comments:
Post a Comment