🔳సర్వీస్ వైద్యులకు 30%పీజీ సీట్లు..
ఎట్టకేలకు ఓకే చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): గిరిజన, గ్రామీ ణ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు మెడికల్ పీజీ కౌన్సెలింగ్‌లో సర్వీస్ కోటా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ఈమేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఏడాదిన్నర క్రితం గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు స్పెషలైజేషన్ చేసేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిం ది. దీన్ని అమలు చేయాలని కోరుతూ ప్రభుత్వ వైద్యుల సం ఘం కన్వీనర్ డాక్టర్ జయధీర్తోపాటు మరికొందరు తీవ్ర పోరాటం చేశారు. దీంతో ప్రభుత్వం దీనిపై అధ్యయనానికి త్రిసభ్య కమిటీ వేసింది. వైద్యుల వినతిపత్రాలు, సుప్రీం కోర్టు ఆదేశాలు, ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న సర్వీస్ కోటా నిబంధనలు పరిశీలించిన కమిటీ నవంబర్‌లో నివేదిక సమర్పించింది. ఈ నివేదికకు సోమవారం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గిరిజన ప్రాంతాల్లో మూడేళ్లు విధులు నిర్వహించిన వైద్యులు, రూరల్ ప్రాంతాల్లో ఐదేళ్లు, అర్బన్ ప్రాంతాల్లో ఏడేళ్లు విధులు నిర్వహించిన వైద్యులకు సర్వీస్ కోటా సీట్లు పొందేందుకు అర్హత కల్పించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో ఉన్న పీజీ సీట్లలో క్లినికల్ సీట్లలో 30%, నాన్క్లినికల్ సీట్లలో 50% సర్వీస్ కోటా వైద్యులకు కేటాయిస్తారు. ఈ లెక్కన ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సీట్లల్లో 200 క్లినికల్ సీట్లు, 400 నాన్ క్లినికల్ సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. కేవలం రెండు కౌన్సెలింగ్‌ల వరకే సర్వీస్ కోటా సీట్లు పొందే అవకాశం కల్పిస్తారు. అప్పటికీ మిగిలిపోయిన సీట్లు జనరల్ పూల్‌లోకి వెళ్లిపోతాయి. ఈ అభ్యర్థులు ఐదేళ్లపాటు గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించాలి.
0 Comments:
Post a Comment