Amaragiri Trip : తెలంగాణ ఊటీ.. దేశంలోనే ఓ అద్భుత పర్యాటక కేంద్రం మన అమరగిరి..!
Amaragiri Trip: చుట్టూ కొండలు, అహ్లాదకరమైన వాతావరణం… పకృతి అందాల నడుమ గలగలా పారే సెలయేరు… ఆ పల్లెలో పకృతిపై ఆధారపడి జీవించే కల్మషం లేని మనుషులు.
ఆ పల్లెకు వెళ్లే ప్రతి అడుగు మధురానుభూతితో నిండింది… పకృతిని ప్రేమించే వారికి భూతల స్వర్గధామంగా ఉన్న ఆ పల్లె ఏ కోన సీమలోనో లేదు. తెలంగాణా రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లా నల్లమల కోహీనూర్ వజ్రం అయిన కొల్లాపూర్ సమీపంలోనే ఉంది. అయితే నల్లమల అటవి తల్లి ఒడిలో, కృష్ణమ్మ చెంతన సేదతీరుతున్న ఆ పల్లె అమరగిరి… ఊటీ, అరకు అందాలకు ఏమాత్రం తీసీపోని అమరగిరి పకృతి అందాలు, అహ్లాదకర వాతావరణం అందరిని ఆకట్టుకుంటోంది.
కొల్లాపూర్ పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరగిరి… ఊటీ అందాలను సైతం మైమరపిరించే విధంగా ఉంటుంది. కొల్లాపూర్ పట్టణం నుండి అమరగిరి వెళ్లేదారిలో పచ్చని పంటలు, పచ్చటి దుప్పటితో కప్పినట్లున్న కొండలు స్వాగతం పలుకుతాయి. పచ్చని పైరులు దాటిన వెంటనే పుడమిని కప్పిన అటవి తల్లి తన పచ్చని చెట్లతో ఎండాకాలన్ని సైతం చల్లగా మారుస్తూ ఆహ్వానిస్తుంది. పక్షుల కిలకిలలు మధురమైన ఖంఠం నుండి జాలువారే రాగాలు సరిగమలకు సాధన నేర్పుతాయా అన్నట్లు ఉంటుంది. ఎత్తైన కొండలు, చుట్టూ పచ్చని చెట్లు, చెంతన కృష్ణమ్మ సోగబులతో మమేకం అయిన చెంచులు నివసించే అమరగిరి అందానికే అందం తెస్తుంది. అమరగిరి అందాలను వర్ణీంచడం అంటే కవులకు కూడా పరీక్ష పెట్టినట్లే, ఒక్క సారి అమరగిరి అందాలను చూసిన వారు జీవితంలో మధురమైన జ్ఞానపకంగా ఉంచుకుంటారు.
నల్లమల ఒంపుల్లో కృష్ణమ్మ తన సోగబులతో అలల సవ్వడితో సాగిపోయే జలప్రవాహాం చూపరులను ఆకట్టుకుంటుంది. అంతే కాదు నది మధ్యలో ఐ లాండ్ తిప్ప మహా అధ్భుతంగా ఉంటుంది. ఈ తిప్ప వరకు అక్కడి నుండి నల్లమల లోని మల్లసేల వరకు లక్నవరం తరహా వంతెన నిర్మాణం చేపడితే టూరిజం శాఖకు కాసుల పంట పండినట్లే. అమరగిరి నుండి 20 నిమిషాలు నది లో ప్రయాణం చేస్తే మరో ఐ లాండ్ అయిన చీమలతిప్ప దర్శనం ఇస్తుంది. కొండల నడుమ పారుతున్న కృష్ణమ్మ అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న గుట్టల పై జాలర్లు నివాసముంటూ చేపలను వేటాడుతుంటారు. వారు వేసుకునే గుడిసెలు, వాటి ముందు ఆరబెట్టే చేపలు ఆ ప్రాంతానికి మరింత అందాలను తెచ్చిపెడుతున్నాయి. చీమల తిప్పలో వైజాగ్ ప్రాంతానికి చెందిన జాలర్లు నివాసం ఉంటున్నారు. అమరగిరి నుండి చీమల తిప్ప వరకు నదిలో ప్రయాణం చేస్తుంటే ఊహాల్లో తేలిపోవాల్సిందే.
నల్లమల సహజ ఒంపుల్లో పాయలుగా పారుతున్న కృష్ణమ్మ పరవళ్ళు పర్యాటకులను అబ్బురపరుస్తాయి. మల్లసేల వద్ద సహజంగా పారే జలపాతం కూడా పర్యాటకుల మనస్సులను దోచుకుంటుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులను స్థానిక జాలర్లు తమ బోట్లలో విహారం చేయిస్తారు. మరపడవలతో పాటు నాటు పడవల్లో ప్రయాణించి అమరగిరి అందాలను చూసి పర్యాటకులు మైమరిచి పోతుంటారు. నల్లమల అడవీ అందాలు, కృష్ణమ్మ అందాలు, కొండలు, గుట్టల అందాలు వెరసి అహ్లాదకరమైన వాతావరణాన్ని పర్యాటకులకు అందిస్తోంది ప్రకృతి.
అద్భుతమైన ప్రకృతి సంపద ఉన్న అమరగిరి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. పర్యాటకులు ఈ ప్రాంతానికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని, వారికి కావల్సిన సౌకర్యాలు కల్పించాలని. స్థానిక యువకులను ప్రోత్సహించి బోటింగ్, పార్కు, కాటేజీలు నిర్మించినట్లైతే అమరగిరి దేశంలోనే ఓ అద్భుత పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశాలున్నాయని అమరగిరి వాసులు చెబుతున్నారు
0 Comments:
Post a Comment