AP News: మూడు రాజధానులే.. ముమ్మాటికీ దానికే కట్టుబడి ఉన్నాం: బొత్స
అమరావతి: తిరుపతిలో రేపు జరగనున్నది తెదేపా రాజకీయ సభేనని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతి ఐకాస పేరుతో పాదయాత్రగా వెళ్లిన వారంతా తెదేపా సానుభూతి పరులేనని ఆయన ఆరోపించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను అభివృద్ధి చేయడమే సీఎం జగన్, వైకాపా విధానమన్నారు.
మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని.. ముమ్మాటికీ దానికి కట్టుబడి ఉన్నామని బొత్స పునరుద్ఘాటించారు. రాయలసీమకు అన్యాయం చేసేందుకు పాదయాత్ర చేపట్టారని ఆక్షేపించారు. మూడు రాజధానుల బిల్లు అంశంపై అందరితో చర్చించి తప్పులు సవరించి మెరుగైన బిల్లును అసెంబ్లీకి తీసుకొస్తామని చెప్పారు. అమరావతే రాజధాని అని ఎన్నికల ముందు తామెప్పుడూ చెప్పలేదని బొత్స అన్నారు. తమ మేనిఫెస్టోలోనూ ఆ విషయం లేదని.. ఉంటే చూపించాలన్నారు. శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామన్నారు.
0 Comments:
Post a Comment