Venkaiah Naidu: పాత 'వరస' కుదిరితే వెంకయ్యే 15వ భారత రాష్ట్రపతి!.. ఒపినియన్ ఆర్టికల్ ~ MANNAMweb.com

Search This Blog

Latest Posts ⚡ లేటెస్ట్ పోస్ట్స్

MORE TO VIEW

Thursday 18 November 2021

Venkaiah Naidu: పాత 'వరస' కుదిరితే వెంకయ్యే 15వ భారత రాష్ట్రపతి!.. ఒపినియన్ ఆర్టికల్

 Venkaiah Naidu: పాత 'వరస' కుదిరితే వెంకయ్యే 15వ భారత రాష్ట్రపతి!.. ఒపినియన్ ఆర్టికల్


భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురించి ఇటీవల ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. అయ్యప్ప సాక్షిగా వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని చిరు ఆకాంక్షించారు.

ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు చేస్తున్న సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. ఇంతకీ వెంకయ్యనాయుడుకి రాష్ట్రపతిగా సేవలందించే అవకాశం ఉందా..?.. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ మెరుగుమాల నాంచారయ్య ఇటీవల రాసిన విశ్లేషణను ఇప్పుడు చూద్దాం.


“దేశానికి 13వ ఉపరాష్ట్రపతిగా రాజ్యాంగ పదవి చేపట్టిన మొదటి తెలుగు తేజం వెంకయ్య కాదనే మాట నిజమే. భారత అత్యున్నత అధికార పీఠాలున్న దిల్లీ రాయసీనా హిల్‌పై పెద్ద పదవిలో ఉన్న తెలుగువాడు ప్రస్తుతానికి వెంకయ్య నాయుడు 'ఒక్కడే'. రాయసీనా కొండపై ఉన్న రాష్ట్రపతి భవన్‌లోకి ఐదు సంవత్సరాలు ఉండడానికి వచ్చే ఏడాది ఆయన వెళతారా? లేక ఆయన ముందు ఉప రాష్ట్రపతి పదవిలో పదేళ్లు ఉన్న హమీద్‌ అన్సారీ లాగా విశ్రాతం జీవితం గడుపుతారా అనేది ఇప్పటి ప్రశ్న. ప్రధాని నరేంద్రమోదీకి, వెంకయ్యనాయుడుకు మధ్య కొన్ని పోలికలున్నాయి. వారిద్దరూ స్వాతంత్య్రం వచ్చాక పుట్టారు. మోదీ 1950 సెప్టెంబర్‌ 17న పుడితే, నాయుడు కాస్త ముందు 1949 జులై ఒకటిన జన్మించారు. ఇలా 1947 ఆగస్ట్‌ 15 తర్వాత పుట్టిన తొలి ప్రధాని మోదీ కాగా, తొలి ఉప రాష్ట్రపతి నాయుడే. (ఇలా స్వతంత్ర భారతంలో భూమి మీద పడిన నేత ప్రవేశించాల్సింది ఇక రాష్ట్రపతి భవన్‌లోకే) ఇద్దరూ శూద్ర కులాల్లో పుట్టారు. పోలిక అంతటితో ముగుస్తుంది. ఐదేళ్లు ప్రధానిగా కొనసాగి బీజేపీని రెండోసారి గెలిపించిన ప్రజాకర్షక నేత మోదీ. బహిరంగసభల్లో, విలేకరుల సమావేశాల్లో, చట్టసభల్లో తన మాట పదునుతో, వ్యంగ్యాస్త్రాలతో శ్రోతలను ఆకట్టుకునే వక్త వెంకయ్య. వరుసగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవడానికి అవసరమైన 'జనాకర్షక శక్తి' లేదా 'కరిజ్మా' ఉన్న నేత కాదు నాయుడు. వెంకయ్యనాయడు 2017లో ఉప రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు నేను ఆయన 'భవిష్యత్తు పదవి'పై రాసిన ఓ వింత విశ్లేషణ లేదా 'జోస్యం' ఈరోజు నాకు గుర్తుకొచ్చింది. దాన్ని మరోసారి ఇక్కడ వివరిస్తా.


ఉపరాష్ట్రపతుల్లో 'ముగ్గురొదిలి ముగ్గురికి' ప్రమోషన్‌

---------------------------------------------

భారత రాజ్యాంగం ప్రకారం తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగిన 1952 నుంచి 2017 వరకూ వెంకయ్యనాయుడు సహా 13 మంది ఉపరాష్ట్రపతి పదవి చేపట్టారు. వెంకయ్యకు ముందు ఈ పదవిలో ఉన్న పన్నెండు మందిలో ఇద్దరు: సర్వేపల్లి రాధాకృష్ణన్, మహ్మద్‌ హమీద్‌ అన్సారీ వరుసగా రెండేసిసార్లు వైస్‌ ప్రెసిడెంట్‌ పదవి నిర్వహించారు. కాని, ఈ 12 మందికి సంబంధించి అంతకు మించిన ఆసక్తికర అంశం ఒకటుంది. మొదటి ముగ్గురు ఉపరాష్ట్రపతులకు (ఎస్‌.రాధాకృష్ణన్, జాకిర్‌ హుస్సేన్, వరహాగిరి వెంకట (వీవీ) గిరి) రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యే అవకాశం వచ్చింది. వారిలో జాకిర్‌ హుస్సేన్‌ ఒక్కరే రాష్ట్రపదవి చేపట్టిన రెండేళ్లకే కన్నుమూశారు. రాధాకృష్ణన్, వీవీ గిరి ఐదేళ్లూ పదవిలో కొనసాగారు. ఈ మొదటి ముగ్గురు ఉప రాష్ట్రపతుల తర్వాత పదవి చేపట్టిన ముగ్గురు ఉపరాష్ట్రపతులు గోపాల్‌ స్వరూప్‌ పాఠక్, బసప్ప దానప్ప జత్తి, మహ్మద్‌ హిదయతుల్లా-ఈ ముగ్గురికీ రాష్ట్రపతి అయ్యే అదృష్టం దక్కలేదు. వారి తర్వాత వరుసగా ఉపరాష్ట్రపదవి అధిష్ఠించిన ముగ్గురు నేతలు ఆర్‌.వెంకట్రామన్, శంకర్‌ దయాళ్‌ శర్మ, కె.ఆర్‌.నారాయణ న్‌ రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు. ( ఈ ముగ్గురిలో వెంకట్రామన్‌కు ఉపరాష్ట్రపదవిలో మూడేళ్లు నిండకుండానే ప్రమోషన్‌ లభించింది. ) వారి తర్వాత వరుసగా ఉపరాష్ట్రపదవి వరించిన ముగ్గురు నేతలు: కె.కృష్ణకాంత్, భైరో(భైరవ్‌) సింగ్‌ షెఖావత్, హమీద్‌ అన్సారీలకు రాష్ట్రపతిగా ఎన్నికయ్యేలా పరిస్థితులు అనుకూలించలేదు. ( ఈ ముగ్గురిలో బీఎస్‌ షెఖావత్‌ ఒక్కరే రాష్ట్రపతి పదవికి బీజేపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు.) ఇలా ఉపరాష్ట్రపతుల్లో మొదటి ముగ్గురు, తర్వాత ముగ్గురును వదిలి మరో ముగ్గురు రాష్ట్రపతులయ్యారు. వెంకయ్య ముందున్న ముగ్గురికీ రాష్ట్రపతి భవన్‌ రెసిడెంట్‌గా ఉండే అవకాశం రాలేదని ఇంతకు ముందే వివరించాను. పైన చెప్పినట్టు ముగ్గురిని వదిలి ముగ్గురు ఉప రాష్ట్రపతులు రాష్ట్రపతి పదవి చేపట్టే 'ఆనవాయితీ' కొనసాగితే-వచ్చే ఏడాది ప్రస్తుత పదవిలో రిటైరవడానికి నెల ముందు రాష్ట్రపతి అయ్యే అవకాశం వెంకయ్య నాయుడుకు రావాల్సి ఉంటుంది. ఇక్కడ వివరించిన 'నమూనా లేదా ప్యాటర్న్‌ ' ఇక ముందు కూడా ఆచరణలో నిజమైతే వెంకయ్యతోపాటు ఆయన తర్వాత ఉపరాష్ట్రపతి పదవి చేపట్టే ఇద్దరు కూడా రాష్ట్రపతి పదవికి ఎన్నికవుతారు. ఇదంతా ఆసక్తిదాయకంగా కనిపించే ఓ 'లెక్కల గారడీ' అని కూడా భావించవచ్చు. పదే పదే ఈ నమూనా నిజమౌతూ పోతే ఇదో 'మూఢ నమ్మకం'గా మారిపోతుంది. కాని అలా జరగదు.


