ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దొంగచాటు నిధుల తరలించడంపై కేంద్రం నిఘా వేసినట్లే కనిపిస్తున్నది. ఇప్పటికే కేంద్రం ఇస్తున్న పంచాయితీ నిధులను రెండు మార్లుగా లాగేసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇక అలాంటి అవకాశం లేకుండా చేస్తున్నది.
ఇప్పటికే 14, 15వ ఆర్ధిక సంఘం నిధులను విద్యుత్ బిల్లుల బకాయిల పేరిట రూ. 1300 కోట్లను ప్రభుత్వం లాగేసుకున్నది. మరోవైపు15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 944 కోట్లను వారం రోజుల క్రితమే పంచాయతీ అకౌంట్ల నుంచి ఆర్ధిక శాఖ మళ్లించుకున్నది.
దీంతో ఈ వరుసగా నిధుల మళ్లింపుపై కేంద్ర ప్రభుత్వానికి కుప్పులు తెప్పలుగా ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై కేంద్రం చాలా సీరియస్‌గా స్పందించింది. ఆర్థిక సంఘం నిధులు పంపేందుకు ప్రత్యేక అకౌంట్లను పంచాయతీ పేరిట ప్రారంభించాలని కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.
కేంద్రం ఆదేశాలతో పంచాయతీ రాజ్ కమీషనర్ జడ్పీ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు ఇక నుంచి ఈ అకౌంట్లో వేస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అకౌంట్లు గ్రామ పంచాయతీ పేరు మీద, యూనియన్ బ్యాంక్‌లో ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేయడంతో తప్పని సరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
ఇకపై అన్ని పంచాయతీలు వెంటనే అకౌంట్లు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై నిఘా పెట్టడం, నిధులను దొంగచాటుగా తరలించుకుంటున్నట్లు పసిగట్టి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వానికి పరువు పోయినట్లు అయింది.
కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారంతో నడిచే వ్యవస్థలు, పథకాల అమలులో పారదర్శకత, పర్యవేక్షణ పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
శాఖల వారీగా కేటాయించిన నిధులు లక్షిత వర్గాలకు చేరేవిధంగా ప్రస్తుత విధానాల్లో మార్పులు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలోని సమగ్రశిక్ష, స్థానిక సంస్థలు నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాల స్థానంలో కొత్తగా పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (పీఎఫ్ఎంస్) అకౌంట్లను తెరుస్తున్నారు. ఉపాధిహామీ పథకంలో ఇప్పటి వరకు వినియోగించే ప్రైవేటు సాఫ్ట్‌వేర్‌ను పక్కనపెట్టి కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు.
స్థానిక సంస్థల్లో..
ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధులను 969 పంచాయతీల నుంచి సుమారు రూ.162 కోట్లను విద్యుత్తు ఛార్జీల పేరుతో వెనక్కి తీసుకున్నారు. అందుకే ఈసారి 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం పీడీ ఖాతాల స్థానంలో పీఎఫ్ఎంఎస్ అకౌంట్లను తెరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఈ పీఎఫ్ఎంఎస్ అమలు గురించి చెబుతోంది. తాజాగా నిధులన్నీ వెనక్కి తీసుకున్న తరువాత పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులు యూనియన్ బ్యాంకుల్లో పీఎఫ్ఎంఎస్ ఖాతాలను తెరుస్తున్నాయి.
ఉపాధి పథకంలో..
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు టీసీఎస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం దీని స్థానంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) సాఫ్ట్‌వేర్‌ను వినియోగంలోకి తెచ్చారు. ఇదివరకు ఉపయోగించే సాఫ్ట్వేర్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండడంతో క్షేత్రస్థాయికి అనుగుణంగా చిన్నచిన్న మార్పులు చేసుకునేవారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్ఐసీ ఒకటే సాఫ్ట్వేర్ కావడంతో ఇకపై పనులు గుర్తింపు.. అంచనాలలో మార్పులు చేయడానికి, ఉపాధి నిధులను మళ్లించడానికి అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. గతంలో పదో ఆర్థిక సంఘం నిధుల వరకు ప్రత్యేకంగానే ఖాతాలుండేవని, ఆ తరువాత నుంచి ట్రెజరీతో అనుసంధానం చేశారని జడ్పీ సీఈవో నాగార్జున సాగర్ చెప్పారు.
పాఠశాలల్లో..
ప్రభుత్వ పాఠశాలలకు ఏటా సమగ్ర శిక్షా ద్వారా కేంద్ర ప్రభుత్వమే గ్రాంట్లను మంజూరు చేస్తుంది. ఈ ఏడాది 4,035 పాఠశాలకు రూ.9.81 కోట్ల మేర నిధులు మంజూరు చేశారు. సర్కారు బడుల్లో ఇప్పటికే ఉన్న బ్యాంకు ఖాతాల స్థానంలో పీఎఫ్ఎంస్ ఖాతాలను యూనియన్ బ్యాంకులో తెరవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. కస్తూర్బా పాఠశాలల్లో బిల్లులు పెట్టడానికి కొత్తగా జ్ఞానభూమి పోర్టల్‌ను ప్రవేశపెట్టారు. ఇదివరకు మాన్యువల్‌గా బిల్లులు పెట్టేటప్పుడు అక్రమాలు జరగడానికి వీలుండేది. ఈ పోర్టల్‌తో అక్రమాలకు చెక్ చెప్పడంతో పాటు బిల్లులు వేగవంతం అవ్వడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment