ఇవి పాటిస్తే ఒమిక్రాన్ దూరం
పలు సూచనలు చేసిన డబ్ల్యూహెచ్‌వో, భారత ఆరోగ్యశాఖ
ఇవి పాటిస్తే ఒమిక్రాన్ దూరం
దిల్లీ, మనీలా: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అందరినోటా వినిపిస్తున్న పదం... ఒమిక్రాన్! కొవిడ్ రెండో ఉద్ధృతికి కారణమైన డెల్టా కంటే ఇది ఆరు రెట్లు వేగంగా వ్యాపిస్తోంది. రోజుల వ్యవధిలోనే 36 దేశాలకు విస్తరించిన ఈ వేరియంట్... ఎంత తీవ్రంగా ఉంటుంది? వ్యాక్సిన్ల వల్ల కలిగే రోగనిరోధక శక్తిని కూడా తప్పించుకోగలదా? అన్నది ఇంకా పూర్తిగా తెలియదు. కానీ, ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందన్నది మాత్రం విస్పష్టం. దీని బారినుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు డబ్ల్యూహెచ్‌వో శుక్రవారం పలు సూచనలు చేసింది. భారత వైద్య, ఆరోగ్యశాఖ కూడా ప్రజలు కొత్త వేరియంట్ విషయమై తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.
డబ్ల్యూహెచ్‌వో ఏం చెప్పింది?
* సరిహద్దులను మూసేయడం, విమానాలను నిలిపివేయడం వల్ల ఒమిగ్రాన్ వ్యాప్తి ఆలస్యమవుతుంది. అయితే, ఈ వేరియంట్ కారణంగా ఎదురయ్యే ఉద్ధృతిని ఎదుర్కోవడానికి ప్రతి దేశం సిద్ధపడాల్సిందే.
* ప్రజలు మాస్కులు ధరించాలి. ఇతరులకు దూరం పాటించాలి. అర్హులంతా టీకాలు తీసుకోవాలి. కొవిడ్ ఆంక్షలకు అనుగుణంగా మసలుకోవాలి.
* ప్రభుత్వాలు ఆరోగ్య, వైద్య వ్యవస్థలను బలోపేతం చేయాలి. లోపాలను సరిదిద్దుకోవాలి. ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి బాధితులకు సరైన చోట, సరైన వైద్యం అందించాలి. ఐసీయూ పడకలను సిద్ధంగా ఉంచుకోవాలి.
* ‘‘ఏడు వారాలుగా పలు దేశాల్లో కొవిడ్ కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. వీటిలో చాలామటుకు డెల్టా కారణంగా సంభవిస్తున్నవే.
ఒమిక్రాన్ వెలుగుచూసిన క్రమంలో కొద్ది రోజుల్లోనే ఈ ఉద్ధృతి మరింత పెరగవచ్చు. ప్రజలు, వ్యవస్థలు, ప్రభుత్వాలు తప్పనిసరిగా అప్రమత్తం కావాల్సిన తరుణమిది. డెల్టా నియంత్రణకు పాటించిన నియమాలు ఒమిక్రాన్ వ్యాప్తినీ సమర్థంగా అడ్డుకోగలవు’’ అని డబ్ల్యూహెచ్‌వో పశ్చిమ పసిఫిక్ ప్రాంత డైరెక్టర్ డా.టకెషి కాసాయ్ పేర్కొన్నారు.
భారత ప్రభుత్వం ఏమంది?
* ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్ టీకాలు ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా పనిచేయవని చెప్పేందుకు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలూ లేవు. ఉత్పరివర్తనాల కారణంగా కొత్త వేరియంట్లు శక్తిమంతంగా ఉంటాయి. కాబట్టి, ప్రస్తుత వ్యాక్సిన్లకు వీటిని ఎదుర్కొనే సామర్థ్యం తక్కువగా ఉండొచ్చు.
* టీకా తీసుకుంటే... ఒమిక్రాన్ కారణంగా తీవ్ర అనారోగ్యం వాటిల్లే పరిస్థితి ఉండదు. కొత్త వేరియంట్ తీరును పరిశీలిస్తే... భారత్ సహా అనేక దేశాల్లో ఇది తీవ్రంగా వ్యాపించే ముప్పు ఉంది.
* కానీ, ఎన్ని కేసులు నమోదవుతాయి? కొత్త వేరియంట్ ఎంత తీవ్రమైన అనారోగ్యం కలిగిస్తుంది? అన్న విషయాలు మాత్రం ప్రస్తుతానికి తెలియవు.
* డెల్టా వేరియంట్ కారణంగా ఇప్పటికే లక్షల మందికి కొవిడ్ సోకడం, టీకా కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టడం వల్ల కొత్త వేరియంట్ తీవ్రత తక్కువగానే ఉండొచ్చు. కానీ, ఇందుకు సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.
* ఇంతవరకూ తీసుకుంటున్న కరోనా జాగ్రత్తలనే ఇక ముందూ మరింత కఠినంగా పాటించాలి.
0 Comments:
Post a Comment