వెంకయ్య మాటలు కొన్న దశాబ్దాలుగా వింటూ, ఆయన మాట్లాడేటప్పుడు ఆయన ముఖకవళికలు గమనిస్తూ వస్తున్న మా తరం వారికి (1950ల చివరిలో పుట్టినోళ్లం) 'ముగ్గురి తర్వాత ముగ్గురు' ఉపరాష్ట్రపతులు పదోన్నతి పొందే ఈ ఆనవాయితీ లేదా నమూనా కొనసాగాలనే ఉంటుంది. కులం ప్రస్తావన ఇక్కడ అనవసరమేగాని-'రెడ్డి' రాష్ట్రపతి తర్వాత 'కమ్మ' ప్రెసిడెంట్‌ 40 ఏళ్ల తర్వాతైనా రాకపోతే ఎలా? అంటే, 1982లో అప్పటి తెలుగు రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి పదవీవిరమణ చేసిన నాలుగు దశాబ్దాలకు 2022లో మరో తెలుగు తేజం వెంకయ్య ఈ పదవి చేపట్టడం సబబే కదా అపర చాణుక్యుడు అంటే నాలాంటి బుద్ధిజీవులు అంగీకరించపోవచ్చుగాని, బహుభాషా కోవిదుడైన తెలుగు తేజం పాములపర్తి వేంకట నరసింహారావు గారి తర్వాత మరో తెలుగు నేత ప్రధాని పదవి చేపట్టే అవకాశాలు ఏ మాత్రం కనిపించని దశలో వెంకయ్యకు రాష్ట్రపతిగా 'ప్రమోషన్‌' ఆశించడం తప్పుకాదనుకుంటాను. ఎందుకంటే, ఇప్పటికి రాష్ట్రపతి పదవి చేపట్టిన 14 మందిలో తెలుగువారు ముగ్గురు (సర్వేపల్లి రాధాకృష్ణన్, వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి). వారిలో మొదటి ఇద్దరు సర్వేపల్లి, గిరి బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టారు. రాధాకృషన్‌ సొంతూరు తిరుత్తణి 1960 తర్వాత తమిళనాడులో చేరినా, అప్పటి వరకూ చిత్తూరు జిల్లాలో ఉండేది. అదీగాక, ఆయన పుట్టింది తెలుగు నియోగి బ్రాహ్మణ పరివారంలో. మూడో తెలుగు ప్రెసిడెంట్‌ నీలం సంజీవరెడ్డిది వ్యవసాయాధారిత సామాజికవర్గమని ముందు చెప్పుకున్నాం. తెలుగు బ్రాహ్మణులు ప్రధాని, రాష్ట్రపతి పదవులు అధిష్టించారు. బలమైన తెలుగు రెడ్డికి రాష్ట్రపతి భవన్‌ ఐదేళ్లు ఆశ్రయమిచ్చింది. మరి కమ్మ కులంలో పుట్టి పెరిగిన నేతకు రాయసీనా హిల్‌పై భారత సర్వసైన్యాధ్యక్షుని హోదాలో ఐదు సంవత్సరాలు నివాసముండే అవకాశం వచ్చే ఏడాది వస్తుందా? విస్తృత రాజకీయానుభవం, హస్తినలో పాలనాదక్షునిగా పేరు ప్రఖ్యాతులు సాధించిన రాజయకీయనాయకుడిని, అందులోనూ హిందూ జాతీయవాదం ఆచరణలో ప్రదర్శించే జాతీయపార్టీ బీజేపీ నేతను- ఒక తెలుగు కులం పేరు చెప్పి ప్రస్తావించడం చాలా మందికి నచ్చకపోవచ్చు.

దేశంలో ప్రాంతీయ పార్టీల నేతలు ప్రధాని పదవి సంపాదించడం ఎంత కష్టమో, ప్రాంతీయ కులాల్లో పుట్టిపెరిగిన నాయకులు ప్రధాని లేదా రాష్ట్రపతి గద్దెనెక్కడం అంతే కష్టమైన పని. ఈ సందర్భంగా 1991 మేలో పీవీ నరసింహారావు దేశ ప్రధాని అయినప్పుడు విజయవాడలో అప్పటి 'ఉదయం' విజయవాడ ఎడిషన్‌ స్థానిక సంపాదకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నన్ను అడిగిన ప్రశ్న గుర్తుకొచ్చింది. 'మన తెలుగువాడు పీవీ ప్రధాని కావడం మీకు ఏమనిపిస్తోంది? సంతోషమేనా?' అనే అర్థంలో నన్ను ఆయన అడిగారు. ''నరసింహారావుగారు కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ విస్తరించి ఉన్న బ్రాహ్మణ సామాజికవర్గంలో జన్మించిన నేత కావడం వల్ల నాలో ఎలాంటి ప్రత్యేక ఉద్వేగం ఉప్పొంగడం లేదు. జవాహర్‌లాల్‌ నెహ్రూ కశ్మీరీ పండిత కుటుంబంలో పుట్టినా మా గుడివాడ సత్యనారాయణపురం బ్రాహ్మణులు ఆయనను తమ కులస్తుడిగా పరిగణిస్తూ మాట్లాడేవారు. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు, 16 అణాల తెలుగువాడు దేశంలోని అత్యున్నత పదవిని అధిష్ఠించాడనే భావన కలిగింది. రెడ్డి, కమ్మ, వెలమ, కాపు వంటి 'ప్రాంతీయ' తెలుగు సామాజికవర్గాల నేతలు ఎన్నికైతేనే వారు 'మన తెలుగోళ్లనే' భావన కలిగిస్తారు,'' అని నేను జవాబిచ్చాను.

మళ్లీ వెంకయ్య నాయుడు అర్హతల విషయానికి వస్తే, ఎమ్యేల్యేగా ఆయనకు ఏడేళ్లు నిండకుండానే 1984 చివర్లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ రద్దయింది. తర్వాత నాయుడు పోటీచేసిన మూడు ప్రత్యక్ష ఎన్నికల్లో (ఒక అసెంబ్లీ, రెండు లోక్‌సభ) ఓడిపోయారు. ఏపీ అసెంబ్లీ రద్దయిన వెంటనే 1985 మార్చిలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తనను రెండుసార్లు గెలిపించిన ఉదయగిరి నుంచి పక్కనున్న ఆత్మకూరు (ఈ రెండూ నెల్లూరు జిల్లాలోనివే) వచ్చి పోటీచేసి ఓడిపోయారు. అప్పుడు వెంకయ్యను ఓడించిన కాంగ్రెస్‌ అభ్యర్థి బొమ్మిరెడ్ది సుందరరామిరెడ్డి. ఆత్మకూరు ఓటమి తర్వాత ఆయనకు రెండు లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం ఎదురైంది. 1989లో బాపట్ల నుంచి లోక్‌సభకు పోటీచేసి సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి సలగల బెంజిమన్‌ చేతిలో (తేడా 43,620 ఓట్లు) ఓడిపోయారు వెంకయ్య. మళ్లీ 1996 లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ స్థానంలో ఎంఐఎం అధినేత సుల్తాన్‌ సలాహుద్దీన్‌ ఒవైసీపై పోటీచేసి 73,273 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఇలా 1985, 89, 96 ఎన్నికల్లో వరుసగా పరాజయాలు ఎదురైనా వెంకయ్యనాయుడు తన రాజకీయ ప్రతిభాపాటవాలు, సామర్ధ్యం కారణంగా బీజేపీ జాతీయ నాయకుడయ్యారు. 1990ల మధ్య నుంచి కర్ణాటకలో బీజేపీ బలం పుంజుకోవడం మొదలైంది. ఇది వెంకయ్య రాజ్యసభకు వెళ్లడానికి దోహదం చేసింది. 1996, 1998లో బీజేపీ బలం లోక్‌సభలో గణనీయంగా పెరిగి పార్టీ అగ్రనేత ఏబీ వాజ్‌పేయి నేతృత్వంలోని సంకీర్ణాలు కేంద్రంలో వరుసగా 13 రోజులు, 13 నెలలు అధికారంలో కొనసాగడంతో వెంకయ్య నాయుడుకు కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చింది. ఆయన రాజకీయ ప్రతిభతో కర్ణాటక నుంచి వరుసగా 1998, 2004, 2010లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.

వాజ్‌పేయి ప్రభుత్వంతో కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా నాయుడు కేబినెట్‌ మంత్రి అయ్యారు. మొదట మంత్రి పదవి వద్దని వెంకయ్య చెప్పినా, మోదీ నచ్చజెప్పి, ఒప్పించారనే వార్తలు వచ్చాయి. ఆయన రాజ్యసభ సభ్యత్వం మూడోసారి 2016లో ముగిసే నాటికి కర్ణాటక నుంచి రాజ్యసభకు ఆయన నామినేట్‌ కావడాన్ని (పోటీచేయడాన్ని) కొందరు వ్యతిరేకించారు. పొరుగురాష్ట్రం నేత 18 ఏళ్ల తర్వాత కూడా కర్ణాటకకు ఎలా రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తారనే ప్రశ్నతో వెంకయ్యను ప్రతిఘటించారు. వారు అంతటితో ఆగకుండా,''వెంకయ్య సాకయ్య'' (వెంకయ్యా, చాలయ్యా) అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారోద్యమం నడిపారు. ఫలితంగా, వెంకయ్య సేవలు కేంద్రంలో, పార్లమెంటులో అవసరమని భావించిన మోదీ-అమిత్‌షా ద్వయం ఆయనను 2016లో రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ఎన్నిక చేయించి పంపింది. కేంద్ర మంత్రిగా 2017 జులై వరకూ కొనసాగిన వెంకయ్య అయిష్టంగానే బీజేపీ తరఫున ఉప రాష్ట్రపతి పదవికి పోటీచేసి, యూపీఏ (కాంగ్రెస్) అభ్యర్థి, మోహన్ దాస్ గాంధీ, చక్రవర్తి రాజగోపాలాచారి మనవడు గోపాలకృష్ణ గాంధీని భారీ మెజారిటీతో ఓడించారు. క్రియాశీల రాజకీయాలకు అలవవాటుపడిన వెంకయ్యకు పార్టీలకు అతీతమైన ఉపరాష్ట్ర పదవి మొదట్లో మింగుడుపడలేదు. ఆ సమయంలోనే తన ఆహారపు అలవాట్లు (తలకూర సహా మాంసం, చేపల కూరలు తిన్న సంగతులు), శూద్ర సామాజికవర్గంలో పుట్టడం వల్ల తన జీవనశైలి ఎలా భిన్నమైనదో వివరిస్తూ మీడియాతో మొదటిసారి మనసు విప్పి మాట్లాడారు. ఈ కబుర్లతో ఆయ ఓ మోస్తరు సంచలనం సృష్టించారు. పార్టీ నాయకత్వంపై కాస్త అసంతృప్తికి గురైనది కూడా బహుశా అప్పుడే. ఎమర్జెన్సీలో జైలు జీవితం గడిపాక విడుదలైన వెంటనే 1977 మార్చిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒంగోలు నుంచి వెంకయ్య జనతాపార్టీ తరఫున పోటీచేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పులి వెంకటరెడ్డి చేతిలో 89,881 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇరవై ఎనిమిది ఏళ్లు నిండడానికి కొద్ది నెలల ముందు జరిగిన ఈ తొలి ఎన్నికల సమరంలో ఓడినాగాని వెంకయ్య వెనుదిరగలేదు. 1977లో మొదలైన ఎన్నికల రాజకీయాలే 2017లో ఆయనను ఉపరాష్ట్రపతిని చేశాయి. తెల్ల ప్యాంట్, తెల్ల చొక్కా వేసుకోవడం చూసిన మా తరం వారికి వెంకయ్య దిల్లీ వచ్చాక అడ్డ పంచెలో కనిపించడం కాస్త కొత్తగా కనిపించినా, తమిళ నేలను ఆనుకుని ఉన్న నెల్లూరు సంప్రదాయాన్ని వెంకయ్య పాటిస్తున్నారని అర్థమైంది.

ప్రత్యక్ష ఎన్నికల్లో నాలుగు ఓటములు ఆయన ఎదుర్కొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ఉండగా పార్టీ పరజయాన్ని 2004లో వెంకయ్య స్వయంగా చూశారు. మధ్యలో కేబినెట్‌ మంత్రి పదవులు నిర్వహించారు. రాజ్యసభలో వరుసగా 19 ఏళ్లు (1998-2017) ఆయన సభ్యునిగా కొనసాగారు. సభ్యత్వం లేకుండా రాజ్యాంగ పదవి ద్వారా ఆయన రాజ్యసభ చైర్మన్‌గా నాలుగేళ్లుగా ఉంటున్నారు. పూర్వపు జనసంఘ్, బీజేపీ అగ్రనేత, వెంకయ్యకు బాగా ఇష్టమైన నాయకుడు లాల్‌ కృష్ణ ఆడ్వాణీ 1970లోరాజ్యసభలో మొదటి రాజకీయ ఇన్నింగ్స్‌ ప్రారంభించి 1989 వరకూ దాదాపు 19 సంవత్సరాలు కొనసాగారు. 1989 నుంచి ఆయన 2014 వరకూ లోక్‌సభకు (1996లో పోటీచేయలేదు) ఏడుసార్లు గెలిచారు. అంటే 28 ఏళ్లు లోక్‌సభ సభ్యునిగా కొనసాగారు. పార్లమెంటులో 47 ఏళ్లు, ఉప ప్రధానిగా కొన్ని సంవత్సరాలు వాజ్‌పేయి సర్కారులో పనిచేసిన ఆడ్వాణీకి 2014లో ప్రధాని కావడానికి ఆయన వయసు (86 ఏళ్లు) 'అడ్డంకి'గా మారింది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2017 జులైలో 71 సంవత్సరాల వయసులో అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు. కోవింద్‌ వారసునిగా వెంకయ్యకు మోదీ-షా ద్వయం అవకాశమిస్తే అప్పటికి ఆయనకు వయసు అడ్డంకి కాబోదు. 2022 జులైలో రాష్ట్రపతి పదవికి నామినేషన్‌ వేసే సమయానికి వెంకయ్యకు అప్పుడే 73 నిండుతాయి. ఇతర రాజకీయాంశాలు అనుకూలిస్తే వెంకయ్యకు అడ్డంకులే ఉండవు. ముందే చెప్పినట్టు మగ్గురేసి ఉపరాష్ట్రపతులకు లభిస్తున్న పదోన్నతి 'వరుస' వెంకయ్య నాయుడు విషయంలోనూ నిజమైతే దిల్లీలో ఆయన మకాం 2027 వరకూ కొనసాగుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం: ఆయన రాష్ట్రపతి పదవి చేపట్టిన నెలలోపే 2022 ఆగస్ట్‌లో భారత స్వాతంత్య్ర 75 వార్షికోత్సవాలు (ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌) ఆయన ఆధ్వర్వంలో జరుగుతాయి. ఇదంతా పైన చెప్పిన 'వరుస' కుదిరితేనే!”

—– మెరుగుమాల నాంచారయ్య, సీనియర్ జర్నలిస్ట్

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top