సెంటు లేదు పొలం... రూ.కోటి లాభం!
ఆదర్శం... దివ్యాంగ రైతు మునీర్ వ్యవసాయం
30 ఎకరాల కౌలు భూమిలో టమాటా సాగు
సెంటు లేదు పొలం... రూ.కోటి లాభం!
మునీర్ దివ్యాంగుడు... వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం... పైగా సేంద్రియ విధానంపై ఎంతో నమ్మకం... తనకు ఒక్క సెంటు సొంత పొలం లేదు... అయితేనేం కౌలుకు తీసుకుని... టమాటా సాగు చేస్తూ కళ్లు చెదిరే లాభాలను గడిస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
మునీర్ దివ్యాంగుడు... వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం... పైగా సేంద్రియ విధానంపై ఎంతో నమ్మకం... తనకు ఒక్క సెంటు సొంత పొలం లేదు... అయితేనేం కౌలుకు తీసుకుని... టమాటా సాగు చేస్తూ కళ్లు చెదిరే లాభాలను గడిస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
బొగ్గు మునీర్.. చిత్తూరు జిల్లా ములకలచెరువు గ్రామ వాసి. సోంపల్లె పంచాయతీ గూడుపల్లె క్రాస్‌లో ఏడాదికి ఎకరానికి రూ.20 వేల చొప్పున 30 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. ఐదేళ్లుగా టమాటా, దోస సాగు చేస్తున్నారు. సేంద్రియ ఎరువులు (కోళ్ల ఎరువు, ఆర్గానిక్) వాడటంతో పంట ఆరడుగులు ఎత్తు పెరగడంతో పాటు అత్యధిక దిగుబడి ఇస్తోంది. పండించిన సరకును మార్కెట్ కంటే అత్యధిక ధరకు విక్రయిస్తున్నారు. కాయ నాణ్యత చూసి వ్యాపారులు పొలంలోనే కొనుగోలు చేయడం విశేషం.
మునీర్ పండించిన టమాటాలు 10 రోజులకు పైగా నిల్వ ఉంటున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు... కోల్‌కతా, ఛత్తీస్‌గఢ్, అండమాన్ నికోబార్ దీవులకు ఎగుమతి చేస్తున్నారు. ఇటీవల వర్షాలు కురిసినప్పుడు పొలంలో వరద నీరు నిలవ ఉండకుండా ఎప్పటికప్పుడు కాలువలు తీసి బయటకు పంపించారు. 30 కిలోల బాక్సు ధర రూ.1,000 నుంచి రూ.2,500 వరకు పలికింది. ఈ ఏడాది కౌలు సహా... సాగుకు రూ.50 లక్షలు ఖర్చు చేస్తే రూ.1.50 కోట్ల ఆదాయం వచ్చింది. నిత్యం సుమారు 50 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వారందరికీ భోజనంతో పాటు అన్ని సౌకర్యాలనూ కల్పిస్తున్నారు. ఇతర రైతులు సాగు చేసిన పంటకు ఊజీ తెగుళ్లు, కాయ పగుళ్లు వచ్చినా మునీర్ పంటకు ఎలాంటి సమస్యా తలెత్తకపోవడం విశేషం. పొలాన్ని బాగా దుక్కిదున్ని సేంద్రియ ఎరువులు వాడి, తెగుళ్లు సోకకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకునేసరికి... అత్యధిక దిగుబడి వచ్చిందని, నాణ్యత ఎక్కువగా ఉండటంతో అధిక ధర పలుకుతోందని మునీర్ చెప్పారు.
0 Comments:
Post a Comment