🔳మళ్లీ తెరపైకి పే స్కేల్ తగ్గింపు
పరిష్కారానికి నోచని విద్యుత్ ఉద్యోగుల సమస్యలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పేస్కేల్ తగ్గింపు మళ్లీ ముందుకు రావడం, విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తామన్న ప్రభుత్వ, ట్రాన్స్‌కో హామీలు అమలు కాకపోవడంపై విద్యుత్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. గత ఏడాది నవంబర్ 17న ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య జరిగిన ఒప్పందాలకు సంబంధించి ఇంతవరకు పురోగతి లేదు. విద్యుత్ సంస్కరణల సందర్భంలో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఎపిఎస్‌ఇబి ఇంజనీర్స్, ఎపిఎస్‌ఇబి ఎఇఇ అసోసియేషన్లు ఉమ్మడిగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రమోషన్లు, బదిలీలు, సెలవులు, అలవెన్స్, క్రమబద్ధీకరణ వంటి విషయాల్లో నిబంధనలను పాటించడం లేదని ఇంధన శాఖ కార్యదర్శికి లేఖలో తెలిపాయి. నిబంధనల ప్రకారం పెరుగుతున్న పనికి తగ్గట్టుగా కొత్త పోస్టులను ట్రాన్స్‌కో యాజమాన్యం సృష్టించడం లేదని, ప్రమోషన్లు ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల వేతన స్కేల్ తగ్గించే ఆలోచన లేదని విద్యుత్ సంఘాలకు మంత్రి జూన్‌లో హామీ ఇచ్చారు. మళ్లీ వేతనం తగ్గించేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. అందువల్లే కొంతమంది ఉద్యోగులు ఇప్పటికే స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేస్తున్నారనే వాదనలు విద్యుత్ శాఖలో వినిపిస్తున్నాయి. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 23వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు డిపార్ట్‌మెంట్ నుంచే నేరుగా జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ నెరవేరలేదు. ఈ సమస్యలను 30 రోజుల్లోనే పరిష్కరిస్తామని ఆ శాఖ మంత్రి హామీ ఇచ్చి ఏడాది గడిచినా పురోగతి లేకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. వీటిపై తమతో చర్చించాలని జెఎసి నాయకులు ప్రభుత్వానికి, యాజమానా ్యనికి ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా పరిగణనలోకి తీసుకోవడం లేదు.
విద్యుత్ చట్టసవరణకు వ్యతిరేకంగా 'అసెంబ్లీ' తీర్మానం చేయాలి
విద్యుత్ రంగాన్ని ప్రైవేట్‌పరం చేసే విద్యుత్ చట్ట సవరణ - 2021కు వ్యతిరేకంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశాయని, ఎపి ప్రభుత్వం కూడా తీర్మానం చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ బిల్లు వల్ల వినియోగదారులతో పాటు రాష్ట్రాలపై కూడా భారాలు పడతాయి. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయబోమని ప్రభుత్వం తరపున మంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
కెఆర్‌ఎంబి, జిఆర్‌ఎంబి గెజిట్ నోటిఫికేషన్లపై అభ్యంతరం
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జిఆర్‌ఎంబి) విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లపై ఇంజనీర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్టేక్ హోల్డర్లతో సంబంధం లేకుండా శ్రీశైలం కుడి వైపు పవర్ హౌస్, నాగార్జున సాగర్ జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఎలా స్వాధీనం చేసుకుంటారని ఇంజనీర్ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
0 Comments:
Post a Comment