బూరుగ చెట్టు మన ప్రాంతాల్లో సన్నగా ఎత్తుగా పెరుగుతుంది. దాని కాయల్లోని పట్టు లాంటి దూదిని వాడుకోవటం తప్ప మనం ఈ చెట్టుని అంతగా పట్టించుకోవటం లేదు.
సంస్కృతంలో దీన్ని శాల్మలీ, మోచ అని పిలుస్తారు. ఈ చెట్టు కాండం నుంచి తుమ్మజిగురు లాంటి బంక స్రవిస్తుంది దీన్ని 'మోచరసం' అని పిలుస్తారు. స్త్రీలవ్యాధులపై ఈ మోచరసం గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. బూరుగ పూలు తెల్లగా, ఎర్రగా రెండు రకాలుగా ఉంటాయి. తెల్లపూలు, ముళ్లతో కూడిన తెల్లటి మాను ఉన్న బూరుగ చెట్లు శ్రేష్టమైనవని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. పట్టణాల్లో తక్కువగా కనిపించినా, పల్లెల్లో బూరుగ చెట్లను పెరట్లో పెంచుకునే అలవాటు ఇంకా కొనసాగుతోంది.
దీని ఆకులు గానీ, పూలుగానీ వండుకు తినేందుకు వీలుగా రుచికరంగా ఉంటాయి. శీతల అంటే చలవ నిచ్చే గుణం వీటికుంది, శుక్ర వర్థకం! పురుషుల్లో జీవకణాలను పెంచుతుంది. వీరేచనాల నాపుతుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. బృంహణం అంటే పోషకవిలువలు అధికంగా కలిగి శక్తినీ, ఇమ్యూనిటీనీ పెంచుతుంది. ఉబ్బరాన్ని, గ్యాసుని తగ్గిస్తుంది. యవ్వన కాలంలో వచ్చే మొటిమల్ని తగ్గించే గుణం వీటికుంది. అరికాళ్లు, అరిచేతుల్లో మంటలు తగ్గుతాయి. టీబీ లాంటి క్షీణింపచేసే వ్యాధుల్లో ఇది ఔషధం. కరోనాకాలంలో తరచూ బూరుగను ఆహార పదార్థంగా తీసుకుంటూ ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. బీపీని తగ్గిస్తుంది.
బూరుగ చెట్టు ఆకులూ పూలతో కూరని వండుకునే విధానం గురించి నలుడు ఇలా వివరించాడు.
లేత బూరుగ ఆకుల్ని, పూలనీ సేకరించుకుని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. వగరు చేదు రుచులు కలిగిన కూరగాయల్ని వండుకున్నట్టే వీటినీ వండుకోవాలి. నలమహారాజు నేరేడు గుజ్జుతో కలిపి బూరుగ ఆకుల్ని లేదా పూలనీ వండుకోమన్నాడు. అన్ని కాలాల్లోనూ నేరేడుపండ్లు దొరకవు కాబట్టి, చింతచిగురు, చుక్కకూర, మామిడి కాయలాంటి పులుపు ద్రవ్యాలతో బూరుగ ఆకులు, పూలు రెండింటీనీ కలిపి వండుకోవచ్చు.
సన్నగా తరిగిన బూరుగ ఆకులు, పూలను, పులుపు ద్రవ్యాన్ని భాండీలో నెయ్యివేసి అందులో ఉంచి కొద్దిసేపు మగ్గనివ్వాలి. నీళ్లపళ్లెం పెట్టి మగ్గపెడితే మెత్తగా దగ్గరగా వస్తుంది. ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా కొబ్బరి కలిపి వేయించి దంచిన పొడిని కలిపి మరికొద్ది సేపు వేగనిస్తే బూరుగాకుల కూర సిద్ధం అయినట్టే! తగినంత ఉప్పుకారాలు, కమ్మదనం కోసం మీకిష్టమైన జీడిపప్పు లాంటి ద్రవ్యాలను చేర్చుకోవచ్చు.
0 Comments:
Post a Comment