Petrol Price to Cool | తగ్గనున్న పెట్రోల్ ధరలు.. సంచలన నిర్ణయం దిశగా కేంద్రం!
Petrol Price to Cool | భగభగమంటూ మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు దిగి రానున్నాయా.. సగటు భారతీయుడికి ఊరట కలిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం..
కేంద్ర ముడి చమురు సంస్థలు అడుగులేస్తున్నాయా.. అంటే అవుననే సమాధానమే వస్తున్నది. పెట్రోల్, డీజిల్ ధరలకు కళ్లెం వేయడానికి కేంద్రం, చమురు మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తున్నాయి. దేశీయంగా అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవడానికి సిద్దం చేసిన ముడి చమురు నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేయాలని కేంద్రం తలపోస్తున్నది.
5 మిలియన్ల బ్యారెళ్ల విడుదలకు సన్నాహాలు
దేశంలోని వ్యూహాత్మక ముడి చమరు నిల్వలు.. ఐదు మిలియన్ల బ్యారెళ్ల క్రూడాయిల్‌ను వినియోగంలోకి తేవడానికి ప్రణాళిక రూపొందిస్తున్నది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, భారత్ చరిత్రలో తన ఎమర్జెన్సీ నిల్వలను తొలిసారి విడుదల చేసినట్లవుతుంది. ఈ నిర్ణయం వారం రోజుల్లో అమలులోకి రానున్నది.
మూడు ప్రాంతాల్లో ముడి చమురు నిల్వలు
ఈస్ట్, వెస్ట్ కోస్తా ప్రాంతాల్లో మూడు చోట్ల అండర్‌గ్రౌండ్ కేంద్రాల్లో 5.33 మిలియన్ టన్నుల (38 మిలియన్ బ్యారెళ్ల) ముడి చమురు నిల్వలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో 1.33 మిలియన్ టన్నుల సామర్థ్యం, కర్ణాటకలోని మంగళూరులో 1.5 మిలియన్ టన్నుల, పాదూరులో 2.5 మిలియన్ టన్నుల ముడి చమురు నిల్వ చేయడానికి స్ట్రాటర్జిక్ రిజర్వులు కేంద్రం నిర్మించింది. ఈ కేంద్రాల నుంచి 7-10 రోజుల్లో 50 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ నిల్వలు కేంద్రం విడుదల చేయనున్నది. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనున్నది.
నిల్వల విడుదల బాటలో అమెరికా మిత్రదేశాలు
ఇప్పటికే అమెరికా, జపాన్ వంటి అతిపెద్ద దేశాలు ఇదే బాటలో ప్రయాణం ప్రారంభించాయి. అమెరికా, ఇతర మిత్ర పక్షాలతో కలిసి అంతర్జాతీయ ముడి చమురు ధరలను తగ్గించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. మున్ముందు క్రూడ్ ధరను నియంత్రించడానికి భారత్, దాని మిత్ర దేశాలు మరికొంత మొత్తం చమురు నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నాయి.
మంగళూరు నుంచి క్రూడ్ విక్రయం
మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ నిర్వహిస్తున్న స్ట్రాటర్జిక్ రిజర్వుల నుంచి క్రూడాయిల్‌ను రిఫైనరీలకు విక్రయిస్తారు. డిమాండ్‌కు అనుగుణంగా చమురు ఉత్పత్తి చేయాలన్న ప్రపంచ దేశాల విజ్ఞప్తులను ఒపెక్ కూటమి తోసిపుచ్చుతున్నది. రిజర్వు నిల్వలను విడుదల చేయడం ద్వారా ఒపెక్ వైఖరికి వ్యతిరేకంగా పెట్రోల్ ధరల తగ్గింపునకు కేంద్రం నిర్ణయం సంకేతం కానున్నది.
ధరల తగ్గింపునకు అమెరికా ఇలా అప్పీల్
అంతర్జాతీయ ఇంధన ధరలను తగ్గించాలని గతవారం చైనా, భారత్, జపాన్‌లను అమెరికా కోరింది. ఈ విషయమై సమన్వయంతో వ్యవహరించాలని అమెరికా కోరింది. ఇందుకోసం రిజర్వు చమురు నిల్వలను విడుదల చేయాలని అభ్యర్థించింది. చమురు ఉత్పత్తి పెంచి ధర తగ్గించాలన్న అభ్యర్థనను పట్టించుకోకపోవడంతో ఇప్పటికే సౌదీ అరేబియా నుంచి భారత్ చమురు దిగుమతి తగ్గించింది. ఇతర చమురు ఉత్పత్తి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది. సౌదీ అరేబియా సారధ్యం వహిస్తున్న ఒపెక్.. వచ్చే త్రైమాసికం వరకు ముడి చమురు ఉత్పత్తిలో కోత కొనసాగించాలని నిర్ణయించింది.
గ్లోబల్ ఎకానమీ రికవరీని ముడి చమురు ధరలు దెబ్బతీస్తాయని కేంద్ర చమురుశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గతవారం వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇతరదేశాలతో కలిసి వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేయనున్నాం. దీనిపై అమెరికా నిర్ణయంపై ఆధారపడి సూత్రప్రాయ ప్రకటన చేస్తామని అన్నారు.
రష్యా 4 లక్షల బ్యారెళ్లు ఉత్పత్తి చేస్తున్నా..
ప్రపంచంలోనే ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న మూడో అతిపెద్ద దేశం భారత్. అంతర్జాతీయ మార్కెట్ ధరలు పెరగడంతో దేశీయంగా తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ఒపెక్స్ ప్లస్‌లో సభ్యదేశం రష్యా ప్రతిరోజూ 4 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తి చేస్తున్నా.. రోజువారీ అవసరాలకు సరిపోవడం లేదు.
నాలుగో వేవ్‌తో దిగొచ్చిన క్రూడ్
మరోవైపు యూరప్ దేశాల్లో కరోనా నాలుగోవేవ్ ఉధృతి.. ముడి చమురు ధరను తగ్గించి వేసింది. గత నెల 26న గరిష్ఠంగా 86.40 డాలర్లకు చేరిన బ్యారెల్ ముడి చమురు ధర ఈ వారం 78 డాలర్లకు దిగి వచ్చింది. అతిపెద్ద దేశాలు రిజర్వు నిల్వలు విడుదల చేస్తే ఒపెక్ ప్లస్ దేశాలు ఉత్పత్తి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బ్రెంట్ క్రూడాయిల్ ధర 79 డాలర్లు పలుకుతోంది.
ఒపెక్ వల్లే గ్లోబల్ ముడి చమురు ధరలు ప్రియం
అమెరికాతోపాటు భారత్ కూడా కోవిడ్-19 నుంచి ఆర్థిక వ్యవస్థలు రికవరీ సాధిస్తున్నా.. ఒపెక్ సభ్య దేశాలు ఉత్పత్తి పెంచకుండా.. అకారణంగా ధర పెరుగుదలకు కారణం అవుతున్నాయి. ఇటీవల ఎక్సైజ్ డ్యూటీ తగ్గించకముందు దేశంలో రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పన్నుల్లో కోత విధించడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.60 వేల కోట్ల కోత పడుతుందని భావిస్తున్నారు. మరోవైపు పొరుగుదేశం చైనా.. క్రూడ్ విడదల చేయడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది. అందుకు సిద్ధం అని జపాన్ సంకేతాలిచ్చింది.
0 Comments:
Post a Comment