డీఏలపైనా దొంగాట!
పాత డీఏల ఎరియర్స్ ఇవ్వకుండానే
కొత్తగా ఇంకో పెండింగ్ డీఏ విడుదల
బిల్లు అయినా ఖాతాల్లో పడని పాత డబ్బు
వాటి ఊసు ఎత్తకుండానే కొత్త డీఏ..
సుమారు 30 నెలలు ఆలస్యంగా విడుదల
మూడు విడతల్లో ఇస్తామంటూ ఉత్తర్వులు
పీఆర్సీ ఫిట్మెంట్ ఫిక్స్ చేయకుండా దాగుడుమూతలాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏలపైనా దొంగాట ఆడుతోంది. పాత డీఏల ఎరియర్స్ చెల్లించకుండానే ఇంకో పెండింగ్ డీఏను విడుదల చేసింది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వం డీఏల చెల్లింపుల్లోనూ ఉద్యోగులతో దొంగాట ఆడుతోంది. పాత డీఏల ఎరియర్స్ చెల్లించకుండానే కొత్త డీఏ చె ల్లింపులకుసంబంధించిన ఉత్తర్వులు జారీ చేసి చేతులు దులుపుకొంది. 1-1-2018, 1-1-2019 డీఏల చెల్లింపులు చేసిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ రెండు డీఏలకు సంబంధించి 60 నెలల చొప్పున చెల్లించాల్సిన బకాయిలు తమఖాతాల్లో ఇప్పటికీ జమ కాలేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ డీఏలకు సంబంధించి ఇన్‌కంట్యాక్స్ కూడా చెల్లించామని రెండు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం(డీఏ) ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాలి. అంటే సంవత్సరానికి రెండు డీఏలు చెల్లించాలి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది జనవరి1న ఒకటి, జూలై 1 మరో డీఏ విడుదల చేసింది. ఇవి 2018 జూలై1న, 2019 జనవరి1న చెల్లించాల్సిన డీఏలు. అంటే 30 నెలలు ఆలస్యంగా విడుదల చేశారు. ఇంతకాలానికి చెల్లించాల్సిన బకాయిలు మాత్రం ఇప్పటివరకు ఉద్యోగుల ఖాతాల్లో పడలేదు. ఇంతలోనే 2019 జూలై డీఏ చెల్లింపులకు సంబంధించిన జీవో విడుదల చేశారు. మూడేళ్లు గడిచినా డీఏల ఎరియర్స్ చెల్లించకపోవడం ఏమిటని ఉద్యోగులు మండిపడుతున్నారు. తాజాగా జారీ చేసిన డీఏకు సంబంధించి కూడా ప్రభుత్వం 30 నెలల ఎరియర్స్ చెల్లించాల్సి రావడం గమనార్హం. అయితే, ఆ రెండు డీఏల బకాయిలకు సంబంధించిన బిల్లులు క్లియర్ అయ్యాయని, ఉద్యోగుల ఖాతాల్లో మాత్రం నగదు జమకాలేదని చెబుతున్నారు. ఆ బిల్లులు గ్రీన్ చానల్లో ఆగిపోయాయని అంటున్నారు. గత డెబ్భై ఏళ్లలో డీఏ చెల్లింపులు ఈ విధంగా జరగడం ఎప్పుడూ చూడలేదని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. నిబంధనల ప్రకారం.. డీఏ ఎరియర్స్‌ను రెండురకాలుగా చెల్లించాలి. పాతపెన్షన్ ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తే, పెన్షనర్లకు నగదు రూపంలో చెల్లించాలి. ఇక..సీపీఎస్ ఉద్యోగులకు 90శాతం నగదురూపంలో, 10శాతం ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో జమ చేయాలి. ఈ లెక్కన..పెండింగ్‌లో పెట్టిన రెండు డీఏల ఎరియర్స్‌కు సంబంధించి...ఒక్కో ఉద్యోగికి కేడర్‌ను బట్టి సుమారు రూ. 50వేల నుంచి 80 వేల వరకు జమ కావాలి. అలాగే, పాత పెన్షన్ ఉద్యోగులకూ తమ జీపీఎఫ్ ఖాతాల్లో డీఏల ఎరియర్స్ నగదు జమ చేయలేదని చెబుతున్నారు.
2019 జూలై డీఏ విడుదల
మూడువిడతలుగా ఎరియర్స్ చెల్లింపు
రాష్ట్ర ప్రభుత్వం 2019 జూలై నుంచి ఉద్యోగులకు చెల్లించాల్సిన 5.24 శాతం కరువు భత్యాన్ని విడుదల చేసింది. పెరిగిన కరువుభత్యం 2022 జనవరి నెల జీతంతో కలిపి ఇస్తామని వెల్లడించింది. డీఏ బకాయిలను 2022 జనవరి నెలతో కలిపి మూడు విడతల్లో చెల్లించనున్నట్లు తెలిపింది. సీపీఎస్ ఉద్యోగులకు డీఏలో 10 శాతాన్ని ప్రాన్ ఖాతాలకు, మిగిలిన 90 శాతం మొత్తాన్ని నేరుగా జీతాల్లో మూడు విడతలుగా చెల్లించనుంది. జడ్పీ, మండల పరిషత్, పంచాయతీలు, ఎయిడెడ్ సంస్థలు, యూనివర్సిటీల సిబ్బందికీ ఈ డీఏ వర్తిస్తుంంది. పెన్షనర్లకు నగదు రూపంలో చెల్లిస్తారు. పాతపెన్షన్ ఉద్యోగులకు వారి జీపీఎఫ్, జడ్పీపీఎఫ్ ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ఈ మేరకు సోమవారం ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
0 Comments:
Post a Comment