అలంకారప్రాయమే
నాడు- నేడు ఆర్వో ప్లాంట్లు... అట్టర్‌ఫ్లాప్
8 నెలలుగా మూలకు.. కొన్నిచోట్ల మరమ్మతులకు..
చాలా చోట్ల ప్రారంభానికి నోచుకోని దుస్థితి
ఒక్కో దానికి రూ.50 వేల నుంచి
రూ. 4.54 లక్షలపైనే ఖర్చు..
1222 స్కూళ్లలో ప్లాంట్లు ఏర్పాటు
జిల్లావ్యాప్తంగా రూ.32.53 కోట్లు వ్యయం
అయినా.. ఫలితం శూన్యం
ఇళ్ల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్న విద్యార్థులు
ఇది నగరంలోని శారద స్కూల్‌లోని చిత్రం. ఇక్కడ 1200 మంది విద్యార్థులున్నారు. నాడు-నేడు కింద పెద్ద ఆర్వో ప్లాంట్ మంజూరు చేశారు. పిల్లల సౌకర్యార్థం దానిని ఒక గదిలో ఉంచారు. ప్రారంభించేందుకు ప్రయత్నించగా... పొగలు వచ్చాయి. ఇక అంతే దానిని మరమ్మతు చేసే కంపెనీ వాళ్లు రాలేదు. ఇలా మూలన పడింది.
అనంతపురం విద్య, నవంబరు 23: స్కూళ్లలో తాగు నీళ్ల పేరుతో కోట్లు నీళ్లపాలు చేశారు. ఏకంగా రూ.32.53 కోట్లు వ్యయం చేసి ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు... అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. నాడు-నేడు పేరుతో అంతా హడావుడి చేశారు. ఆర్వో ప్లాంట్లు ఇతర రాషా్ట్రల నుంచి తెప్పించారు. వాటిని వందలాది స్కూళ్లలో మూలకు పడేశారు. సరిగా అమర్చకపోవడంతోపాటు సదరు కంపెనీల టెక్నీషియన్లు ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో నిరుపయోగంగా మారాయి. దీంతో ఆర్వో ప్లాంట్లు మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. జిల్లాస్థాయి అధికారులు చేతులెత్తేశారు. ఫలితంగా సర్కారీ బడుల పిల్లలకు నీళ్ల తిప్పలు తప్పడం లేదు.
1,222 స్కూళ్లలో ఆర్వో ప్లాంట్లు...
మనబడి నాడు-నేడు మొదటి విడత కింద జిల్లావ్యాప్తంగా 1,222 స్కూళ్లలో పిల్లలకు ఫిల్టర్ వాటర్ సరఫరా చేయాలంటూ అనూహ్యంగా ఆర్వో ప్లాంట్లను తెరపైకి తీసుకొచ్చారు. ఆహ్లాద ఇంజనీర్స్ లిమిటెడ్, ఇన్నోవేటివ్ ఇండసీ్ట్రస్, లివ్‌ప్యూర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలా పలు కంపెనీల నుంచి ఆర్వో ప్లాంట్లు తెప్పించారు. ఒక్కోటి వాటి సామర్థ్యాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.4.54 లక్షల వరకూ ఉన్నాయి. 1222 స్కూళ్లలో ఆర్వో ప్లాంట్లు మంజూరుచేసినట్లు సమగ్రశిక్ష అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాటిని పట్టించుకునే నాథుడే లేడు.
రూ. 32.53 కోట్లు... నీళ్ల పాలు..!
జిల్లాలో నాడు-నేడు స్కూళ్లలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి కోట్ల రూపాయలు వెచ్చించారు. 1222 స్కూళ్లలో వీటిని ఏర్పాటు చేయడానికి రూ.32.53 కోట్లు వెచ్చించారు. 1,000కిపైగా స్కూళ్లలో ఇవి పనిచేయడం లేదు. వందలాది స్కూళ్లలో వీటిని నేటికీ ఇన్‌స్టాల్ చేయలేదు. నార్పల మండలంలో 19 స్కూళ్లు ఉంటే.. 16 చోట్ల ఈ ప్లాంట్లు ఏర్పాటుచేశారు. ప్రస్తుతం 5 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలినవి ఇంకా పలు రకాల కారణాలతో మరమ్మతుల దశలో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఇదే సమస్య ఉంది.
పట్టించుకునే వారేరీ..?
ఆర్వో ప్లాంట్లను పట్టించుకునే వారే కరువయ్యారు. ఇన్‌స్టాల్ చేసినా... ఏదైనా చిన్న సమస్య వస్తే... ఫోన్‌చేస్తే స్పందించే వారు లేరు. నాడు-నేడు ప్రారంభంలో వీటిని సరఫరా చేసే ముందే... రాష్ట్రస్థాయిలోనే కంపెనీల నుంచి ప్రభుత్వంలోని కొందరు పెద్దల అనుయాయులు కోట్లలో గుడ్‌విల్ లాగేశారు. ఇతర రాషా్ట్రలకు చెందిన పలు కంపెనీల నుంచి ఆర్వో ప్లాంట్ల కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక తమకు సంబంధం లేదన్నట్లు కంపెనీలకు.. ప్రధానోపాధ్యాయులకు ముడిపెట్టారు. ఏదైనా సమస్య వస్తే... ప్రధానోపాధ్యాయుడు... కంపెనీ వాళ్లకు ఫోన్ చేసి రప్పించుకుని సమస్యను పరిష్కరించుకోవాలంట. దీంతో కంపెనీలకు సంబంధించిన టెక్నీషియన్లకు ఫోన్లు చేసినా... స్పందించడంలేదని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. ఫలితంగా స్కూళ్లలో ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంట్లు అలంకారప్రాయంగా మారాయి. పిల్లలకు ఇళ్ల నుంచి నీళ్లు తెచ్చుకోవడం తప్పని పరిస్థితి.
కంపెనీలకు చెబుతున్నాం
నాడు-నేడు ఆర్వో ప్లాంట్ల సమస్యలు ఉన్నాయి. ప్రధానోపాధ్యాయుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై కంపెనీల టెక్నీషియన్లకు సమాచారం ఇస్తున్నారు. ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలంటూ సూచించాం.
- శివకుమార్, ఈఈ, సమగ్రశిక్ష
అమ్మకందారులతో మాట్లాడాం
ఫిర్యాదులు వస్తున్న మాట వాస్తవమే. అమ్మకందారులను సంప్రదించాం. ఫోన్ నెంబర్లు తెప్పించాం. ప్రధానోపాధ్యాయులకు ఆ వివరాలు, ఇతర సమాచారం ఇచ్చాం. ఏ సమస్య వచ్చినా... వెంటనే పరిష్కరించాలని అమ్మకందారులకు ఆదేశాలిచ్చాం.
- తిలక్‌విద్యాసాగర్, ఏపీసీ, సమగ్రశిక్ష
0 Comments:
Post a Comment