Village Secretariats: గ్రామ సచివాలయ ఉద్యోగుల వింత పరిస్థితి.. పెళ్లికి ప్రొబేషన్ కు లింక్..! అదెలాగంటే..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వ్యవస్థ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ (Village, Ward Secretariats) .
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక గ్రామ, వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. వీటి ద్వారాలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందిస్తున్నారు. ఇందుకోసం 2019 అక్టోబర్ లో దాదాపు లక్షా 20వేల మందిని ప్రభుత్వం ఉద్యోగాల్లో నియమించింది. వీళ్లందరికీ రెండేళ్ల పాటు ప్రొబేషన్ తర్వాత పర్మినెంట్ చేస్తామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది.
ఐతే చూస్తుండగానే రెండేళ్లు గడచిపోయాయి. దీంతో గ్రామ సచివాలయ ఉద్యోగులందరికీ శాఖపరమైన పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం ప్రమోషన్ ప్రక్రియను మాత్రం పెడింగ్ లో పెట్టింది. ప్రభుత్వం నుంచి ప్రొబేషన్ పూర్తైనట్లు ఆర్డర్స్ వస్తే జీతాలు పెరుగుతాయని ఉద్యోగులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఐతే ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి అలాంటి సంకేతాలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
పెళ్లికి ప్రొబేషన్ కు లింక్..
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారిలో చాలా మంది పెళ్లికాని యువతీ యువకులే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం రావడంతో పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అవ్వొచ్చని అంతా భావించారు. సచివాలయంలో ఉద్యోగం కాబట్టి మంచి సంబంధాలు వస్తాయని కూడా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కొంతమంది విషయంలో అనుకున్నొదక్కటి... జరుగుతున్నది ఒక్కటి అనేలా ఉంది. చాలా మంది విషయంలో పెద్దలు పెళ్లికి, ప్రమోషన్ కు లింక్ పెడుతున్నారట. ఇప్పటికే కొంతమందికి పెళ్లిళ్లు కుదిరినా ప్రమోషన్ వరకు వెయిట్ చేయాలనే కండిషన్ పెడుతున్నారు.
అబ్బాయిల విషయంలో మరీ కఠినం..
అబ్బాయిల విషయంలో గ్రామ సచివాలయంలో ఉద్యోగం అనగానే.. ఇంకా పర్మినెంట్ కాలేదుగా అనే మాట అమ్మాయి తరపువారి నుంచి వినిపిస్తోందట. ఎంత ప్రభుత్వ ఉద్యోగమైనా పర్మినెంట్ అయితేనే అమ్మాయి సుఖపడుతుందనే ధోరణని తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. అంతేకాదు జీతం 15వేలేగా.. ఒకవేళ పర్మినెంట్ కాకపోతే పరిస్థితేంటి అనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయట. ప్రొబేషన్ పూర్తై జీతం పెరిగితే ధైర్యంగా పెళ్లి చేసుకోవచ్చని మరికొందరు భావిస్తున్నారట. ఇలాంటి వారు దాదాపు ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఉన్నారంటే అతిశయోక్తికాదు.
ప్రొబేషన్ ఆలస్యం కావడానికి కారణం ఇదేనా..!
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఇంకా ఖరారు కాకపోవడానికి బడ్జెట్ కేటాయింపులే కారణంగా తెలుస్తోంది. ప్రస్తుత బడ్జెట్ లో ప్రొబేషన్ కు సంబంధించిన జీతాలకే కేటాయింపులు జరిపారు. ఇప్పటికిప్పుడు ప్రమోషన్ ఆర్డర్స్ ఇస్తే ఒక్కొక్కరి జీతం రూ.22వేల నుంచి రూ.24వేల వరకు పెరిగే అవకాశముంది. దీంతో ప్రభుత్వంపైఅదనపు భారం పడుతుంది. దీంతో వచ్చే బడ్జెట్ లో జీతాలకు సరిపడా కేటాయింపులు జరిపి ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
0 Comments:
Post a Comment