Call center for Nadu - Nedu schools
నాడు-నేడు పాఠశాలలకు కాల్‌సెంటర్
కమాండ్ కంట్రోల్‌రూం పనితీరును తెలుసుకుంటున్న ప్రిన్సిపల్ సెక్రటరీ
రాజశేఖర్, కమిషనర్ సురేష్, ఆర్జేడీ సుబ్బారావు, డీఈఓ గంగాభవాని తదితరులు
ఈనాడు-అమరావతి: జిల్లాలో వెయ్యికు పైగా పాఠశాలలను నాడు-నేడు రెండోవిడతలో అభివృద్ధి చేయనున్నారు.
వాటి పురోగతిని ఎప్పటికప్పుడు గుంటూరులోని సమగ్రశిక్ష కార్యాలయంలో కూర్చొని వీక్షించేలా జిల్లా సమగ్రశిక్ష అధికారులు అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కమాండ్ కంట్రోల్ రూంను అభివృద్ధి చేశారు. శుక్రవారం దాన్ని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ప్రారంభించారు. ప్రతి పాఠశాల నాణ్యత ఎలా ఉందో ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్రూంలోనే ఉండి తెలుసుకునేలా మంచి ఆలోచన చేశారని జిల్లా పథక సంచాలకులు మేకతోటి వెంకటప్పయ్యను అభినందించారు. వెబెక్స్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేశామని ఆయన ముఖ్యకార్యదర్శికి చెప్పారు. నాడు-నేడు నిర్మాణాలతో పాటు ఆక్వాగార్డులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో ఈ కమాండ్ కంట్రోల్ గదికి తెలియజేయొచ్చన్నారు. దీన్ని కాల్‌సెంటర్‌గా కూడా వినియోగించుకునేలా తీర్చిదిద్దారు. మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలల్లో 448కు మంచినీటి ఆర్వో ప్లాంట్లు అమర్చామని, వాటి వినియోగంపై కొందరు ఉపాధ్యాయులకు అవగాహన లేమి కారణంగా తరచూ సాంకేతిక సమస్యలు వస్తున్నాయని వాటిని పరిష్కరించటానికి మెకానిక్‌లు క్షేత్రస్థాయికి వెళ్లనవసరం లేకుండా ఈ కమాండ్ కంట్రోల్ రూం నుంచే సమస్యను పరిష్కరించేలా పది కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. నాడు-నేడు మొదటి విడతలోనే ప్రతి జిల్లాలో పనులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోవటానికి కమాండ్ కంట్రోల్‌రూంలు, కాల్‌సెంటర్లు ప్రారంభించాలని ఆదేశించారని అందులో భాగంగానే ప్రస్తుతం దీన్ని జిల్లాలో ఏర్పాటు చేసినట్లు జిల్లా సమగ్రశిక్ష అధికారులు ఉన్నతాధికారులకు తెలియజేశారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకురాలు వెట్రిసెల్వీ, ఆర్జేడీ సుబ్బారావు, డీఈఓ గంగాభవానీ తదితరులు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment