📚✍ఉద్యోగుల ఆశలపై సర్కారు నీళ్లు
♦కొలిక్కిరాని ఫిట్మెంట్ వ్యవహారం
♦అధికారులతో సీఎం జగన్ సమావేశం
♦ప్రకటనకు మరికొంత సమయం పట్టొచ్చు.
♦నివేదికలో చిన్న సవరణలు చేస్తున్నారు
♦త్వరలో ఉద్యోగ సంఘాలతో సీఎం చర్చలు
♦ఉన్నంతలో మెరుగైన పీఆర్సీ: సజ్జల
♦సాగదీత వైఖరిపై ఉద్యోగుల ఆగ్రహం
🌻అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర కానుకగా అయినా ప్రభుత్వం పీఆర్సీ ప్రకటిస్తుందని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 లక్షల మంది ఉద్యోగులు ఎదురు చూశారు. అయితే.. మరోసారి వారి ఆశలు అడియాశలే అయ్యాయి. పీఆర్సీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆర్థిక శాఖ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అయినా ఫిట్‌మెంట్‌పై స్పష్టత వస్తుందని ఉద్యోగులు ఆశించారు. సర్కార్ మరోసారి వారి ఆశలపై నీళ్లు చల్లింది. సీఎంతో సమావేశం అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పీఆర్సీ ప్రకటనకు మరికొంత సమయం పట్టవచ్చని చెప్పారు. పీఆర్సీపై కసరత్తు కొనసాగుతోందన్నారు. గతంలో ఇచ్చిన పీఆర్సీ నివేదికలో చిన్నపాటి సవరణలు చేస్తున్నారని తెలిపారు. ‘‘అధికారులు ఇటీవల సీఎంకు నివేదిక అందించారు. ఉద్యోగులకు ఇప్పుడున్న వేతనం కంటే పెంపుదల తప్పకుండా ఉంటుంది. పీఆర్సీ వల్ల భవిష్యత్తులోనూ సమస్యలు రాకూడదనే సీఎం ఆలోచన. సీఎంకు బాధ్యత ఉంది కాబట్టే పీఆర్సీపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. త్వరలో ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ చర్చలు ఉంటాయి. బుధవారం నుంచి పీఆర్సీ ప్రక్రియ మరింత ముందుకు పోతుంది. కరోనా ప్రభావం వల్ల రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి. పీఆర్సీ వల్ల బడ్జెట్‌పై ఎంత ప్రభావం పడుతుందనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సి వస్తోంది. దీనివల్లే పీఆర్సీ ప్రకటన ప్రక్రియ కొంత ఆలస్యమవుతోంది. ఉద్యోగులు అసంతృప్తికిలోను కాకూడదన్నదే సీఎం జగన్ ఉద్దేశం. ఉన్నంతలో మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు మళ్లీ పీఆర్సీపై కసరత్తు చేస్తూ వస్తున్నాం. ఉద్యోగులకు మంచి ఫిట్మెంట్ ఇచ్చేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగులకు ఫిట్మెంట్ పెంచడమే లక్ష్యంగా కసరత్తు జరుగుతోంది. వీలైనంత త్వరగా ఫిట్‌మెంట్‌ను సీఎం జగన్ నిర్ణయిస్తారు. కావాలని పీఆర్సీ జాప్యం చేయడం లేదు’’ అని సజ్జల చెప్పారు.
♦సాగదీత కార్యక్రమమేమో?: ఉద్యోగులు
పీఆర్సీపై ప్రభుత్వం మరోసారి తేల్చకపోవడంతో ఉద్యోగులు మండిపడుతున్నారు. మార్చి దాకా సాగదీసే ఆలోచనలో ప్రభుత్వం ఉందనే అనుమానాలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. కమిటీలు, చర్చల పేరుతో కాలయాపన చేయడం తప్ప ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదని వాపోతున్నారు. గతంలో ఎప్పుడూ ఈ విధంగా పీఆర్సీ కోసం ఎదురు చూసిన దాఖలాలు లేవని, ఇన్నిసార్లు వాయిదా వేసిన సంఘటనలు లేవని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం పీఆర్సీపై స్పష్టత ఇవ్వకుండా చర్చలు, సమావేశాలు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అంటూ వాయిదాల పర్వం కొనసాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
♦వాణిజ్య శాఖలో సమస్యలు పరిష్కరించండి
💥బుగ్గనకు నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం వినతి
🌻వాణిజ్య పన్నుల శాఖలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ఏపీ వాణిజ్య పన్నుల శాఖ నాన్గెజిడెడ్ ఉద్యోగుల సంఘం విన్నవించింది. మంగళవారం మంత్రిని కలసి వినతిపత్రం అందజేసినట్టు అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ చెప్పారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఏసీటీవోను గెజిటెడ్ చేయాలని, రద్దయిన చెక్‌పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను సర్కిల్ ఆఫీసులకు మార్చాలని కోరామన్నారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీని నియమించి పెండింగ్‌లో ఉన్న ఏసీబీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, వీటితో పాటు బదిలీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరామని చెప్పారు. ఈ సమావేశంలో సంఘం జనరల్ సెక్రటరీ రమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment