✍అమ్మఒడికి హాజరు కష్టాలు
🌻ఈనాడు, అమరావతి
కృష్ణా జిల్లాలోని విద్యార్థుల్లో ఈసారి ఎంతమందికి అమ్మఒడి పథకం కింద డబ్బులు వస్తాయో తెలియని అయోమయం నెలకొంది. ఈ ఏడాదికి సంబంధించి విద్యార్థుల దరఖాస్తుల నమోదు ఇప్పటికే పూర్తయింది. జూన్లో అమ్మఒడి డబ్బులు ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. ప్రభుత్వం 75శాతం హాజరు తప్పనిసరి చేయడంతో.. ఎంతమంది విద్యార్థులకు ఈసారి పథకం లబ్ధి చేకూరుతుందో చెప్పలేని అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు పాఠశాలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను అటెండెన్స్ యాప్లో నమోదు చేస్తున్నారు. కొవిడ్ ప్రభావం వల్ల ఇప్పటికీ..చాలా ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య అరకొరగానే ఉంటోంది.
అమ్మఒడి కోసం ప్రైవేటు పాఠశాలల్లో హాజరు నమోదు ఓ ప్రహసనంగా మారిపోయింది. కొన్ని పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తూనే ఉన్నారు. సగం మంది పిల్లలు పాఠశాలలకు వస్తుండగా.. మిగతా వారికోసం ఆన్లైన్లో తరగతులు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో నేరుగా పాఠశాలలకు వచ్చే పిల్లలకు మాత్రమే చాలా ప్రైవేటు పాఠశాలలు హాజరు వేస్తూ వచ్చాయి. ప్రతిరోజు పిల్లల హాజరును స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో నమోదు చేయడం.. పాఠశాలలకు తలనొప్పిగా మారిపోయింది. ప్రత్యేకంగా దీనికోసమే సిబ్బందిని నియమించి.. ఏ విద్యార్థి వచ్చారు, ఎవరు రాలేదనే వివరాలను యాప్లో నమోదు చేయిస్తున్నారు. ఒక్కోసారి యాప్లో సాంకేతిక సమస్యలు ఎదురవుతుండడంతో, నమోదు చేయడం కుదరడం లేదని నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఇలా ప్రతి నెలలో కనీసం నాలుగైదు రోజులు సమస్య ఉంటోందన్నారు. ఈ నేపథ్యంలో 75శాతం హాజరు నమోదు అనేది చాలామంది విద్యార్థులకు ఈసారి కష్టంగానే మారబోతోందన్నారు.
♦మూడో ముప్పు నేపథ్యంలో..
తాజాగా మరోసారి కొవిడ్ మూడో ముప్పు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో విద్యార్థులు మరింత తగ్గుతున్నారు. తల్లిదండ్రుల్లోనే ఆందోళన నెలకొంటోంది. కొవిడ్ కేసులు కూడా క్రమంగా పెరుగుతుండడంతో విద్యార్థులను ఈ రెండు నెలలు ఇళ్ల వద్దే ఉంచుతామంటూ చాలామంది తల్లిదండ్రులు పాఠశాలల యాజమాన్యాలను కోరుతున్నారు. ఫిబ్రవరిలో కొవిడ్ మూడో దశ ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో.. మళ్లీ పూర్తిస్థాయిలో ఆన్లైన్ తరగతులు ఏర్పాటు చేయమంటూ పలువురు తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. అందుకే.. ఈ ఏడాదికి సంబంధించి అమ్మఒడి పథకానికి 75శాతం హాజరు నిబంధనను తొలగించాలంటూ తల్లిదండ్రులు, పాఠశాలల నిర్వాహకులు కోరుతున్నారు.
♦ఆరు లక్షల విద్యార్థులుండగా.
కృష్ణా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కలిపి 6లక్షల మంది విద్యార్థులకు పైగా ఒకటి నుంచి పదో తరగతి వరకు ఏటా చదువుతున్నారు. వీరిలో గత ఏడాది 3.76లక్షల మంది విద్యార్థుల తల్లులకే అమ్మఒడి పథకం వర్తించింది. చాలామంది విద్యార్థులకు అర్హత ఉన్నా.. సాంకేతిక కారణాలను సాకుగా చూపి అమ్మఒడిని వేయలేదు. రెండో దశలో వేస్తామంటూ చెప్పినా.. డబ్బులు మాత్రం రాలేదు. కనీసం ఈ ఏడాదైనా వస్తుందనుకుంటే.. హాజరు నమోదును సాకుగా పెట్టారు. ఈసారి కనీసం మూడు లక్షల మంది తల్లులకైనా వస్తుందో.. రాదో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లల్లో ఎంతమందికి ఈ ఏడాది అమ్మఒడి వస్తుందనేది చెప్పడం కష్టంగా మారింది. గతంలో ఆన్లైన్ తరగతులు నిర్వహించిన సమయంలో..చాలా పాఠశాలలు విద్యార్థులకు హాజరును వేయలేదు. కేవలం పాఠశాలకు హాజరైన వారికి మాత్రమే వేశారు. ప్రస్తుతం వారందరికీ హాజరు శాతం తక్కువగానే ఉంటుంది.
0 Comments:
Post a Comment